గాంధీ ఆశయాలు కోట్లాది మందికి స్ఫూర్తి

గాంధీ ఆశయాలు కోట్లాది మందికి స్ఫూర్తి

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ వర్దంతి సందర్భంగా ఆయనను ప్రముఖ నేతలు స్మరించుకున్నారు. గాంధీని గుర్తు చేసుకుంటూ ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్లు చేశారు. ఇవ్వాళ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కూడా కావడంతో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను గుర్తు చేసుకున్నారు.

‘ఈ పుణ్య తిథిన బాపూకు నివాళులు. ఆయన సిద్ధాంతాలు లక్షలాది మందిని ఇంకా ప్రేరేపిస్తూనే ఉన్నాయి. భారత స్వాతంత్ర్యంతోపాటు దేశ పౌరుల బాగు కోసం పోరాడిన, ప్రాణాలు అర్పించిన వీర మహిళలు, పురుషుల సేవలను మనం గుర్తు చేసుకుందాం’ అని మోడీ చెప్పారు.

‘జాతిపితకు నివాళులు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గాంధీని గుర్తు చేసుకుందాం. శాంతి, అహింస కోసం ఆయన సిద్ధాంతాలను ఆచరించాల్సిన అవసరం ఉంది. సత్యం, ప్రేమ దిశగా బాపూ చూపిన తోవలో నడుద్దాం’ అని కోవింద్ పేర్కొన్నారు.

‘గాంధీజీ సిద్ధాంతాలు ఇవాళ్టి ప్రపంచానికీ ఆచరణాత్మకంగా ఉన్నాయి. బాపూను గుర్తు చేసుకుంటూ ఆయన మార్గంలో నడిచే సంకల్పం తీసుకుందాం’ అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.

ఎవ్వరూ సమర్థించకున్నా సత్యం నిలకడగా నిలబడుతుందని, అదే ఆత్మనిర్భరత అని చెప్పిన గాంధీ కొటేషన్‌‌ను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. బాపూ పుణ్య తిథి నాడు ఆయనకు వినమ్రతతో శ్రద్ధాంజలి ఘటిద్దామన్నారు.