ఛత్రపతికి ప్రధాని మోడీ నివాళులు

ఛత్రపతికి ప్రధాని మోడీ నివాళులు

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. ఆయన నాయకత్వం తరతరాలకు స్పూర్తినిస్తూనే ఉందని మోడీ అన్నారు. సత్యం, న్యాయం విషయంలో ఆయన ఎన్నడూ రాజీపడలేదని ప్రధాని కొనియాడారు. శివాజీ మహారాజ్ ఆశయాలను నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని మోడీ తెలిపారు.

‘ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయనకు నమస్కరిస్తున్నాను. ఆయన విశిష్టమైన నాయకత్వం, సాంఘిక సంక్షేమానికి ఆయనిచ్చిన ప్రాధాన్యత తరతరాలకు గుర్తుంటుంది. సత్యం, న్యాయం యొక్క విలువల కోసం నిలబడే విషయంలో ఆయన ఏనాడూ రాజీపడలేదు. ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం’ అని మోడీ ట్వీట్ చేశారు.

యావత్‌ భరత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే వీరుడు ఛత్రపతి శివాజీ. పుట్టుకతోనే వీరత్వాన్ని పుణికిపుచ్చుకున్న శివాజీ గొప్ప యోధుడే కాదు యుద్ధ తంత్ర నిపుణుడు కూడా. మరాఠా రాజ్యాన్ని స్థాపించాడు.. మొఘల్‌ చక్రవర్తులను ఎదిరించాడు. వారి సామ్రాజ్యాన్ని తన హస్తగతం చేసుకున్నాడు. ఎన్నో కోటలను తన స్వాధీనంలోకి తెచ్చుకుని ప్రజలకు అమోఘ పరిపాలనందించిన  బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ. మొఘలులను గడగడలాడించి ఆనాడే సమానత్వ సాధనకు ఎంతో కృషి చేశాడు. హిందుత్వాన్ని అనుసరించాడు. అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డాడు శివాజీ. 

శివాజీ క్రీ.శ.1630 ఫిబ్రవరి 19న పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి దంపతులకు పుట్టాడు. శివాజీ తల్లిదండ్రులు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశానికి చెందిన ఆడపడుచు (దేవగిరి మరాఠా యాదవ రాజుల వంశం). శివాజీకి ముందు పుట్టిన అందరూ చనిపోతుండగా.. శివాజీ పుట్టిన తర్వాత చనిపోకూడదని ఆయనకు తన ఇష్టదైవమైన శివై పార్వతి పేరు శివాజీకు పెట్టింది. 

శివాజీ తన మొదటి యుద్ధాన్ని 17 ఏండ్ల వయసులోనే ప్రారంభించాడు. ఆ యుద్ధంలో బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన, రాజ్‌ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకుని మొఘలులను గడగడలాడించాడు. చిన్న వయసులోనే యుద్ద మెళకువల్లో ఆరితేరి చక్రవర్తిగా అనేక సామ్రాజ్యాలను సొంతం చేసుకున్న దీరుడు శివాజీ. తన జీవిత కాలంలో ఎన్ని యుద్దాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్దంలో ఓడిపోయినా, శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్దం చేయలేని వారికి, స్త్రీలకు, పసివారికి సాయం చేసేవాడు. యుద్దతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలన విధానంలో కూడా శివాజీ అగ్రగణ్యుడు. ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రాన్ని పాటిస్తూ వ్యక్తిగత విలాసాలకు తావులేకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన బహుజన ధీరుడు శివాజీ.

తన సామ్రాజ్యంలో అన్ని మతాలను సమానంగా చూసి ఆనాడే అనేక గుళ్లతో పాటు మసీదులను నిర్మించిన సమానత్వవాది శివాజీ. సైన్యంలో మూడొంతుల ముస్లింలు ఉన్నత పదవుల్లో ఉండి పరిపాలన కొనసాగించారు. అందులో ముఖ్యంగా హైదర్ అలీ ఆయుధాల విభాగం,  ఇబ్రహీంఖాన్  నావికాదళానికి అధిపతులుగా ఉండేవారు.  అలాగే శివాజీ తన సైన్యానికి మరో ఇద్దరి ముస్లింలను సర్వ సైన్య అద్యక్షులుగా నియమించి పాలన సాగించాడు. అయితే మహోన్నత ఘనుడైన శివాజీనీ.. బీసీ శూద్ర కులస్థుడని ఆనాడే ఆయన పట్టాభిషేకాన్ని నిరాకరించిన ఓ పండితుడు కాలిబొటన వేలితో ఆయన నుదుట తిలకం దిద్ది అవమానపరిచాడు.