లోక కళ్యాణమే ఆయన జీవన మంత్రం

లోక కళ్యాణమే ఆయన జీవన మంత్రం

యూపీ మాజీ సీఎం, సీనియర్ బీజేపీ నేత కళ్యాణ్ సింగ్ తన జీవితమంతా నిజాయతీకి మారు పేరుగా బతికారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన యూపీకి మంచి పరిపాలన అందించారని కీర్తించారు. యూపీతో పాటు దేశ అభివృద్ధికి కళ్యాణ్ సింగ్ తన వంతు కృషి చేశారని, లోక కళ్యాణం, జన సంక్షేమమే తన జీవన మంత్రంగా మార్చుకుని ఆయన బతికారని చెప్పారు. కొద్ది రోజులుగా అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించిన కళ్యాణ్ సింగ్ (89)కు పార్థివ దేహానికి ఈ రోజు ఉదయం ప్రధాని మోడీ నివాళి అర్పించారు. ఉదయం ఢిల్లీ నుంచి లక్నో చేరుకుని  కళ్యాణ్ సింగ్ ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు సీనియర్ నేతలు కళ్యాణ్ సింగ్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఒక సమర్థవంతమైన నాయకుడిని కోల్పోయామన్నారు. కళ్యాణ్‌ సింగ్ జీవితమంతా జన కళ్యాణమే తన జీవన మంత్రంగా మార్చుకుని బతికారని అన్నారు. కాగా, నరోరాలో గంగా నదీ ఒడ్డున రేపు (సోమవారం) కళ్యాణ్‌ సింగ్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.