‘సోషల్ మీడియా వదిలేస్తున్నా’: ఆ ట్వీట్ గుట్టు విప్పిన మోడీ

‘సోషల్ మీడియా వదిలేస్తున్నా’: ఆ ట్వీట్ గుట్టు విప్పిన మోడీ

సోషల్ మీడియా ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉండే ప్రధాని నరేంద్ర మోడీ నిన్న రాత్రి ఓ ట్వీట్‌తో సంచలనానికి తెర తీశారు. ‘ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ సహా అన్ని సోషల్ మీడియా అకౌంట్లను ఈ ఆదివారం వదిలేయాలనుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారాయన. ప్రపంచ లీడర్లందరిలోనూ అత్యధిక ఫాలోయర్స్ ఉన్న నేత మోడీ ఒక్కసారిగా సామాజిక మాధ్యమాలను వాడబోనని ప్రకటించడమేంటని అంతా షాక్ అయ్యారు. ఫేస్‌బుక్‌లో 4.47 కోట్లు, ట్విట్టర్‌లో 5.33 కోట్లు, ఇన్‌స్టాలో 3.52 కోట్లు, యూట్యూబ్‌లో 3.4 కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్న ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదో పెద్ద కారణమే ఉందంటూ చర్చ మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ అయితే ఏకంగా దేశంలో సోషల్ మీడియాను బ్యాన్ చేసేందుకు ప్రధాని మోడీ వేసిన తొలి అడుగు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని ట్వీట్ వెనుక ఆంతర్యమేంటో అర్థం కాక కొందరు బీజేపీ నేతలు, ఫాలోయర్లు అయితే దీనిపై మరోసారి ఆలోచించాలని ఆయన్ని కోరుతూ ట్వీట్లు చేశారు. మోడీ తన నిర్ణయాన్ని అమలు చేస్తే తాము కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంటామని మరికొందరు పోస్టులు పెట్టారు.

నా సోషల్ మీడియా మీ చేతిలో

ప్రధాని నరేంద్ర మోడీ తాను ఈ ఆదివారం సోషల్ మీడియాను వదిలేస్తానని చేసిన ప్రకటనలోని లోగుట్టును ఇవాళ మధ్యాహ్నం ఆయన బయటపెట్టారు. ఆదివారం నాడు జరుపుకోబోతున్న అంతర్జాతయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రోజంతా తన సోషల్ మీడియా అకౌంట్లను స్ఫూర్తిదాయకమైన స్త్రీ మూర్తులకు అప్పగించేస్తానని వివరించారు. ఈ అవకాశాన్ని అందుకోండి అంటూ ట్వీట్ చేశారాయన.

’సోషల్ మీడియా వదిలేస్తున్నా’: ఆ ట్వీట్ గుట్టు విప్పిన మోడీ

ఎవరికి? ఎలా? అప్పగిస్తారంటే..

ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా అకౌంట్లన్నీ ఒక రోజంతా ఇన్‌స్పైరింగ్ లేడీస్‌కి అప్పగిస్తానని ప్రకటించారు. అయితే వాటిని హ్యాండిల్ చేయాలంటే ఏం చేయాలో కూడా చెప్పారు మోడీ. ‘మీరు ప్రపంచాన్ని, తోటి వారిని ఇన్‌స్పైర్ చేయగల మహిళనా? లేదా అలా స్ఫూర్తిదాయకంగా నిలవగలిగే మహిళలెవరైనా మీకు తెలుసా? అయితే #SheInspiresUs హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మీ స్టోరీని పోస్ట్ చేయండి. లేదా వీడిమో తీసి యూట్యూబ్‌లో పెట్టండి’ అని చెప్పారు. ఇలా పోస్ట్ చేసిన వారిలో నుంచి కొందరిని ఎంపిక చేస్తామని, వారు తన సోషల్ మీడియా అకౌంట్లను ఆదివారం నాడు టేకోవర్ చేసుకుని స్ఫూర్తిదాయకమైన ఆలోచనలను ప్రపంచంతో పంచుకోవచ్చిన తెలిపారు.