
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉన్నదని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలను ఒకప్పుడు సరిహద్దు ప్రాంతాలుగానే పరిగణించారని, కానీ ఇప్పుడు అవి దేశ అభివృద్ధిలో కీలకంగా మారాయని పేర్కొన్నారు.
‘‘ఏ ప్రాంత అభివృద్ధికైనా శాంతి, లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. ఈశాన్య రాష్ట్రాలు ఒకప్పుడు బాంబులు, గన్స్, ఆందోళనలకు మారుపేరుగా ఉండేవి. దీంతో యువత ఎన్నో అవకాశాలను కోల్పోయారు. గత 10–11 ఏండ్లలో మా ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాలతో 10 వేల మంది యువత ఆయుధాలను వదిలిపెట్టారు. ఈ మార్పుతో ఈ ప్రాంతంలో కొత్త ఉద్యోగావకాశాలు వచ్చాయి” అని తెలిపారు.
శుక్రవారం ఢిల్లీలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమిట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నార్త్ ఈస్ట్ రీజియన్ అతిపెద్ద బలం ఆ ప్రాంత వైవిధ్యమేనని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్క రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నదని చెప్పారు. ‘‘మాకు ఈస్ట్ అంటే కేవలం డైరెక్షన్ కాదు విజన్. నార్త్ ఈస్ట్ అభివృద్ధి కోసం ఎంపవర్, యాక్ట్, స్ట్రెంథెన్, ట్రాన్స్‌ఫామ్ అనే పాలసీతో ముందుకెళ్తున్నాం. ‘లుక్ ఈస్ట్’ నుంచి ‘యాక్ట్ ఈస్ట్’ వరకు కీలకమైన చర్యలు తీసుకున్నాం. ఇప్పుడా ఫలితాలు కనిపిస్తున్నాయి” అని పేర్కొన్నారు.
వేల కోట్ల పవర్ ప్రాజెక్టులకు ఆమోదం..
ఎనర్జీ, సెమీ కండక్టర్ రంగాలకు నార్త్ ఈస్ట్ కీలకమైన డెస్టినేషన్‌గా మారుతున్నదని ప్రధాని మోదీ తెలిపారు. మన దేశంలో సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ అభివృద్ధిలో అస్సాం కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. తొలి మేడిన్ ఇండియా చిప్ నార్త్ ఈస్ట్‌లోని సెమీ కండక్టర్ ప్లాంట్ నుంచే త్వరలో రానున్నదని ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాల్లో హైడ్రో పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టామని, ఇప్పటికే రూ.వేల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని వెల్లడించారు.
సోలార్ రంగంలో మాడ్యుల్స్, సెల్స్ తయారీ, స్టోరేజీ సొల్యూషన్స్, రీసెర్చ్‌లో మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎకో టూరిజం హబ్‌గా నార్త్ ఈస్ట్ అభివృద్ధి చెందుతున్నదని.. ఈ ప్రాంతం వెదురు పరిశ్రమ, టీ పొడి తయారీ, పెట్రోలియం ఉత్పత్తి, స్పోర్ట్స్‌కు మారుపేరుగా నిలుస్తున్నదని అన్నారు. కాగా, నార్త్ ఈస్ట్‌లో ఉన్న అవకాశాలను వివరించడం, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సమిట్ నిర్వహిస్తున్నారు. ఇది రెండ్రోజుల పాటు కొనసాగుతుంది.