బుజ్జగింపు రాజకీయాలు దేశానికి డేంజర్​: మోదీ

బుజ్జగింపు రాజకీయాలు దేశానికి డేంజర్​: మోదీ
  • టెర్రరిస్టులను కాపాడేందుకు కొందరు గతంలో కోర్టులకూ వెళ్లారు
  • తమ స్వార్థ లక్ష్యాల కోసం దేశ సమైక్యత విషయంలోనూ రాజీపడ్తరు
  • పటేల్‌‌ జయంతి సందర్భంగా ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద ప్రధాని నివాళి

కెవాడియా: బుజ్జగింపు రాజకీయాలు.. దేశ అభివృద్ధి ప్రయాణంలో అతిపెద్ద అడ్డంకులని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుజ్జగింపు రాజకీయాలు చేసే వాళ్లు తమ స్వార్థ లక్ష్యాల కోసం దేశ సమైక్యత విషయంలో కూడా రాజీపడతారని విమర్శించారు. సర్దార్ వల్లభ్‌‌‌‌ భాయ్ పటేల్‌‌‌‌ జయంతిని పురస్కరించుకొని మంగళవారం గుజరాత్‌‌‌‌లోని నర్మదా జిల్లా కెవాడియాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం వద్ద ప్రధాని నివాళి అర్పించారు. అనంతరం అక్కడి సభలో ఆయన మాట్లాడారు. వచ్చే 25 ఏళ్లు ఎంతో ముఖ్యమని, భారత్‌‌‌‌ను అభివృద్ధి చెందిన, సంపన్న దేశంగా మార్చాలని, అందుకోసం పటేల్‌‌‌‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. 

అలర్ట్‌‌‌‌గా ఉండాలి..

‘‘టెర్రర్ యాక్టివిటీలపై దర్యాప్తు చేసే విషయంలో నిర్లక్ష్యం చేశారు. దేశ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలను తీసుకోలేదు. బుజ్జగింపు ఆలోచనా ధోరణి చాలా ప్రమాదం. టెర్రరిస్టులను కాపాడేందుకు వాళ్లు గతంలో కోర్టులకూ వెళ్లారు. అలాంటి ఆలోచన ఏ కమ్యూనిటీకీ ఉపయోగపడదు. అది దేశానికి ఎలాంటి ప్రయోజనమూ కల్పించదు’’ అని ప్రధాని మోదీ అన్నారు. ‘‘దురదృష్టవశాత్తు దేశంలోని అతిపెద్ద రాజకీయ వర్గం.. సమాజానికి, దేశానికి వ్యతిరేకమైన వ్యూహాలను ఎంచుకుంటున్నది. వాళ్లకు దేశ సమైక్యత విచ్ఛిన్నమైనా సరే.. తమ స్వార్థమే ప్రధానం. ఇలాంటి రాజకీయ వర్గం దేశ ఐక్యతను దెబ్బతీసి తమ రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఇలాంటి విషయంలో దేశం అలర్ట్‌‌‌‌గా ఉండాలి. అప్పుడే అన్నుకున్న అభివృద్ధి లక్ష్యాలను చేరుకోగలం’’ అని చెప్పారు.

తొమ్మిదేండ్లుగా సవాళ్లు

గత తొమ్మిదేండ్లుగా ఇండియా అంతర్గత భద్రతకు పలు వైపుల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయని ప్రధాని అన్నారు. భద్రతా దళాలు ఎంతో కష్టపడి పని చేస్తున్నాయని, అందుకే దేశ శత్రువులు గతంలో మాదిరి విజయం సాధించలేకపోతున్నారని చెప్పారు. ‘‘గతంలో రద్దీగా ఉండే మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలు, ఆర్థిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాల్లోకి వెళ్లిన సమయంలో అనుభవించిన భయాందోళనను ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు. ప్రజలను లక్ష్యంగా చేసుకుని దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. బాంబు పేలుళ్ల వల్ల జరిగిన విధ్వంసాన్ని ప్రజలు చూశారు. విచారణ పేరుతో అప్పటి ప్రభుత్వం అలసత్వం వహించడాన్నీ చూశారు” అని చెప్పారు.

ఆర్టికల్‌‌‌‌ 370 గోడ కూలిపోయింది

‘‘ఆర్టికల్ 370 నుంచి కాశ్మీర్ విమోచనం పొందుతుందని ఎవరైనా అనుకున్నారా? కానీ ఈ రోజు.. కాశ్మీర్‌‌‌‌, దేశం మధ్య అడ్డుగా ఉన్న ఆర్టికల్‌‌‌‌ 370 గోడ కూలిపోయింది. ఈ విషయంలో సర్దార్ ఎక్కడున్నా సంతోషిస్తారు. మనల్ని ఆశీర్వదిస్తారు” అని మోదీ చెప్పారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇండియా సాధించిన విజయాల వైపు చూస్తున్నదని చెప్పారు. జీ20 నిర్వహణ విషయంలో ఇండియా సామర్థ్యాన్ని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయిందన్నారు.

పటేల్ కృషి వల్లే ఇండియా ఏకమైంది: అమిత్ షా

న్యూఢిల్లీ: కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సర్దార్ వల్లభ్‌‌‌‌భాయ్ పటేల్ కృషి, సంకల్పం వల్లే ఇండియా ఏకమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 2047 నాటికి అన్ని రంగాల్లో దేశాన్ని టాప్ స్థానంలో నిలబెడతామని ప్రజలందరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చా రు. ‘‘ఇప్పుడున్న ఇండియా సర్దార్ పటేల్ కృషి వల్లే వచ్చిం ది. ఆయన సహకారం, దూరదృష్టి లేకుంటే మనం ఇప్పుడు, ఇక్కడ ఉండేవాళ్లం కాదు” అని చెప్పారు. స్వాతంత్ర్యం తర్వాత 550 చిన్న రాజ్యాలను దేశంలో కలిపే పెద్ద బాధ్యతను పటేల్ భుజానికెత్తుకున్నారని తెలిపారు. అతిపెద్ద పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ఆయనకు ప్రధాని తగిన గౌరవం ఇచ్చారని చెప్పారు. ఈసందర్భంగా ఢిల్లీలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని షా ప్రారంభించారు.

దురదృష్టవశాత్తు దేశంలోని 

అతిపెద్ద రాజకీయ వర్గం.. సమాజానికి, దేశానికి వ్యతిరేకమైన వ్యూహాలను ఎంచుకుంటున్నది. వాళ్లకు దేశ సమైక్యత విచ్ఛిన్నమైనా సరే.. తమ స్వార్థమే ప్రధానం. ఇలాంటి రాజకీయ వర్గం దేశ ఐక్యతను దెబ్బతీసి తమ రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఇలాంటి విషయంలో దేశం అలర్ట్‌‌గా ఉండాలి. ‌‌‌‌- ప్రధాని నరేంద్ర మోదీ