అయోధ్య పోస్టల్ స్టాంప్ వచ్చేసింది.. రేపు డబ్బులు కూడా వచ్చేస్తాయా..!

అయోధ్య పోస్టల్ స్టాంప్ వచ్చేసింది.. రేపు డబ్బులు కూడా వచ్చేస్తాయా..!

అయోధ్యలో పవిత్రోత్సవానికి ఐదు రోజుల ముందు.. శ్రీరామ జన్మభూమి మందిరంపై ప్రధాని మోదీ స్మారక తపాలా బిళ్లలను విడుదల చేశారు. ఇదే సమయంలో భగవాన్ రామ్‌పై విడుదల చేసిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఉన్న 48పేజీల్లో 20దేశాల స్టాంపులున్నాయి. ఇందులో మోదీ 6 తపాలా స్టాంపులను విడుదల చేశారు. వీటిలో రామాయణం, గణేషుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్, శబరి ఉన్నాయి. ఈ 48 పేజీల పుస్తకం అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా, UN వంటి వాటితో సహా 20 కంటే ఎక్కువ దేశాలు జారీ చేసిన స్టాంపులను కవర్ చేస్తుంది.
 
ప్రత్యేకంగా రూపొందించిన శ్రీరాముడి స్టాంప్ లో సరయూ నది, సూర్యుడు, ఆలయం, చుట్టు పక్కల అందమైన శిల్పాలు ఉన్నాయి. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. రామ మందిరానికి అంకితం చేసిన 6 ప్రత్యేక స్మారక తపాలా స్టాంపులను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ పోస్టల్ స్టాంపులు ఆలోచనలు, చరిత్ర, చారిత్రక సందర్భాలను తర్వాతి తరానికి ప్రచారం చేసేందుకు ఓ మాధ్యమంలా పనిచేస్తాయని చెప్పారు.

ఇటీవల శ్రీరాముడి ఫొటోతో రూ. 500 నోట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నోట్‌లో మహాత్మా గాంధీకి బదులుగా శ్రీరాముని ఫోటో,  నోటు వెనుక భాగంలో ఎర్రకోటకి బదులుగా అయోధ్యలోని రామ మందిరం కనిపిస్తుంది.  దీన్ని ఇప్పటికే చాలా మంది షేర్ చేశారు.  ఈ క్రమంలో భవిష్యత్తులో శ్రీరాముడి ఫొటోతో డబ్బులు కూడా వచ్చేస్తాయా అన్న అనుమానాలు నెలకొన్నాయి.