Golden Globe award 2023:RRR కి మోడీ ప్రశంస

Golden Globe award 2023:RRR కి మోడీ ప్రశంస

ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి, పాట రచయిత చంద్రబోస్ సహా ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లను ట్యాగ్ చేస్తూ వారికి అభినందనలు తెలియజేశారు. ఈ అవార్డు భారతదేశాన్ని గర్వపడేలా చేసిందని మెచ్చుకున్నారు. అందులో భాగంగా ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ను కూడా ఆయన కొనియాడారు. దాంతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ను అనౌన్స్ చేస్తున్న వీడియోను ఆర్ఆర్ఆర్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. ఆ ట్వీట్ ను ప్రధాని మోడీ రీట్వీట్ చేశారు.

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో దుమ్ము దులుపుతోంది. ఇప్పటికే పలు అవార్డులు, రివార్డు అందుకున్న ఈ చిత్రం.. తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైంది. లాస్ ఏంజిల్స్ అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలో బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ నిలిచిదంటూ అనౌన్స్ చేయడంతో మూవీ టీం ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమానికి రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిలు సతీసమేతంగా హాజరు కాగా.. ఆర్ఆర్ఆర్ కు ఈ అవార్డు రావడంపై సినీ అభిమానులతో పాటు, పలు రాజకీయ, సినీ ప్రముఖులు సైతం అభినందనలు తెలియజేస్తున్నారు.