డెమోక్రసీకి అతిపెద్ద శత్రువు వారసత్వ రాజకీయాలే

డెమోక్రసీకి అతిపెద్ద శత్రువు వారసత్వ రాజకీయాలే

న్యూఢిల్లీ:వారసత్వ రాజకీయాలే డెమోక్రసీకి అతిపెద్ద శత్రువని, ఇంకా కొనసాగుతున్న వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. కుటుంబ రాజకీయాలతో నిరంకుశత్వం పెరుగుతుందని, పాలకుల అసమర్థత   దేశానికి భారంగా మారుతుందని చెప్పారు. మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాల్ లో  రెండో నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ ముగింపు సమావేశంలో మోడీ మాట్లాడారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించే పార్టీలపై ఆయన విరుచుకుపడ్డారు. ‘వారసత్వ రాజకీయాలతో అధికారంలోకి వచ్చేవాళ్లు చట్టాలను గౌరవించరు, చట్టాలంటే భయం ఉండదు. ఈ విషయంలో వాళ్లకు తమ సొంత కుటుంబంలో ఉన్నవాళ్లే ఆదర్శంగా ఉంటారు’ అని అన్నారు.

ఇప్పటికీ ఇంటిపేర్లతో ఎలక్షన్లలో గెలుస్తున్నారని, వారసత్వ రాజకీయాలు ఇంకా అంతం కాలేదని చెప్పారు. పొలిటికల్, సోషల్ కరప్షన్ కు వారసత్వ రాజకీయాలే కారణమన్నారు. ప్రస్తుతం ప్రజలు  పనితీరు, నిజాయితీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికీ కొందరి ప్రవర్తన, ఆలోచనలు చూస్తుంటే కుటుంబ రాజకీయాలను కాపాడుకోవడం, తమ కుటుంబం రాజకీయాల్లో కొనసాగడమే వారి లక్ష్యం అనిస్పష్టం అవుతోందని తెలిపారు. వారసత్వ రాజకీయాలు ‘నేషన్ ఫస్ట్’ అనే దానికి బదులుగా ‘నేను.. నా కుటుంబం’ అనే సెంటిమెంట్ ను బలోపేతం చేస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రాజకీయాలకు పనితీరు, నిజాయితీ అవసరం ఉందని చెప్పారు.

యవత రాజకీయాల్లోకి రావాలి

యువత రాజకీయాల్లోకి రావాలని.. లేకుంటే వారసత్వ రాజకీయాల విషం డెమోక్రసీని బలహీనం చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ‘ఇతర రంగాల మాదిరిగానే రాజకీయాల్లోనూ యువత అవసరం ఉంది. కొత్త ఆలోచనలు, కొత్త ఎనర్జీ, కొత్త కలలు కావాలి. యంగ్ జనరేషన్ రాజకీయాల్లోకి వస్తేనే వారసత్వ రాజకీయాలు అంతం అవుతాయి. యువకులకు సంబంధించిన కార్యక్రమాలను ఆర్గనైజ్ చేస్తున్నం.  మాక్ పార్లమెంట్ లాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నం. ఇవి వాళ్లకు ఎంతో హెల్ప్ అవుతాయి’ అని అన్నారు. యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ లో ఉపన్యాస పోటీల్లో అవార్డులు గెల్చుకున్న ముగ్గురిని ప్రధాని మోడీ అభినందించారు.

వివేకానందుడికి నివాళి

స్వామి వివేకానందుడి 158వ జయంతి సందర్భంగా  ప్రధాని మోడీ  నివాళి అర్పించారు. తనపై ఆయన ప్రభావం ఎంతగానో ఉందన్నారు. వివేకానందుడి ఆలోచనలు, ఆదర్శాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ప్రజలను కోరుతూ ట్వీట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయ వర్గీయా,  బీజేపీ నేత సువేందు అధికారి  కోల్ కతాలో స్వామి వివేకానందుడి ఇంట్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  వెస్ట్ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్ కర్, సీఎం మమతా బెనర్జీ కూడా నివాళులు అర్పించారు.