
పాకిస్థా్న్ పైకి చూడటానికి ప్రజాస్వామ్య దేశంలా కనిపించినప్పటికీ అక్కడ ఆర్మీ చేతిలోనే పవర్స్ అన్నీ ఉంటాయి. ప్రధానులుగా చేసిన వారు తర్వాత అక్కడి జైళ్లకు వెళ్లటం లేదా పాక్ వదిలి పారిపోవాల్సిన పరిస్థితులను చూశాం. ప్రస్తుతం పాక్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ స్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ అక్కడి జైలులో మగ్గుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాక్ లోని అడియాలో జైలులో ఉన్న తనను ఉగ్రవాదుల కంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తనపై జైలులో వేధింపులు తీవ్రమయ్యాయని వాపోయారు. తన భార్య బుష్రా బీబీ కూడా సమస్యలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. చట్టపరంగా అందాల్సిన ప్రాథమిక హక్కులు కూడా తమ ఇద్దరికీ వర్తింపజేయటం లేదని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ALSO READ : అమెరికా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో బాంబు పేలుళ్లు : 3 ఆఫీసర్స్ మృతిపై ట్రంప్ సీరియస్
72 ఏళ్ల క్రికెటర్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన ఆయనపై అనేక కేసులు నమోదైన తర్వాత ఆగస్టు 2023 నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఆదేశాల మేరకు జైలు అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నట్లు చెప్పారు. దోషులుగా తేలిన ఉగ్రవాదుల కంటే దారుణంగా తనను చూస్తున్నట్లు చెప్పారు. హత్య కేసులో శిక్ష పొందుతున్న సైనిక అధికారి ఒకరు జైలులు వీఐపీ ట్రీట్మెంట్ పొందుతున్నట్లు చెప్పుకొచ్చారు ఇమ్రాన్.
జైలులో తనకు లేదా తన భార్యకు ఏదైనా జరిగితే అసిమ్ మునీర్ కారణమని తన పార్టీ అనుచరులకు చెప్పారు. ఖాన్ సోదరి అలీమా ఖాన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను అప్‌లోడ్ చేసింది.. అందులో ఆమె తన సోదరుడి సందేశాన్ని పీటీఐ పార్టీ సభ్యులకు తెలియజేసింది. గతంలో ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి అసిమ్ మునీర్ ను తొలగించినప్పుడు.. అతను జూల్పీ బుఖారీ అనే పీటీఐ నాయకుడి ద్వారా బుష్రా బీబీని సంప్రదించటానికి ప్రయత్నించగా ఆమె నిరాకరించింది. ప్రస్తుతం ఆ ద్వేషంతోనే మునీర్ తమ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నట్లు ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అయితే ఈ అణచివేతలు, నిరంకుశత్వానికి తలవంచేదే లేదని అన్నారు ఇమ్రాన్ ఖాన్.