జీ20 లక్ష్యాలు ప్రపంచవ్యాప్తం చేస్తం: మోదీ

జీ20 లక్ష్యాలు ప్రపంచవ్యాప్తం చేస్తం: మోదీ

న్యూఢిల్లీ: జీ20 సమిట్ లక్ష్యాలను ప్రపంచం నలుమూలలకు విస్తరింపజేస్తామని, ఏ చిన్న అవకాశాన్ని వదులకోమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీ20కి ఇండియా అధ్యక్షత వహించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. దేశాల మధ్య ఉన్న విభేదాలు, అడ్డంకులు తొలిగిపోవడానికి, ప్రపంచానికి కొత్త ఎనర్జీ ఇవ్వడానికి జీ20 వేదిక కానుందని అభిప్రాయపడ్డారు. సమిట్​కు అధ్యక్షత వహించే దేశంగా.. ప్రతి ఒక్కరి స్వరం వినిపించేలా అవకాశాలను విస్తరింపజేస్తామని చెప్పారు. 125 దేశాల నుంచి పాల్గొన్న వాయిస్ ఆఫ్ గ్లోబల్ సమిట్.. ఇండియా అధ్యక్షత వహించిన కార్యక్రమాల్లో అగ్రగామిగా ఉందన్నారు. అసమ్మతిపై ఐక్యత విజయం సాధించే ప్రపంచాన్ని పెంపొందించే సహకార బీజాలను నాటడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు. ఈ మేరకు మోదీ తన బ్లాగ్‌‌లో ఒక ప్రెస్​నోట్​ను గురువారం రిలీజ్ చేశారు. 

‘‘మానవ జీవితాన్ని మెరుగుపరచడానికి మేము ఒకే గ్రహంగా కలిసి వస్తున్నాం. మేము అభివృద్ధి కోసం ఒక కుటుంబంలా ఒకరికొకరు మద్దతు ఇస్తున్నాం. సమాన, ఉజ్వల భవిష్యత్తు కోసం మేము కలిసి ముందుకు సాగుతున్నాం”అని మోదీ పేర్కొన్నారు. ‘‘కరోనా తర్వాత ప్రపంచ దేశాల పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. గ్లోబల్ సౌత్ నుంచి ఇన్‌‌పుట్‌‌లు, ఆలోచనలను సేకరించడానికి ఇది ఒక ముఖ్యమైన వేదిక అన్నారు. వాతావరణ మార్పుల కారణంగా, ఆహారం, పోషకాహార భద్రత పెద్ద సవాల్​గా మారిందన్నారు. దీన్ని ఎదుర్కోవడంలో మిల్లెట్స్ లేదా శ్రీఅన్నా గొప్ప సహాయం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇది క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్​ను కూడా ప్రోత్సహిస్తుందన్నారు. అంతర్జాతీయ మిల్లెట్ ఇయర్​లో.. శ్రీఆన్నను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లామని వివరించారు.

ఏర్పాట్లపై మోదీ సమీక్ష

ఇండోనేషియాలోని జకర్తాలో నిర్వహించిన ఆసియన్​ ఇండియా సమిట్ ముగించుకుని గురువారం ఇండియాకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. సుష్మా స్వరాజ్ భవన్​లో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. జీ20 సమిట్​కు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లతో పాటు శుక్రవారం వచ్చే వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షుల వివరా లను అడిగి తెలుసుకున్నారు. 

భ్రదతా ఏర్పాట్లు, వసతుల గురించి ఆరా తీశారు. ప్రపంచ దేశా ల అధినేతలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చూసుకోవాలని సూచించారు. సమిట్ నిర్వహణ, బాధ్యతలు విషయమై ఆరా తీశారు. సమిట్ ఏర్పాట్లు చరిత్రలో నిలిచేపోయేలా ఉండాలని సూచించారు. జీ20 సమిట్ జరిగే భారత్ మండపంలో ఏర్పాట్లుపై మంత్రులతో చర్చించారు. అదేవిధంగా, జకర్తాలో జరిగిన ఆసియన్ ఇండియా సమిట్​లో చర్చకు వచ్చిన అంశాలపై కూడా మంత్రి వర్గంతో చర్చించారు.