
- జపాన్ నుంచి చైనాలోని తియాంజిన్‌కు చేరుకున్న పీఎం
- నేడు, రేపు ఎస్సీవో 25వ సమిట్‌కు హాజరు
- ఇయ్యాల జిన్‌పింగ్‌తో, రేపు పుతిన్‌తో భేటీ
టోక్యో/తియాంజిన్: ప్రధాని నరేంద్ర మోదీ ఏడేండ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టారు. జపాన్‌లో రెండు రోజుల పర్యటనను ముగించుకున్న ప్రధాని శనివారం సాయంత్రం చైనాలోని తియాంజిన్ సిటీకి చేరుకున్నారు. తియాంజిన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన మోదీకి చైనీస్ కళాకారులు సంప్రదాయ నృత్యంతో వెల్ కమ్ చెప్పారు. అనంతరం ఎయిర్ పోర్టు టెర్మినల్‌లో భారతీయ శాస్త్రీయ సంగీతం, భరత నాట్యంతో ఘనంగా స్వాగతం పలికారు. మోదీకి స్వాగతం పలికేందుకు భారత సంతతి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ‘భారత్ మాతా కీ జై’, ‘వందే మాతరం’ నినాదాలతో హోరెత్తించారు.
తియాంజిన్‌లో రెండు రోజులపాటు జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) 25వ యాన్యువల్ సమిట్‌కు10 సభ్య దేశాల అధినేతలతో కలిసి మోదీ హాజరుకానున్నారు. ఈ సమిట్ సందర్భంగా ఆదివారం చైనా ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్‌తో, సోమవారం రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. గల్వాన్ లోయలో 2020లో ఇండో, చైనీస్ బలగాల మధ్య ఘర్షణతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గత కొన్ని నెలలుగా బార్డర్ వివాదంపై రెండు దేశాలు చర్చలు జరుపుతూ ఉద్రిక్తతలు తగ్గించుకున్నాయి. మరోవైపు, భారత్ పై అమెరికా భారీగా టారిఫ్‌లు వేసిన నేపథ్యంలో రష్యా, చైనాతో వాణిజ్య సంబంధాలను మరింత పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిన్ పింగ్‌తో భేటీలో బార్డర్ వివాదం, ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం వంటి అంశాలపై మోదీ చర్చించనున్నారు. పుతిన్‌తో ద్వైపాక్షిక అంశాలతోపాటు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఆమెరికా పెనాల్టీ వేయడం, ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు చర్చించే అవకాశాలు ఉన్నాయి.
గణేశుడిపై ‘ఎక్స్’లో చైనా పోస్ట్
ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో ఢిల్లీలోని చైనీస్ ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ శుక్రవారం గణేశుడి ప్రతిమ, మోగావో కేవ్స్ పెయింటింగ్ ఫొటోలను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘‘చైనాలో తాంగ్ డైనాస్టీ కాలంలోనూ గణేశుడి ప్రతిమలు ఉన్నాయి. దీనికి
మోగావో కేవ్స్‌లోని గణేశుడి పురాతన పెయింటింగ్‌లే నిదర్శనం” అని ఆమె పేర్కొన్నారు
గవర్నర్లతో మోదీ భేటీ
ఉదయం టోక్యోలో జపాన్ లోని 16 ప్రిఫెక్చర్స్ (రాష్ట్రాలు) గవర్నర్లతో కూడా మోదీ భేటీ అయ్యారు. కాగా, 15వ ఇండియా–జపాన్ వార్షిక సదస్సు కోసం మోదీ శుక్రవారం జపాన్‌కు చేరుకున్నారు. ఈ సమిట్ సందర్భంగా ఇరుదేశాల మధ్య బుల్లెట్ ట్రెయిన్లు, చంద్రయాన్ 5 మిషన్‌లో సహకారం, ఇండియాలో 10 లక్షల కోట్ల యెన్ ల(రూ. 60 వేల కోట్లు) పెట్టుబడులు సహా మొత్తం 13 ఒప్పందాలు కుదిరాయి.
కాగా, జపాన్ పర్యటనలో ఆ దేశ ప్రధాని షిగేరు ఇషిబా, ఆయన భార్య యోషికో ఇషిబాకు ప్రధాని మోదీ గిఫ్ట్‌లు అందజేశారు. కాగితంతో చేసిన చిన్న అగ్గిపెట్టెలాంటి బాక్స్ లో ఉంచిన పాష్మినా శాలువా, రాతితో చేసిన రామెన్ బౌల్, సిల్వర్ చోప్ స్టిక్స్ వంటివి ఇందులో ఉన్నాయి. పాష్మినా శాలువాను లడఖ్ కు చెందిన ఛంగ్తంగి మేక ఉన్నితో తయారు చేయగా.. స్టోన్ బౌల్‌ను ఏపీ నుంచి తెచ్చిన మూన్ స్టోన్, రాజస్తాన్‌కు చెందిన మక్రానా మార్బుల్‌తో తయారు చేశారు.
మోదీకి జెలెన్ స్కీ ఫోన్
ప్రధాని మోదీతో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ శనివారం ఫోన్లో మాట్లాడారు. ఎస్ సీవో సమిట్ సందర్భంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తో మోదీ భేటీ కానున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లో శాంతికి కృషి చేయాలని ప్రధానిని ఆయన కోరారు. జెలెన్ స్కీతో ఫోన్ లో మాట్లాడిన తర్వాత మోదీ ఈ విషయాన్ని ‘ఎక్స్’లో పంచుకున్నారు.