సంప్రదాయానికి ప్రతీక "రాజదండం" "సెంగోల్" కు ఇన్నాళ్లకు తగిన గౌరవం

 సంప్రదాయానికి ప్రతీక "రాజదండం"  "సెంగోల్" కు ఇన్నాళ్లకు తగిన గౌరవం

భారత గొప్ప సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన సెంగోల్‌ను నూతన పార్లమెంట్‌ భవనంలో ప్రతిష్టించడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాజదండం స్వేచ్ఛకు చిహ్నం అని చెప్పారు. సెంగోల్ ను సముచిత స్థానంలో ఉంచుతామన్నారు. ఈ సెంగోల్ మనం కర్తవ్య మార్గంలో నడవాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని గుర్తు చేస్తూనే ఉంటుందని చెప్పారు. 

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పవిత్ర సెంగోల్‌కు తగిన గౌరవం ఇచ్చి గౌరవప్రదమైన స్థానం కల్పించి ఉంటే బాగుండేదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఇన్నాళ్లకు సెంగోల్కు సరైన గౌరవం దక్కిందన్నారు. సెంగోల్ ను బహూకరించేందుకు వచ్చిన తమిళనాడు పీఠాధిపతులకు నమస్కరిస్తున్నానన్నారు. పీఠాధిపతులు తన నివాసానికి రావడం అదృష్టం భావిస్తున్నామని చెప్పారు.  శివుడి ఆశీర్వాదం వల్లే తనకు శివభక్తుల దర్శనానికి అవకాశం లభించిందని చెప్పారు. 

అంతకుముందు బంగారు రాజదండం సెంగోల్  ను ప్రధాని మోదీ అందుకున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మే 27వ తేదీ శనివారం ఢిల్లీలోని తన నివాసంలో మదురై పీఠాధిపతి అధినంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మదురై అధీనం 293వ ప్రధాన పూజారి ప్రధాని మోదీకి సెంగోల్‌ను బహుకరించారు.  తిరువావడుతురై అధినం చెన్నై నుంచి మధ్యాహ్నం 3 గంటలకు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం మోదీకి సెంగోల్ ను బహూకరించారు. 

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ స్పీకర్ సీటు దగ్గర 'సెంగోల్' (రాజదండం) ఉంచుతారు.  14 ఆగస్టు, 1947న, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మొదటిసారిగా ఈ సెంగోల్‌ను అందుకున్నారు. ఇది బ్రిటీష్ వారి చేతుల నుండి అధికార మార్పిడికి  చిహ్నంగా అభివర్ణించారు. అప్పటి మద్రాసులో సుప్రసిద్ధ నగల వ్యాపారి అయిన వుమ్మిడి బంగారు చెట్టి ఈ  సెంగోల్‌ను రూపొందించారు. అద్భుతమైన రాజదండం సుమారు ఐదు అడుగుల పొడవు, పైభాగంలో నంది చెక్కబడి ఉంటుంది.