సముద్ర రవాణాలో మనమే ముందున్నం : ప్రధాని మోదీ

సముద్ర రవాణాలో మనమే ముందున్నం :  ప్రధాని మోదీ
  • కొచ్చి షిప్ యార్డ్ రిపేరింగ్​ కేంద్రం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
  •     ఇకపై నౌకల రిపేర్లకు ఆసియా లోనే అతిపెద్ద హబ్​గా కొచ్చి
  •     కేరళలో రూ.4 వేల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభం
  •     షిప్ రిపేరింగ్ సెంటర్, ఎల్పీజీ టెర్మినల్ జాతికి అంకితం

కొచ్చి : అంతర్జాతీయ వాణిజ్యంలో ఇండియా సత్తా చాటుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వేగవంతమైన నౌకాయానం, సముద్ర రవాణాలో అభివృద్ధి చెందిన అనేక దేశాలను సైతం భారత్ వెనక్కి నెట్టిందన్నారు. బుధవారం కేరళలోని కొచ్చిలో రూ.4 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. కొచ్చిలో కొత్తగా ఏర్పాటు చేసిన డ్రై డాక్ ప్రాజెక్టు, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వద్ద షిప్ రిపేరింగ్ కేంద్రం, ఎల్పీజీ ఇంపోర్ట్ టెర్మినల్ వంటి వాటిని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ప్రధాని మాట్లాడారు. రూ.4 వేల కోట్ల ప్రాజెక్టులు పొందిన కేరళ ప్రజలకు ప్రధాని అభినందనలు తెలిపారు. కొచ్చిలో కొత్తగా ఏర్పాటు చేసిన అతిపెద్ద డ్రై డాక్ దేశానికే గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఇక్కడి ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీతో కొచ్చి ఆసియాలోనే అతిపెద్ద షిప్ రిపేర్ సెంటర్​గా మారుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులతో కేరళతోపాటు దక్షిణాదిన అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. ‘‘ఒక దశాబ్దం కిందట షిప్పులు పోర్టుల దగ్గర సరుకు అన్ లోడింగ్ కోసం చాలా కాలంపాటు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ అత్యంత వేగంగా షిప్పుల రాకపోకలు, సరుకుల రవాణా (షిప్ టర్న్ అరౌండ్ టైమ్) విషయంలో ఇండియా నేడు అభివృద్ధి చెందిన అనేక దేశాలను సైతం వెనక్కి నెట్టి, సత్తా చాటుతోంది” అని ప్రధాని చెప్పారు.   

ప్రతి రాష్ట్రమూ కీలకం.. 

ప్రస్తుత ఆజాదీ కా అమృత్ కాల్ సమయంలో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం(వికసిత్ భారత్)గా నిలబెట్టేందుకు ప్రతి రాష్ట్రమూ కీలకమని ప్రధాని అన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. పోర్టులే అంతర్జాతీయ వాణిజ్యంలో ఇండియాను ప్రముఖ స్థానంలో నిలబెట్టాయన్నారు. అందుకే కొచ్చితోపాటు ఇతర పోర్ట్ సిటీలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. కేరళకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులను ఇవ్వడం పట్ల ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పారు. కాగా, కొత్త ప్రాజెక్టుల ప్రారంభంతో కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ టర్నోవర్ వచ్చే నాలుగేండ్లలో రెట్టింపు అయి రూ.7 వేల కోట్లకు చేరుతుందని కేంద్రం అంచనా వేసింది.  

అభివృద్ధిలో బీజేపీదే ట్రాక్ రికార్డ్  

దేశాన్ని వేగంగా అభివృద్ధి చేయడంలో, భవిష్యత్తు పట్ల క్లియర్ విజన్ ఉండటంలో ట్రాక్ రికార్డ్ ను నిరూపించుకున్న పార్టీ బీజేపీ ఒక్కటేనని ప్రధాని మోదీ అన్నారు. బుధవారం కొచ్చిలోని మెరైన్ డ్రైవ్ లో బీజేపీ శక్తికేంద్రాల ఇంచార్జుల మీటింగ్​లో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

 టెంపుల్స్ లో పూజలు.. 

కేరళ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం ఉదయం గురువాయూర్ లోని శ్రీకృష్ణ టెంపుల్ ను సందర్శించారు. సంప్రదాయ పద్ధతిలో మెడలో శాలువా, తెల్లటి ముండు (ధోతి) ధరించి పూజలు చేశారు. ‘‘గురువాయూర్ టెంపుల్ లో ప్రార్థన చేశాను. ప్రతి భారతీయుడూ ఆనందంగా, సౌభాగ్యంగా ఉండాలని కోరుకున్నా” అంటూ టెంపుల్ విజిట్ సందర్భంగా దిగిన ఫొటోలను మోదీ ట్వీట్ చేశారు. అనంతరం ఇదే గుడిలో మలయాళ నటుడు, బీజేపీ నేత సురేశ్ గోపి బిడ్డ భాగ్య వివాహానికి మోదీ హాజరయ్యారు. వధూవరులకు పూలదండలు అందించి, ఆశీర్వదించారు. ఆలయంలో వివాహాలు చేసుకున్న పలు జంటలకు మోదీ స్వీట్లు పంచారు. గురువాయూర్ టెంపుల్ సందర్శన తర్వాత మోదీ త్రిస్సూర్ జిల్లాలోని త్రిప్రాయర్ శ్రీరామ స్వామి టెంపుల్​ను సందర్శించి పూజలు చేశారు. వేద అర్చన, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.