పెను సంక్షోభంలో అసలు సిసలు నాయకుడు

పెను సంక్షోభంలో అసలు సిసలు నాయకుడు

నలభై ఏండ్లకు పైగా ఉన్న తన రాజకీయ, సామాజిక  ప్రస్థానంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ “సంక్షోభంలో విశ్వసనీయ నాయకుడి”గా అనేకసార్లు తనను తాను రుజువు చేసుకున్నారు. ముప్పును నిశితంగా చూడగలిగే అనుపమాన సామర్థ్యం, నిరంతర దాడులను తట్టుకునే రాజీపడని ధైర్యం, అనిశ్చితి, జటిల పరిస్థితులను చక్కదిద్దగల అసాధారణ మేధస్సు వంటివి ఆయన చాలా కాలంగా చూపుతూనే ఉన్నారు. సంక్షోభాలను చక్కదిద్ద గలిగే ఈ లక్షణాలే కాదు స్పందించే తత్వం, పరిష్కరించగలిగే నైపుణ్యం ఆయనను ఒక విశ్వసనీయ నాయకుడిగా నిలబెడుతున్నాయి. ప్రధాని మోడీ సహజ నాయకత్వ గుణాల్లో ఎంతటి సంక్షోభాన్నైనా ఎదుర్కొనగల కోణం ఉంది.  ఆయన వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రయాణం, 2001 నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా, 2014 నుంచి దేశ ప్రధానిగా పనితీరు అంతా జటిలమైన అడ్డంకులు, పగబట్టిన చికాకులు, క్రూరమైన సవాళ్ల కలబోతగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆయన ఏ ప్రతికూల పరిస్థితికీ తలొగ్గలేదు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు దాని పరిష్కారంపైనే దృష్టి నిలపగల సమర్థత, బహుముఖ వ్యూహాలతో భారీగా వనరులు సమీకరించగల సత్తా కారణంగా ఆయన ప్రతిసారి సానుకూల ఫలితాలే పొందుతున్నారు. సంక్షోభ సమయంలో కుంగిపోకుండా, వణికిపోకుండా నిలబడగల విలక్షణ స్వభావం ఆయనను సంక్షోభంలో విశ్వసనీయ నాయకుడిగా నిలబెడుతోంది.
సంక్షోభ నాయకత్వం అంటే?
సంక్షోభమంటే ఊహించని ప్రతికూల పరిస్థితి. ఇది ప్రతి ఒక్కరికీ సవాల్​గా నిలుస్తుంది, నాయకుడికి పెనుసవాల్​గా నిలుస్తుంది. సంక్షోభం చుట్టుముట్టినప్పుడు ఎలా స్పందిస్తారనేదే సంక్షోభ నాయకత్వం. ఏ రంగమైనా సరే సంక్షోభ నాయకత్వం అనేది స్పందించే తీరు, చర్యలు, అనుసరించే మార్గం, స్ఫూర్తి, అప్పగింతను బట్టి అంచనా వేస్తారు. నాయకత్వ సమర్థతను మదింపు చేసేందుకు అనేక కొలమానాలు ఉన్నప్పటికీ నాయకుల శ్రేణి, విలువ, గౌరవాన్ని అంచనా వేసేందుకు ఐదు ప్రాథమిక అర్హతలు గీటురాళ్లుగా నిలుస్తాయి. సత్తా లేని అనేక మంది నాయకత్వ బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదుగుతారు. వారసత్వంగా కావచ్చు, అదృష్టం కలిసిరావడం వల్ల అలా జరగవచ్చు. ఎటువంటి సంక్షోభం వారి హయాంలో చోటుచేసుకోకపోతే సునాయాసంగా తమ నాయకత్వ బాధ్యతల్లో ఉత్తీర్ణులవుతారు. కానీ, ఒక్క పెద్ద సంక్షోభం చాలు వారసత్వంగా వచ్చిన నాయకుడికి, సంక్షోభ నాయకుడికి మధ్య తేడాను బట్టబయలు చేసేందుకు. తొలి తరంలో ప్రతి ఒక్కరూ అట్టడుగు స్థాయి నుంచి ప్రతీది నిర్మించుకుని వచ్చారు కాబట్టి వారంతా సంక్షోభ నాయకులే. నాయకత్వానికి సంబంధించిన ఈ పరీక్షలో మోడీ అగ్రశ్రేణిలో పాస్ అవుతారు. చెప్పాలంటే ఆయన రాజకీయ ప్రస్థానం అంతా సంక్షోభ పరీక్షలమయమే. సవాల్ ఎదురైన ప్రతిసారి ఆయన విజయాన్నే అందుకున్నారు.
సంక్షోభంలో దార్శనిక సమీక్ష
భారీ ప్రయోజనాలు నిర్దేశించుకొని ఒక నిర్ధిష్ట కాలవ్యవధిలో వాటిని పూర్తి చేసుకునే దృష్టి కలిగి ఉంటే వారిని దార్శనిక నాయకుడనవచ్చు. దార్శనికత ఉంటేనే సరిపోదు. తన దార్శనికతను తన నాయకత్వం కింద ప్రతి ఒక్కరికీ ప్రభావవంతంగా తెలియజేయాలి. ప్రధాని మోడీ 2001 నుంచి ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ విజయబావుటా ఎగరవేశారు. దార్శనికతను నెరవేర్చుకునే మార్గంలో పయనిస్తున్న నాయకుడికి సంక్షోభం అనేది తీవ్రమైన అడ్డంకి. లక్ష్యసాధన కోసం దశాబ్దాలుగా చేస్తున్న కృషి అంతటినీ తుడిచిపెట్టగల సత్తువ సంక్షోభానికి ఉంటుంది. తన పయనాన్ని పునఃనిర్దేశించుకొని, తన లక్ష్యాలను పునఃరూపకల్పన చేసుకొని తాను నాయకత్వం వహిస్తున్న వారిని నవ్యపథంలో నడిపించడమన్నది సంక్షోభ సమయంలో కీలకం. సంక్షోభాలన్నవి తప్పనిసరని గ్రహించి వాటిని ఎదుర్కొనేందుకు నాయకులు సిద్ధంగా ఉండాలి. సంక్షోభం సృష్టించే సవాళ్లను తట్టుకునేందుకే సంక్షోభ నాయకులు ఏర్పడతారు. పునః రూపకల్పన అన్నది సంక్షోభ నాయకుడికి ఉండాల్సిన ప్రధాన సామర్థ్యం. దీనిని ఎంత వేగంగా, కచ్చితత్వంతో ఆ నాయకుడు చేస్తారో సంక్షోభ సమయంలోనూ, ఆ తర్వాత వారు సాధించే ఫలితాలను అవి అంతగా ప్రభావితం చేస్తాయి. ఎదురుదెబ్బలను తాను తట్టుకోగలనని ప్రధాని మోడీ గతంలోనూ, వర్తమానంలో నిరూపించారు.
అసమాన స్పందన
గొప్ప చర్యలు లేకుండా గొప్ప ఫలితాలు రావు. చేపట్టే చర్యల పరిమాణం, స్థాయిని బట్టి నాయకుడి గొప్పదనాన్ని నిర్వచించవచ్చు. సంక్షోభ సమయంలో ఈ చర్యలను సంక్షోభ స్పందనలుగా పరిగణిస్తారు. సంక్షోభ నాయకుడిగా మోడీకి తనదైన స్పందనా వ్యవస్థ ఉంది.  సంక్షోభపు జాడ పసిగట్టగానే ఆయన వెంటనే తన అసమాన స్పందనను వెలికితీస్తారు. ఉదాహరణకు, కరోనా రెండో దశలో ఆక్సిజన్ కొరతను ఎదుర్కొనేందుకు తన అసమాన స్పందనను వెలికితీసి సంక్షోభాన్ని చక్కదిద్దారు. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం బహుముఖ  విధానాలు, భారీ వనరులతో సమస్యను ఎదుర్కొని రోజుల వ్యవధిలోనే దానికి అడ్డుకట్ట వేయగలిగింది. మోడీ స్పందించిన తీరుతో దేశంలో మెడికల్ ఆక్సిజన్ మిగులు ఏర్పడనుంది. సమీప భవిష్యత్​లోనే అది ఎగుమతి చేసే స్థాయికి వెళ్తుంది. విశ్వసనీయ నాయకుడు వ్యవహరించే తీరు అది.
విధానం, అప్పగింత
సమస్యను విభిన్న మార్గాల ద్వారా చక్కదిద్దేందుకు కొత్త ప్రయోగాలు చేసేందుకు సంక్షోభాలు గొప్ప అవకాశాలు కల్పిస్తాయి. కొన్ని సందర్భాల్లో కొత్త విధానాలు అనుసరించడం మినహా నాయకులకు మరో మార్గం ఉండదు. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న నాయకులు సంక్షోభాన్ని క్రియాశీలకంగా వాడుకుంటూ కొత్త విధానాలు, కొత్త మార్గాలు, కొత్త పరికరాలను పరీక్షిస్తూ ఉంటారు. సంక్షోభ నిర్వహణలో 2014 నుంచి మోడీ అనేక విధానాలు ప్రారంభించారు. ఆయనపై నిరంతరంగా ప్రతిపక్షాలు దాడి చేస్తుంటే ఆయన మాత్రం సమస్యలను ఒకదాని తర్వాత ఒకటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. జాతి విస్తృత ప్రయోజనాల కోసం ఆయన చేస్తున్న కృషి, ఆయనకున్న ఆత్మవిశ్వాసం ఆయనను సంక్షోభంలోనూ అజేయుడిగా నిలబెడుతోంది. ఈ సంక్షోభం ఆయనను పతనానికి చేర్చుతుందని కొందరు కలలుగంటున్నారు. ఆయన అసమర్థుడని చెప్పేందుకు వందల సంఖ్యలో కథనాలు రాస్తున్నారు. వీడియోలు సృష్టిస్తున్నారు. కానీ, ఒత్తిడి సృష్టించి లొంగదీసుకునేందుకు మోడీ ఆషామాషీ వ్యక్తేం కాదు. ప్రజలు తన పనితీరే కొలమానంగా భావిస్తారని నమ్మే వ్యక్తి. అందుకే తన పనితీరు ద్వారానే ఫలితాలు సాధించే దిశగా నిరంతరం శ్రమిస్తున్నారు.

సంక్షోభ నాయకత్వమన్నది అసాధారణ ఆట. అందులో నియమాలు, నిబంధనలు ఉండవు. నేర్పేందుకు గురువులు ఉండరు.  సంక్షోభమనేది అన్నింటినీ ముంచేసి అనిశ్చితి, బాధ, గందరగోళం, ఒత్తిడి అనే సమస్యల సుడిగుండాన్ని సృష్టిస్తుంది. ఆ సుడిగుండంలో ప్రయాణిస్తూ ఆ ప్రళయాన్ని దారి మళ్లించేందుకు సునిశిత దృష్టి, గొప్ప లక్ష్యాలు సాధించేందుకు సమర్థత అవసరం. తీవ్ర తుపాన్లను తట్టుకునే సంక్షోభ నాయకుడిగా స్వాభావిక లక్షణం మోడీకి ఉన్నట్టు నా కంటికి కనిపిస్తోంది. సంక్షోభంతో జాతి తల్లడిల్లుతున్నఈ సమయంలో దృఢ చిత్తం, సాహసం, ఫలితాలు సాధించే మోడీ ప్రధానిగా ఉండటం దేశం చేసుకున్న అదృష్టం. అంతర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభాన్ని పారదోలేందుకు ప్రపంచానికి నేడు ప్రతి రంగంలోనూ సంక్షోభ నాయకుల అవసరం ఎంతైనా ఉంది.

నిరంతర ప్రేరణ
అంతా సవ్యంగా ఉన్నప్పుడు ప్రేరణగా నిలవడం సులభం. కానీ క్లిష్టసమయంలో ప్రేరణగా నిలవడమన్నది సంక్షోభ నాయకత్వాన్ని తెలియజేస్తుంది. సంక్షోభ సమయంలో నిరంతర ప్రేరణ ఎలా అందించాలో గుర్తెరిగిన నాయకుడు మోడీ. ఆయనున్న హోదాలో రోజువారీ ప్రణాళికలు, సమీక్షలు చేస్తే సరిపోతుంది. కానీ, ఆయన సమయం కేటాయించి అందరితో నిరంతరం మాట్లాడతారు, వారిలో ప్రేరణ నింపుతారు. వ్యక్తిగత, సంస్థాగత, జాతీయ కృషిని బోల్తా కొట్టించి, భ్రష్టుపట్టించే శక్తి సంక్షోభానికి ఉంటుంది. ఆ సంక్షోభ స్థాయి, పరిమాణాన్ని బట్టి ఆత్మవిశ్వాసం, ఉత్సాహం, ఉద్దేశ స్ఫూర్తిని అది ప్రతికూలపరుస్తుంది. అది ఉత్పాదకత, వ్యక్తులు, సంస్థల పనితీరును ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రభావితం చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను దుస్థితి, నిరాశ, ఆత్మవిశ్వాసలేమి నుంచి బయటపడేసి వారిలో కొత్త ఉత్సాహం, స్ఫూర్తిని నింపాల్సిన బాధ్యత తనపై ఉందని మోడీ అర్థం చేసుకున్నారు. తన ఆలోచనలు, చర్యలు, మాటలు, చొరవ ద్వారా ఆయన ప్రతికూల మకిలి నుంచి బయటపడి ప్రజలను కొత్త ఆశ, కాంతి వైపు నడిపిస్తున్నారు.

సంక్షోభం - ఒక అవకాశం
సంక్షోభం ఎక్కువకాలం కొనసాగితే అది చర్యలకు విఘాతం కలిగిస్తుంది, ఆ ప్రభావం ఫలితాలపై పడుతుంది. కానీ, సంక్షోభ నాయకుడు సవాల్నే అవకాశంగా మల్చుకుని, వినూత్న చర్యల ద్వారా ఫలితాలు పొందేందుకు ప్రయత్నిస్తారు. తన ప్రభుత్వ ఎజెండాను దెబ్బతీసే అవకాశం సంక్షోభానికి మోడీ ఇవ్వడం లేదు. తన ఎజెండా అమలు చేసేందుకు భిన్నమైన విధానాన్ని అనుసరిస్తారు, ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో దాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తారు. ఉదాహరణకు ఆరోగ్య మౌలిక వసతుల విస్తరణ, జాతీయవాదంతో దేశాన్ని ఏకీకృతం చేయడం, ఆరోగ్య దౌత్యం, తయారీ రంగంలో సంస్కరణలు, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, రక్షణ సంసిద్ధత, సామాజిక మాధ్యమాల సంస్కరణల వంటి అనేక చర్యలు సంక్షోభాన్ని అవకాశాలుగా మల్చుకున్న తీరుకు సూచికలు. ఆయన సానుకూల దృక్పథం, భావోద్వేగ మేధస్సు, స్థిరమైన వ్యక్తిత్వం వంటివి ఆయనను సానుకూలంగా, అప్రమత్తంగా ఉండేలా నిలబెడుతూ అన్ని ప్రతికూలతలను అవకాశాలుగా మల్చుకునేందుకు దోహదకారిగా నిలుస్తాయి.                                                                                          - కె.కృష్ణసాగర్​రావు,బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి