
హైదరాబాద్: ఇక్రిశాట్ 50 ఏళ్ల ప్రయాణంలో పాల్గొన్న అందరికీ అభినందనలు అన్నారు ప్రధాని మోడీ. శనివారం ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన మోడీ.. ఇక్రిశాట్ స్వర్ణోత్సవ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఇక్రిశాట్ సేవలను ఇప్పుడు ప్రత్యక్షంగా చూశానన్నారు. వసంతపంచమి రోజు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. టెక్నాలజీని మార్కెట్ తో జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఇక్రిశాట్ ఎంతో కృషి చేస్తుందన్నారు. వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రం రైతులకు ఎంతో ఉపయోగం అన్నారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా ప్రపంచస్థాయి పరిశోధనలకు భారత్ వేదికగా మారిందన్నారు.
ఇందుకోసం భారత్ ఎన్నో చర్యలు తీసుకుందన్న మోడీ.. ఈ పరిశోధనలు చిన్న, మధ్య తరగతి రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మానవ నష్టం గురించి చర్చిస్తామన్నారు. దేశంలో ప్రాచీన, వైవిధ్యమైన వ్యవసాయ విధానం ఉందన్న మోడీ.. 25 ఏళ్ల లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ఇక్రిశాట్ కూడా ప్రత్యేక లక్ష్యాలతో ముందుకెళ్లాలన్నారు. వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఆవిష్కరణలు చేశారని..నీరు, మట్టి మేనేజ్ మెంట్ పై అద్భుతమైన పరిశోదనలు చేశారని తెలిపారు ప్రధాని మోడీ.