ఈ స్కీమ్ తో పల్లెలు కూడా పట్టణాలైతయ్‌

ఈ స్కీమ్ తో పల్లెలు కూడా పట్టణాలైతయ్‌

న్యూఢిల్లీ: లాక్​డౌన్​ కారణంగా సొంతూళ్లకు చేరుకున్న వలస కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కొత్త పథకాన్ని ప్రారంభించారు. బీహార్​లోని కతిహార్​ జిల్లాలో ఓ గ్రామం నుంచి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ స్కీమ్​ను ప్రారంభించారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల సీఎంలు కూడా ఈ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. గరీబ్​ కల్యాణ్​ రోజ్​గార్​ అభియాన్​ పేరుతో లాంచ్​ చేసిన ఈ పథకం కింద 116 జిల్లాల్లో వలస కూలీలకు పనులు చూపెట్టనున్నారు. 125 రోజుల పాటు ఉండే ఈ పనులతో వలస కూలీలకు ఉపాధి దొరుకుతుందని పీఎంవో వర్గాలు చెప్పాయి. మైగ్రెంట్​ వర్కర్స్ తో పాటు వివిధ టెక్నాలజీ నిపుణులు కూడా గ్రామాలకు చేరుకున్నారని, దీంతో గ్రామాల్లో ఇంటర్​ నెట్​వాడకం పెరిగిందని తెలిపాయి. దీంతో నెట్​ స్పీడ్​ పెంచాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించాయి. సిటీల అభివృద్ధికి కారణమైన చేతులే ఇప్పుడు గ్రామాలకు చేరాయని, దీంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పుడు ప్రవేశ పెట్టిన కొత్త స్కీమ్​ కూడా వారికి తోడ్పడుతుందని చెప్పారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో జనం తీసుకుంటున్న ముందు జాగ్రత్తలను ఆయన మెచ్చుకున్నారు. ఈ స్కీమ్​ను ప్రారంభించడానికి ముందు కొంతమంది వలస కార్మికులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు. లాక్​డౌన్​ టైంలో ప్రభుత్వం తీసుకొచ్చిన పలు సంక్షేమ పథకాలు ఉపయోగపడ్డాయా ? అని ప్రధాని వారిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు, లడక్​లో చైనా సైనికులతో పోరాడుతూ వీరమరణం పొందిన బీహార్​ రెజిమెంట్​సైనికులకు ఆయన నివాళులర్పించారు. వారి త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదన్నారు.

రూరల్​ ఎంప్లాయ్​మెంట్​ స్కీమ్​కు భిన్నం

ఇప్పటికే అమలులో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పోలిస్తే గరీబ్​ కల్యాన్​ రోజ్​గార్​ అభియాన్​ పథకం భిన్నమైందని అధికార వర్గాలు తెలిపాయి. ఉపాధి హామీ(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) స్కీమ్​ కింద ఏడాదిలో 100 రోజుల పని కల్పిస్తారు. దేశం మొత్తానికీ వర్తించే పథకమిది. ఈ స్కీమ్​ కింద పెద్ద సంఖ్యలో పనులు చేపట్టవచ్చు. బలహీన వర్గాలకు చెందిన రైతుల వ్యవసాయ భూముల్లో పనులను కూడా ఈ పథకం కింద చేయించవచ్చు. చేసిన పనికి ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుంది. లాక్​ డౌన్​ కారణంగా సొంతూళ్లకు వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు చేపట్టిన పథకం గరీబ్​ కల్యాన్​ రోజ్​గార్​ అభియాన్.. ఇది వన్​ టైం ఎంప్లాయ్​మెంట్​ స్కీమ్​ మాత్రమే. దేశంలోని ఎంపిక చేసిన 116 జిల్లాల్లో వలస కూలీలకు 125 రోజుల పాటు ఉపాధి కల్పించేందుకు ఉద్ధేశించిన స్కీమ్​ ఇది.

12 శాఖలు ఒక్కటై..

ప్రభుత్వంలోని 12 శాఖలు కలిసికట్టుగా అమలు చేయాల్సిన పథకమిది. రూరల్​ డెవలప్​మెంట్​ శాఖ, పంచాయతీరాజ్, రోడ్​ ట్రాన్స్​పోర్ట్ అండ్​ హైవేస్, మైన్స్, డ్రింకింగ్​ వాటర్ ​అండ్​ శానిటేషన్, ఎన్విరాన్​మెంట్, రైల్వే, పెట్రోలియం అండ్​ నేచురల్​ గ్యాస్, న్యూ అండ్​ రెన్యూవబుల్​ ఎనర్జీ, బార్డర్​ రోడ్స్, టెలీకాం, వ్యవసాయ శాఖ.

25 రకాల పనులు

పేదవారికి ఇళ్లు కట్టివ్వడం, మొక్కలు నాటడం, జల్​జీవన్​ మిషన్​ కింద తాగునీటి సరఫరా, పంచాయతీ భవనాల నిర్మాణం, కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణం, గ్రామీణ మండీలు, గ్రామీణ రోడ్లు, అంగన్​ వాడీ భవ నాల నిర్మాణం తదితర 25 రకాల పనులతో కూలీలకు సొంతూళ్లోనే 125 రోజులు ఉపాధి కల్పిస్తారు.