విజయ సంకల్ప సభ లైవ్ అప్ డేట్స్..

విజయ సంకల్ప సభ లైవ్ అప్ డేట్స్..

హైదరాబాద్: ప్రధాని మోడీ హైదరాబాద్ 2 రోజుల పర్యటన సందర్భంగా సిటీ అంతా కాషాయమయం అయ్యింది. రాష్ట్ర నలుమూలల నుంచి బీజేపీ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ప్రత్యేక బస్సులు, రైళ్లలో సిటీకి చేరుకుంటున్నారు. కొందరు బైక్ లపై భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి వస్తున్నారు. సిటీమొత్తం ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ , బీజేపీ జెండాలతో రెపరెపలాడుతున్నాయి. నగరంలో ఎటువైపు చూసినా కమలం జెండాలే కనిపిస్తున్నాయి.

డబుల్ ఇంజన్ సర్కారు కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు : మోడీ

బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి ఎంతో వేగంగా జరుగుతోందన్నారు దేశ ప్రధాని మోడీ. డబుల్ ఇంజన్ సర్కారు కోసం తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ నలుదిక్కులా అభివృద్ధి చెందాలన్నదే బీజేపీ ప్రాధాన్యమని, రాష్ట్రభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఇక తెలంగాణలో ఉచితంగా వ్యాక్సినేషన్ అందించామన్నారు. పేదలకు ఉచిత కరోనా వైద్యం అందాలనే కేంద్ర ప్రభుత్వ విధానం కూడా పక్కాగా అమలవుతోందని, అందుకే ప్రజలు బీజేపీపై నమ్మకంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణలో కూడా బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు ఎంతో సఫలత ఇచ్చారుని చెప్పారు. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి ఎంతో వేగంగా జరుగుతోందన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు కోసం తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ నలుదిక్కులా అభివృద్ధి చెందాలన్నదే బీజేపీ ప్రాధాన్యమని, రాష్ట్రభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.

బండి సంజయ్ భావోద్వేగం 


బీజేపీ ‘విజయ సంకల్ప సభ’లో ప్రసంగిస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. దేశానికి మోడీ చేసిన సేవలను కొనియాడుతూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ప్రధాని మోడీపై కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు తప్పుడు భాషను వాడుతుంటే చూస్తూ కూర్చోవాలా ? అని ఆయన ప్రశ్నించారు.  ఒక్కసారి ఆ మహానుభావుడు మోడీకి ఘనంగా స్వాగతం పలికితే.. గడీలో బందీగా మారిన తెలంగాణ తల్లి పులకరించిపోతుంది. తెలంగాణ తల్లికి  ధైర్యం వస్తుంది. బీజేపీ సేన యుద్ధానికి సిద్ధమైందనే సంకేతం వెళ్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. అందరూ లేచి నిలబడి జై మోడీ నినాదాలు చేయాలని సంజయ్ కోరగానే.. సభకు హాజరైన బీజేపీ శ్రేణులు, వేదికపైనున్న పార్టీ నాయకులంతా కలిసి నిలబడి ‘జై మోడీ.. జై మోడీ’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ.. ‘‘ పేదలను ఆదుకున్న దేవుడు మా మోడీ’’ అని అన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా కేసీఆర్ గడీని బద్దలు కొట్టే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు.

మంత్రగాడి మాటలు విని కేసీఆర్ సచివాలయానికి రావడం లేదు : అమిత్ షా

కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకే కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. యువతకు ఉపాధి అంటే.. కేసీఆర్ దృష్టిలో ఆయన కొడుకును సీఎం చేయడమేనని వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ప్రధాన మోడీ ‘విజయ సంకల్ప సభ’లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పార్టీ గుర్తు కారు. కానీ దాని స్టీరింగ్ ఓవైసీ చేతుల్లో ఉందని అన్నారు. 8 ఏళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ సచివాలయానికి ఎందుకు వెళ్లరు ? సచివాలయానికి వెళ్తే ప్రభుత్వం పడిపోతుందని మంత్రగాడు చెప్పాడు. అలాంటి నమ్మకాలున్న వ్యక్తి సీఎంగా కొనసాగకూడదు. ఇక ఇప్పుడు సచివాలయానికి వెళ్లేది బీజేపీ ముఖ్యమంత్రేనని అమిత్ షా పేర్కొన్నారు. 

తెలంగాణపై ప్రధాని మోడీ ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని.. మరికాసేపట్లో హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతున్నానంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, ప్రారంభించిన సంక్షేమ పథకాలు సమాజంలోని అన్ని వర్గాలు లబ్ది పొందాయని మోడీ పేర్కొన్నారు. కేంద్ర పథకాలతో రైతులు, యువకులు, మహిళలు ముఖ్యంగా అణగారిన వర్గాలకు మేలు జరిగిందని ప్రధాని మోడీ తెలిపారు. 

నిరంకుశ పాలనకు ముగింపు పలకండి : యోగి

ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో తెలంగాణలోనూ కమలం వికసిస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగుతున్న నిరంకుశ పాలనకు ముగింపు పలకడంతో పాటు బీజేపీపై జరుగుతున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. యూపీలో డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల సుపరిపాలన సాగుతోందని, కేంద్ర పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయని చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ లో 6 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల హెల్త్ కవరేజీ అందించడంతో పాటు కరోనా కారణంగా గత 28 నెలలుగా 15 కోట్ల మందికి నెలకు రెండుసార్లు ఫ్రీ రేషన్ అందిస్తున్నట్లు యోగి ప్రకటించారు. 

మోడీకి ముఖం చూపించలేని నాయకుడు కేసీఆర్ : ఈటల రాజేందర్

బీజేపీ జాతీయ కార్యవర్గ సమయంలో టీఆర్ఎస్ కుట్రతోనే ఫ్లెక్సీలు పెట్టిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.  మోడీ ఫ్లెక్సీల్లో లేకున్నా ప్రజల గుండెల్లో ఉన్నాడని చెప్పారు. బీజేపీ విజయసంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ ముఖం చూసి ప్రజలు విసిగిపోయారని.. మోడీకి ముఖం చూపించలేని నాయకుడు కేసీఆర్ అంటూ విమర్శించారు. దళితుడు, గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్..అధికారంలోకి వచ్చాక మాట మార్చిండన్నారు. కేసీఆర్ కు దళిత బిడ్డలమీద గౌరవముంటే ముర్ముకు మద్ధతు ఇవ్వాలని సవాల్ చేశారు.

కేసీఆర్ ది అహంకారపూరిత పాలన : కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసి ఏదీ నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.  ‘‘ అవినీతిమయ రాజకీయాలను చూసి నేర్చుకోవాలా ? కుటుంబ రాజకీయాలను చూసి నేర్చుకోవాలా ? మజ్లిస్ తో మీ పొత్తును చూసి నేర్చుకోవాలా?’’ అని కేసీఆర్ పై కిషన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘సీఎం కేసీఆర్ గత 8 ఏళ్లుగా సచివాలయానికి రాలేదు.. సెక్రటేరియట్ ను కూడా కూలగొట్టించారు.. అక్రమాల పాలన చేస్తున్నారు. అహంకార పూరిత పాలన చేస్తున్నారు. మీ లాంటి వాళ్లను చూసి మేం నేర్చుకోవాలా ?’’ అని ఆయన వ్యా్ఖ్యానించారు.  తెలంగాణ ద్రోహులను వెంటపెట్టుకొని పాలన చేస్తున్న కేసీఆర్ ను పట్టించుకునే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.

బీజేపీని చూసి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నయి : డీకే అరుణ

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు చూసి సీఎం కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మోడీ సభ ఏర్పాట్లు చూసి ముఖ్యమంత్రికి పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను, హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ జనాన్ని నట్టేట ముంచారని డీకే అరుణ ఆరోపించారు. ప్రజల హృదయాల్లో బీజేపీ స్థానం సుస్థిరం అవుతుండటాన్ని చూసి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే కేంద్రంపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం : మురళీధర్ రావు

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలామంది బలిదానమయ్యారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ టీఆర్ఎస్ కుటుంబ పార్టీ చేతిలో ఖైదు చేశారని, దాన్ని విముక్తి చేసే పార్టీ ఒక బీజేపీ మాత్రమేనని అన్నారు. ‘కేసీఆర్ ను హెచ్చరిస్తున్నా. సమయం అయిపోయింది. ప్రజలిచ్చిన తీర్పును అవమానించావు. ఇక సింహాసనం ఖాళీ చేయండి. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్ ను ఖాళీ చేయిస్తారు’ అని మురళీధర్ రావు కామెంట్స్ చేశారు. 

కేసీఆర్ ప్రశ్నలకు ప్రజలే బదులిస్తారు : జితేందర్ రెడ్డి

ఇవాళ్టి నుంచి కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలైందని మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి అన్నారు. మోడీ బహిరంగ సభ తర్వాత కేసీఆర్ కు నిద్రపట్టదని, రోడ్డుపైకి రావాల్సిన అవసరం కూడా ఏర్పడుతుందని పేర్కొన్నారు.  ఆదివారం సాయంత్రం మోడీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు బీజేపీ ఏమిచ్చిందని ప్రశ్నిస్తున్న కేసీఆర్ కు త్వరలో ప్రజలే సమాధానం చెబుతారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు ఎంతోమంది లబ్ధి పొందారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో ఎక్కడ చూసినా బీజేపీ.. బీజేపీ.. బీజేపీ అనే పదమే వినిపిస్తోందని, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం తథ్యమని జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

సభకు హాజరైన గద్దర్

పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ సభకు ప్రజా గాయకుడు గద్దర్ హాజరయ్యారు. బీజేపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సభ జరిగే ప్రాంగణానికి గద్దర్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గద్దర్ పెరేడ్ గ్రౌండ్ కు రావడం బీజేపీ శ్రేణులనే ఆశ్చర్యపరుచగా.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.  బీజేపీ సభకు గద్దర్ హాజరుకావడంపై పలువురు ప్రశ్నించగా బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వినడానికే తాను సభకు వచ్చానని అన్నారు. ఆయన ఏం సందేశం ఇస్తారు అనేది వేచి చూసి.. ప్రసంగం తర్వాత నా నిర్ణయం ప్రకటిస్తానని అక్కడున్న మీడియా ప్రతినిధులకు వివరణ ఇచ్చారు. 

సభా వేదికపైకి చేరుకున్న బీజేపీ ముఖ్య నాయకులు

ప్రధాని మోడీ బహిరంగ సభ కోసం బీజేపీ ముఖ్య నాయకులంతా సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్నారు.  ముఖ్య నాయకులు వేదికపై కూర్చున్నారు. కాసేపట్లో మోడీ కూడా సభా  స్థలికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు ఆయన ప్రసంగిస్తారు. ప్రస్తుతం ముఖ్య నాయకులు చెరో రెండు నిమిషాలు ప్రసంగిస్తున్నారు. 

తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నరు : పీయూష్ గోయల్

తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఇప్పుడు ఆ దిశగానే  పవనాలు వీస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల  ఫలితాలే అందుకు నిదర్శనమని గుర్తు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.40వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా రూ.1.30 లక్షల కోట్లకు పెంచిందన్నారు. దేశ చరిత్రలో ఇంత భారీ స్థాయికి జల ప్రాజెక్టు వ్యయాన్ని పెంచడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.  ఒక్క కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. 
హెచ్ఐసిసికి చేరుకున్న 6 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 

  • హెచ్ఐసిసి నుండి పరేడ్ గ్రౌండ్ కు ఈ బస్సుల్లో వెళ్లనున్న బీజేపీ నేతలు
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన నేతలు..
  • ఆరు బస్సుల్లో భారీ భద్రత నడుమ హెచ్ఐసిసి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు తరలించనున్నారు
  • బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా,యోగి ఆదిత్యనాథ్, ఇతర రాష్ట్ర నేతలు, తెలంగాణ నేతలు, వెళ్లనున్నారు

రెండో రోజు కొనసాగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

HICCలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో నేతలు పలు కీలక అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు తెలంగాణపై ఇవాల్టి సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. నేతలు ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండాలని, వారి బాధలు తెలుసుకుని అండగా నిలవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు సూచించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎంపీలు ఇదే నియమం పాటించాలన్నారు. తమ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోనే అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎంపీలు పర్యటించాలన్నారు. పక్క నియోజకవర్గాల్లో పార్టీ ఎంపీ లేకుంటే.. అక్కడా పర్యటించాలని సూచించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో గుజరాత్ ఎన్నికల ప్రిపరేషన్ పై మాట్లాడిన మోడీ నేతలకు పలు సూచనలు చేశారు. ఫిషరీస్, కోఆపరేటివ్ మంత్రిత్వ శాఖలపై ఎక్కువగా ఫోకస్ చేయాలని.. ఈ రెండు రంగాల్లో అభివృద్ధికి, ప్రజలకు తోడ్పాటు అందించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయన్నారు మోడీ.

బీజేపీ సమావేశాల్లోకి స్టేట్ ఇంటెలిజెన్స్... అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు

నగరంలో జరుగుతోన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోకి స్టేట్ ఇంటెలిజెన్స్అధికారులు అడుగుపెట్టారు. మీటింగ్ లోపలికి వెళ్ళిన ఇంటిలిజెంట్స్ అధికారి శ్రీనివాస్... తీర్మానాల కాపీలను ఫోటోలు తీశారు.  ఇంటెలిజెన్స్ అధికారి శ్రీనివాస్  రావడం పట్ల బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన్ను పట్టుకొని సీపీ స్టీఫెన్ రవీంద్రకు అప్పగించారు. తర్వాత ఆయన మోబైల్ లోని ఫోటోలను డిలీట్ చేయించారు. 
 

అమిత్ షా రాజకీయ తీర్మానం

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిత్వం, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుతో పాటు దేశంలోని ఇతర రాజకీయ అంశాలను ఈ తీర్మానంలో ప్రస్తావించారు.

బీజేపీ విజయ సంకల్ప సభ సర్వం సిద్ధమైంది. సాయంత్రం 6 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో సభ జరగనుంది. ఈ సభా వేదికపై మొత్తం 39  మంది కూర్చోనున్నారు. ప్రధాని మోడీతో సహా 39  మంది సభ వేదికపై ఉండనున్నారు. మోడీకి ఓ వైపు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజ్నాథ్ సింగ్ , నితిన్ గడ్కరీ, హరియాణా, అస్సాం, కర్ణాటక, గోవా, హిమాచలప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రారి ముఖ్యమంత్రులు ఎం. ఎల్. బిట్టర్, హిమంత బిశ్వశర్మ ,బసవరాజు బొమ్మై, ప్రమోద్ సావంత్, జయరామ్ రాగూర్, పుష్కర సింగ్ ధామి,  ఎన్. బీరేన్ సింగ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ ఆశీనులు కానున్నారు. 

సభా వేదికపై 39 మంది..

సభా వేదికపై రాష్ట్రం నుంచి  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్,  ఎంపీలు లక్ష్మణ్, అర్వింద్ , సోయం బాపురావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, నేతలు వివేక్ వెంకట స్వామి,  డీకే ఆరుణ, విజయశాంతి, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మురళీధర్ రావు, గరికపాటి మోహన్ రావు, ఇంద్రసేనారెడ్డి తదితరులు  కూర్చోనున్నారు. ప్రధాన వేదికకు ఎడమవైపున 100 మంది కూర్చునేలా మరో వేదిక సిద్దం చేశారు. కుడివైపు 7 వేల మంది ఆశీనులయ్యేలా మరో వేదికను ఏర్పాటు చేశారు. 

తెలంగాణ ఆవిర్భావ చరిత్రపై ఎగ్జిబిషన్

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సందర్శించారు.  తెలంగాణ ఏర్పాటులో జరిగిన కీలక ఘట్టాల ఫోటోలను ఆయన తిలకించారు.  తెలంగాణ ఏర్పాటులో స్థానికులు, బీజేపీ కార్యకర్తలు భాగమయ్యారని అనురాగ్ ఠాకూర్ అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. 

అవినీతి సర్కార్ ను ప్రజలు క్షమించరు:జేపీ నడ్డా
కుటుంబ పాలన, అవినీతి సర్కార్ ను ప్రజలు క్షమించరని అన్నారు జేపీ నడ్డా. రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరటంలేదన్నారు. జనం బీజేపీ వైపు చూస్తున్నారని.. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంపై ఫోకస్ పెట్టాలని సూచించారు. ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిన కూడా బీజేపీని విస్తరిద్దామన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతిఒక్కరు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఎప్పటికీ అధికారం తమదేననే భ్రమలో ఉంటున్నారని కేసీఆర్ పై విమర్ళు చేశారు నడ్డా. ప్రజల ఆకాంక్షలకు, ఆశలకు భిన్నంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని విమర్శించారు. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు నడ్డా.   సాయంత్రం వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగనున్నాయి. 

సభ ప్రాంగణంలో జర్మన్ హ్యాంగర్స్

ప్రధాని మోడీ విజయ సంకల్ప సభ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా తడవకుండా వేదికలు, సభ ప్రాంగణంలో జర్మన్ హ్యాంగర్స్ వేయించారు.  2 లక్షల మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ, సభకు 10 లక్షల మంది వస్తారని బీజేపీ నాయకులు చెప్తున్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుర్చీల మధ్యలో, ఖాళీ ప్రదేశం వదిలేశారు. సభకు వచ్చే మిగతావారంతా ఈ ఖాళీప్రదేశాల్లో కూర్చొని చూసేలా కింద కార్పెట్లు వేశారు. సభా ప్రాంగణం బయట ఉన్నవారు కూడా కార్యక్రమాలను చూసేందుకు భారీ LED  లను ఏర్పాటు చేశారు. నేతల ప్రసంగాలు 2 కిలోమీటర్ల దూరం వరకు వినిపించేలా స్పీకర్లు పెట్టారు. BJP జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధాని మోడీ నోవాటెల్  నుంచి బేగంపేట్  ఎయిర్  పోర్టుకు చేరుకొని, అక్కడి నుంచి పరేడ్  గ్రౌండ్స్  కు రోడ్డు మార్గంలోనే వెళ్లనున్నారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లే రూట్  ను SPG  ప్రత్యేకంగా పరిశీలించింది. ప్రధానితో పాటు సమావేశాల్లో పాల్గొన్న ఇతర ముఖ్య నేతలు కూడా సభలో పాల్గొననున్నారు. వీళ్లంతా మాదాపూర్ నుంచి సికింద్రాబాద్ కు వివిధ రూట్లలో చేరుకోనున్నారు. ఇందుకోసం టివోలి క్రాస్ రోడ్స్ , ప్లాజా క్రాస్ రోడ్స్ మధ్య రోడ్డును మూసేయడంతో పాటు సికింద్రాబాద్ పరిధిలో ఉండే ఫ్లై ఓవర్లు క్లోజ్ చేయనున్నారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు ట్రాఫిక్  ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. జిల్లాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం 20 గ్రౌండ్లను కేటాయించారు. ఆయా పార్కింగ్ ప్రాంతాల గూగుల్ మ్యాప్ వివరాలు పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక వర్షం వచ్చినా సభకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దాదాపు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 భారీ జర్మన్ హ్యాంగర్స్ ఏర్పాటు చేశారు. ఒకవేళ ఎండ బాగా ఉంటే ఇబ్బంది తలెత్తకుండా.. వంద ఏసీలను రెడీగా ఉంచారు. విద్యుత్తు సమస్యలు తలెత్తితే... ప్రత్యామ్నాయంగా సభా ప్రాంగణంలో 50 జనరేటర్లను అందుబాటులో ఉంచారు. 



పరేడ్ గ్రౌండ్ సభకు ప్రధాని, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, జాతీయ నాయకులు హాజరవుతుండడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జాతీయ నిఘా సంస్థలు, ప్రత్యేక బృందాలు ప్రతీ అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 4 వేల మంది పోలీసులు బందోబస్తు డ్యూటీలో ఉన్నారు. ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ పై ఇద్దరు కానిస్టేబుళ్లు, బైనాక్యులర్స్  తో నిఘా పెట్టారు.

భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న యోగి ఆదిత్య నాథ్

  • భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న  యూపీ సీఎంయోగి ఆదిత్యనాథ్
  • భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన యోగి
  • యోగి వెంట ఆలయానికి బండి సంజయ్, రాజాసింగ్
  • సర్వాంగ సుందరంగా ముస్తాబైన భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం
  • చార్మినార్ దగ్గర కేంద్ర బలగాలతో భారీ భద్రత ఏర్పాటు

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ లక్ష్మణ్ తో కలిసి భాగ్యలక్ష్మి టెంపుల్కు వెళ్లిన .. యోగి ఆదిత్యనాథ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. యూపీ సీఎం యోగికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.  యోగి రాక సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా  బీజేపీ నేతలు అలంకరించారు. చార్మినార్ పరిసరాల్లో  పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలను మోహరించారు. షెడ్యూల్ ప్రకారం శనివారమే అమ్మవారి దర్శనానికి యోగి ఆదిత్యనాథ్ రావాల్సి ఉంది. కానీ సమయం సర్దుబాటు కాకపోవటంతో వాయిదాపడింది.