నేను బతికున్నంత వరకు రాజ్యాంగం మారదు..ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు రద్దు చేయం: మోదీ

నేను బతికున్నంత వరకు రాజ్యాంగం మారదు..ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు రద్దు చేయం: మోదీ
  • మొదటి నుంచీ రాజ్యాంగాన్ని కాంగ్రెస్​ అవమానపరుస్తున్నది
  • రిజర్వేషన్లపై ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నది
  • కావాలనే ఫేక్ వీడియో.. ఇది ఒక సీఎం చేయాల్సిన పని కాదు
  • కాళేశ్వరంపై కాంగ్రెస్​ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
  • తెలంగాణలో ఆర్ఆర్​ ట్యాక్స్​ వసూలు చేసి 
  • ఢిల్లీకి కప్పం కడుతున్నారని ప్రధాని కామెంట్​ 
  • మెదక్‌‌ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ జనసభ 

మెదక్/అల్లాదుర్గం, వెలుగు: తాను బతికున్నంత వరకూ రాజ్యాంగాన్ని రక్షిస్తానని.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మొదటినుంచీ రాజ్యాంగాన్ని కాంగ్రెస్​ అవమానపరుస్తోందని చెప్పారు. లోక్​ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా అల్లాదుర్గంలో జరిగిన బీజేపీ జనసభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘రాజ్యాంగంపై మాకున్న గౌరవాన్ని ఎవరూ శంకించాల్సిన పనిలేదు. నేను బతికున్నంత వరకు రాజ్యాంగం మారదు. దేశవ్యాప్తంగా మాకు లభిస్తున్న ఆదరణ చూసి.. ఓర్వలేక  కాంగ్రెస్​ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.

బీజేపీ  మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ కాంగ్రెస్​ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఉద్దేశపూర్వకంగా ఫేక్​ వీడియో సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, సమాజంలో ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు. ఒక సీఎం చేయాల్సిన పనేనా ఇది?’’ అని తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డిని ఉద్దేశించి మోదీ అన్నారు.

రాత్రికి రాత్రి ముస్లింలకు రిజర్వేషన్లు

కాంగ్రెస్ ​పార్టీ మొదటినుంచీ రాజ్యాంగానికి వ్యతిరేకమేనని మోదీ అన్నారు. ముత్తాత (నెహ్రూ), నానమ్మ (ఇందిరాగాంధీ), యువరాజు (రాహుల్​గాంధీ)  రాజ్యాంగాన్ని అవమానపరిచారని పేర్కొన్నారు. రాజ్యాంగంలో రామాయణ, మహాభారత చిత్రాలు ఉంటే కాంగ్రెస్​ ప్రభుత్వం వాటిని తొలగించిందని ఆరోపించారు. కాన్ట్సిట్యూషన్​ కల్పించిన హక్కు మేరకు గతంలో మన్మోహన్​ సింగ్​ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోగా.. అందుకు సంబంధించిన ప్రతులను యువరాజు మీడియా ముందు చింపేశారని తెలిపారు.

2004–09 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో రికార్డుస్థాయిలో కాంగ్రెస్​ పార్టీ అత్యధిక ఎంపీ సీట్లు గెలిస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లలో అన్యాయం చేసి, రాత్రికి రాత్రి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిందని మోదీ విమర్శించారు. ఇక్కడ లింగాయత్, మరాఠీలు బీసీల్లో చేర్చాలని డిమాండ్​ చేస్తే.. కాంగ్రెస్​ ఓబీసీల్లో చేర్చలేదని అన్నారు. పేదలు పేదలుగానే ఉండాలని కాంగ్రెస్ చూస్తోందని,  దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలను ముందుకు వెళ్లనివ్వడం లేదని తెలిపారు.  మహిళలను కూడా ఆ పార్టీ ఓటు బ్యాంక్​గానే చూసిందని, తాము అందుకు భిన్నంగా గడిచిన పదేండ్లలో మహిళల రక్షణకు కఠిన చట్టాలు తీసుకువచ్చామని చెప్పారు.

వచ్చే ఐదేండ్లలో వాటిని మరింత  పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటే బాగా పనిచేయగలుగుతుందని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగలుగుతుందని, అయోధ్య రామమందిర నిర్మాణమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయాన్ని మోదీ నిర్మించలేదని,  మీరు వేసిన ఓటు వల్లే 500 ఏండ్ల కల సాకారమైందని తెలిపారు. 

తెలంగాణాలో ఆర్ఆర్​ ట్యాక్స్​

తెలుగు ఫిల్మ్​ ఇండస్ట్రీలో ట్రిపుల్​ఆర్​ సినిమా సూపర్​ హిట్​ కాగా.. ఇపుడు తెలంగాణలో ఆర్ఆర్​ ట్యాక్స్​అమలవుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఇక్కడ ఆర్ఆర్​ ట్యాక్స్​ వసూలు చేస్తూ ఢిల్లీకి కప్పం కడుతున్నారని ఆరోపించారు. ఆర్ఆర్​ ట్యాక్స్​ ఎవరు వసూలు చేస్తున్నారో, కప్పం ఎవరికి కడుతున్నారో మీకు తెలుసని వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఐదేండ్లలో ఆర్ఆర్​ట్యాక్స్​తో తెలంగాణ బర్బాత్​ అవుతుందని చెప్పారు.  ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి  వస్తే ప్రజలు కష్టపడి కూడబెట్టుకున్న పైసలు వారి పిల్లలకు దక్కకుండా 55 శాతం వసూలు చేసే యోచనలో ఉందని మోదీ ఆరోపించారు.

ఈ ఖతర్నాక్​ విధానంపై అలర్ట్​గా ఉండాలన్నారు. కాంగ్రెస్​ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా అబద్ధాలు, అవినీతి, కుటుంబ పాలన, మాఫియా ప్రోత్సాహం, ఓటు బ్యాంకు రాజకీయాలు అనే పంచ సూత్రాలను అవలంబిస్తుందని మోదీ ఆరోపించారు.  కాంగ్రెస్​ పార్టీ దేశాన్ని మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లాలని చూస్తోందన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం రైతుల్ని దోఖా చేస్తోందన్నారు. వంద రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని, రైతులకు రుణ మాఫీ చేస్తామని, వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్​ ఇస్తామని చెప్పి, ఇప్పటీకీ చేయలేదని అన్నారు.

కాంగ్రెస్​ సర్కారు​ఎలా మోసం చేస్తోందో తెలంగాణా ప్రజలు గమనించాలని కోరారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దేశాన్ని అవినీతి ఊబిలోకి నెట్టగా..గడిచిన పదేండ్లలో ఎన్డీఏ సర్కార్​ అవినీతి రహిత పరిపాలతో దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లిందో ప్రజలు చూశారని చెప్పారు. తెలంగాణ , దేశ వికాసం బీజేపీ సంకల్పమని పేర్కొన్నారు.

నేషనల్​హైవేలు, రైల్వే లైన్ల నిర్మాణం, అమృత్ స్టేషన్ల అభివృద్ధి, వందే భారత్​ రైళ్లకోసం రాష్ట్రానికి అనేక కోట్లు మంజూరు చేశామని తెలిపారు. మరోసారి బీజేపీని ఆశీర్వదించాలని, మెదక్, జహీరాబాద్​ లోక్​ సభ స్థానాల్లో రఘునందన్​ రావు​, బీబీ పాటిల్​ ను గెలిపించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ సభలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్ రమణారెడ్డి, మెదక్, జహీరాబాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థులు రఘునందన్ రావు, బీబీ పాటిల్, మెదక్, సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, గోదావరి తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగం మాకు ధర్మగ్రంథం

తాను గుజరాత్​ సీఎంగా ఉన్నపుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 60 ఏండ్లు పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించామని మోదీ  తెలిపారు.  రాజ్యాంగం తమకు ధర్మ గ్రంథమని చెప్పారు. మొదటి సారి ఎంపీగా ఎన్నికై పార్లమెంట్​ లో అడుగుపెట్టగానే రాజ్యాంగం ముందు మోకరిల్లి నమస్కరించానని చెప్పారు. 2019లో తాను రెండో సారి ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యాక పార్లమెంట్​ సెంట్రల్​ హాల్​లో రామాయణం, ఖురాన్​, బైబిల్​ తో పాటు  పవిత్ర గ్రంథంగా భావించి రాజ్యాంగాన్ని సైతం గౌరవించానని పేర్కొన్నారు.  'ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి చెబుతున్నా నేను మూడో సారి ప్రధానమంత్రి అయ్యాక రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తవడాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తాం.  కాంగ్రెస్​ పార్టీ పాపాలను బయటపెట్టి, ప్రజల ముందు దోషులుగా నిలబెడ్తాం' అని మోదీ అన్నారు. 

కాళేశ్వరంపై కాంగ్రెస్​ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు?

కాంగ్రెస్​, బీఆర్ఎస్​ పార్టీలు అవినీతిలో తోడు దొంగలు. ఢిల్లీ లిక్కర్​స్కాంతో ఈ విషయం స్పష్టమైంది. లిక్కర్​ స్కాంలో భాగస్వామిగా ఉన్న బీఆర్ఎస్​తో కాంగ్రెస్​కు​ అలయన్స్​ ఉంది. తెలంగాణలో మొన్నటి దాకా బీఆర్ఎస్​ దోచుకోగా.. ఇప్పుడు కాంగ్రెస్​ అదే పనిచేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణం పెద్ద స్కామ్​ అన్న కాంగ్రెస్​ పార్టీ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? అధికారంలోకి వచ్చాక .. ఆ ప్రాజెక్ట్​కు సంబంధించిన ఫైల్స్​ను కాంగ్రెస్​ తొక్కిపెడుతోంది. 
- ప్రధాని నరేంద్ర మోదీ