
- 100 టెక్నికల్ విద్యా సంస్థల డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: మారుతున్న వాతావరణానికి, కొత్తగా వస్తున్న సవాళ్లకు అనుగుణంగా హయ్యర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ను అడాప్ట్ చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, రక్షణ, సైబర్ టెక్నాలజీ రంగాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాల్సినఅవసరం ఉందన్నారు. కేంద్ర నిధులతో నడిచే టెక్నికల్ విద్యా సంస్థల డైరెక్టర్లతో ప్రధాని మోడీ గురువారం ఇంటరాక్ట్ అయ్యారు. సుమారు 100 సంస్థల హెడ్స్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పీఎం.. కరోనా సవాళ్లను ఎదుర్కోవడంలో ఆయా సంస్థలు చేసిన కృషిని అభినందించారు. ఈ దశాబ్దంలో టెక్నాలజికల్, ఆర్ అండ్ డీ ఇనిస్టిట్యూషన్లు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని దృష్టిలో ఉంచుకుని.. దేశంలోని హయ్యర్, టెక్నికల్ ఇనిస్టిట్యూషన్లు యువతను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఇంటరాక్షన్‌లో ఐఐఎస్‌సీ బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ గోవిందన్ రంగరాజన్, ఐఐటీ బాంబేకి చెందిన ప్రొఫెసర్ సుభాసిస్ చౌదరి, ఐఐటీ మద్రాస్ కు చెందిన ప్రొఫెసర్ భాస్కర్ రామమూర్తి తదితరులు మాట్లాడారు.