బాపూ జీవితం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు

బాపూ జీవితం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు

న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ 151వ జయంతి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ జాతిపితను మోడీ స్మరించుకున్నారు. మహాత్ముడి జీవితం, ఆలోచనల నుంచి అనేక పాఠాలను నేర్చుకోవచ్చునని చెప్పారు. ‘గాంధీ జయంతి రోజున ప్రియమైన బాపూకు వందనాలు. ఆయన జీవితం, అపూర్వమైన ఆలోచనల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. సుసంపన్నమైన, దయ కలిగిన భారతదేశాన్ని నిర్మించడంలో బాపూ ఆశయాలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి’ అని మోడీ ట్వీట్ చేశారు.

భారత పూర్వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన సేవలను మోడీ గుర్తు చేసుకున్నారు. ‘ఎల్‌‌బీ శాస్త్రిజీ వినయం కలిగిన బలమైన వ్యక్తి. దేశ సంక్షేమం కోసం జీవించారు. భారత్‌‌కు అందించిన సేవలకు గాను జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుందాం’ అని మోడీ ట్వీట్ చేశారు.

మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ సేవలను రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. బాపూ తన బోధనల ద్వారా నిజం, ప్రేమ వైపు దారి చూపించారని వెంకయ్య తెలిపారు. తన ఆదర్శప్రాయమైన నాయకత్వంతో లాల్ బహదూర్ శాస్త్రి క్లిష్టమైన సమయాల్లో దేశాన్ని నడిపించారన్నారు. భారత దేశ రైతన్న ప్రాధాన్యతను, దేశానికి రక్షణగా నిలిచే సైనికుడి గొప్పతన్నాన్ని చాటారని శాస్త్రిని గుర్తు చేసుకున్నారు.

’నిజం మాట్లాడాలని బాపూ ఇచ్చిన సందేశం, అహింస, ప్రేమతో మహాత్ముడు వేసిన బాటలో ప్రపంచం సమాజంలో సమానత్వాన్ని సాధించింది. మానవత్వానికి గాంధీ స్ఫూర్తిగా నిలుస్తారు’ అని బాపూను ప్రెసిడెంట్ కోవింద్ గుర్తు చేసుకున్నారు.