అనీల్ అంబానిపై ED రైడ్స్ : 50 ప్రదేశాల్లో తనిఖీలు

అనీల్ అంబానిపై ED రైడ్స్ : 50 ప్రదేశాల్లో తనిఖీలు

ED Raids on Anil Ambani: అనిల్ అంబానీకి కొత్త సమస్యలు మెుదలయ్యాయి. చాలా కాలం తర్వాత తిరిగి పుంజుకుంటున్న అనిల్ వ్యాపార సంస్థలు కొత్త చిక్కులను తెస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయన రుణాలను మోసంగా వర్గీకరించిన కొద్ది రోజుల తర్వాత కీలక పరిణామాలు జరుగుతున్నాయి. 

ఇవాళ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన దాదాపు 50 స్థలాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబై, ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల బృందాలు ఏకకాలంలో దాడులు చేసినట్లు వెల్లడైంది. రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీల్లో జరిగిన మనీలాండరింగ్ ఆరోపణల్లో భాగంగా ప్రస్తుతం ఈడీ చర్యలు కొనసాగుతున్నాయి. అంబానీ కంపెనీలతో సంబంధం ఉన్న సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. 

నేషనల్ హౌసింగ్ బ్యాంక్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA), బ్యాంక్ ఆఫ్ బరోడా, సీబీఐ కేసుల్లోని సమాచారం ఆధారంగా ఈడీ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడానికి బాగా ప్రణాళికాబద్ధమైన పథకం జరిగిందని ఆధారాలు లభించాయని ఈడీ పేర్కొంది. అలాగే 2017-19 మధ్య కాలంలో యెస్ బ్యాంక్ నుంచి అంబానీ సంస్థలు తీసుకున్న  రుణాల్లో దాదాపు రూ.3వేల కోట్లను అక్రమంగా మళ్లించారనే కేసుపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. అంబానీ సంస్థలకు రుణాల మంజూరుకు కొంత కాలం ముందు బ్యాంక్ ప్రమోటర్లకు చెందిన సంస్థలకు నిధుల బదిలీ జరిగిందని గుర్తించబడింది. 

ఇన్వెస్టర్లు, బ్యాంకులతో పాటు దేశంలోని నియంత్రణ సంస్థలను తప్పుదారి పట్టించి.. రుణాలుగా పొందిన ప్రజా ధనాన్ని అనధికార ప్రయోజనాల కోసం అనిల్ అంబానీ సంస్థలు ఒక ప్లాన్ ప్రకారం మళ్లించినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. దీనికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు గ్రూప్‌లోని పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను అధికారులు ప్రశ్నిస్తు్న్నారు.