V6 News

8 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నరు ? తెలంగాణలో బీజేపీకి ఎందుకీ దుస్థితి ? బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్

8 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నరు ? తెలంగాణలో బీజేపీకి ఎందుకీ దుస్థితి ? బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్

న్యూఢిల్లీ, వెలుగు: ఒడిశా లాంటి చోట కూడా బీజేపీ గెలిచిందని, మరి మీ దగ్గర ఏమైందని తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని నరేంద్రమోదీ సీరియస్​ అయ్యారు. తెలంగాణలో బీజేపీ కన్నా ఎంఐఎం బలంగా పని చేస్తున్నదని, కమల దళం కన్నా అసదుద్దీన్ ఒవైసీ సోష‌‌ల్ మీడియా టీమ్ యాక్టి‌‌వ్‌‌గా ‌‌ఉందన్నారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారని, ఇప్పటికైనా పార్టీ నేతలు తీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. ప్రధానంగా సోష‌‌ల్ మీడియాలో మరింత యాక్టివ్‌‌గా ఉండాల‌‌న్నారు.

పార్లమెంట్ సెషన్​లో భాగంగా ప్రతి రోజు పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా గురువారం పార్లమెంట్​లోని తన చాంబర్​లో తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరి బీజేపీ ఎంపీలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అర‌‌గంట‌‌కు పైగా సాగిన ఈ స‌‌మావేశ‌‌ంలో.. తెలంగాణ బీజేపీ ఎంపీల‌‌కు క్లాస్ తీసుకున్నారు. 

ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితులపై తన దగ్గర ఉన్న రిపోర్ట్ ఆధారంగా వైఫల్యాలను ఎండగట్టారు. ప్రధానంగా తెలంగాణలో బీజేపీ వైఫల్యం, నేతల మధ్య కుమ్ములాటలు,  సోషల్ మీడియా విషయంలో ఫెయిల్యూర్స్​, నూతన అధ్యక్షుడితో విభేదాలు వంటి అంశాలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారని మీటింగ్ లో పాల్గొన్న కొందరు ఎంపీలు తెలిపారు.

ప్రాధాన్యం ఇచ్చినా పని చేయడంలేదు 
తెలంగాణ రాష్ట్రానికి అత్యున్నత ప‌‌ద‌‌వుల్లో ప్రాధాన్యం ఇచ్చామని, కానీ అందుకు త‌‌గ్గట్టుగా వారి ప‌‌ని విధానం లేద‌‌ని పార్టీ రాష్ట్ర ఎంపీల‌‌పై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నా.. సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని, అస‌‌లు తెలంగాణలో పార్టీ ఎందుకు వెనుకబడిందని ప్రశ్నించారు. ప్రజల్లో బీజేపీకి మంచి ఆదరణ ఉన్నప్పటికీ రాష్ట్రంలో వెనకబడటం ఏమిటన్నారు.

‘‘ తెలంగాణ‌‌లో మంచి టీమ్ ఉన్నప్పటికీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే అంశాలను హైలైట్ చేయడంలోనూ, పార్టీ గ్రాఫ్‌‌ను పెంచుకోవడంలో ఎంపీలు, నేతలు సీరియస్ గా పని చేయడం లేదు” అని చురకలంటించారు. సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ గా పని చేయాలన్నారు.

ఒడిశాలో సక్సెస్ అయ్యాం.. మీ దగ్గరేమైంది ?
‘‘దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొన‌‌సాగుతున్నది. రెండు దశాబ్దాలు ఒడిశాను ఏలిన నవీన్ పట్నాయక్ ను ఓడించి అక్కడ అధికారంలోకి వచ్చాం. నిన్నమొన్న జ‌‌రిగిన బిహార్​ ఎన్నిక‌‌ల్లోనూ పార్టీ వన్ సైడ్ విక్టరీ సాధించింది. కానీ, తెలంగాణలో బీజేపీ ఎందుకు పుంజుకోలేక‌‌పోతున్నది. ఒకే ఎమ్మెల్యే నుంచి ప్రస్తుతానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు తెలంగాణలో గెలిచాం. ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. అయినా పార్టీ తెలంగాణ‌‌లో పుంజుకోవ‌‌డం లేదు. 

దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇంకా తెలంగాణ‌‌లో వెనుక‌‌బ‌‌డి ఉండడానికి కారణం ఏమిటి?” అని ప్రధాని మోదీ ప్రశ్నించినట్లు ఓ ఎంపీ చెప్పారు. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో పార్టీ మరింత దిగజారడంపై మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కంటే దాదాపు 7 వేల ఓట్లు తగ్గడం ఏమిటని నేతలను ఆయన ప్రశ్నించారు.  

రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవ్​
పార్టీలో నేతలు తమ మధ్య ఉన్న పంచాయితీలను పక్కన పెట్టి, ఐక్యంగా ముందుకు వెళ్లాలని ప్రధాని మోదీ అన్నారు. పార్టీ అధ్యక్షుడిని లైట్ తీసుకోవద్దని, ప్రతి విషయం తనకు తెలుసని ఆయన చెప్పారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇకనైనా పార్టీలో అంతర్గత విభేదాలు పక్కనపెట్టి, సమిష్టిగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగేలా కృషి చేయాలని ఎంపీలకు సూచించారు. కేంద్రం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పధకాలను విస్తృతంగా క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయాలన్నారు. నియోజకవర్గ ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకమై కేంద్రం అందిస్తున్న నిధుల గురించి వివరించాల‌‌ని చెప్పారు.

మండల స్థాయి నుంచి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించి, యువతలో క్రీడా స్ఫూర్తి నింపాలన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్షంగా పోరాడాలని ఆయన చెప్పారు. భవిష్యత్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా ఇప్పటినుంచే మరింత బలంగా ప‌‌నిచేయాల‌‌న్నారు. అలాగే, రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు జాతీయ పరిణామాలపై మరింత యాక్టివ్‌‌గా ఉండాలని మోదీ సూచించారు. ‘వికసిత భారత్’, ‘అమృత్ కాల్​’వంటి కార్యక్రమాలపై ఎంపీలు ప్రచారం చేయాలన్నారు. కాగా.. సాయంత్రం బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ డిన్నర్ ఇచ్చారు. కార్యక్రమంలోన పార్టీ తెలంగాణ ఎంపీలు కూడా పాల్గొన్నారు.