రెండేళ్ల తర్వాత.. ప్రధాని భద్రతా లోపం.. పోలీసు ఉన్నతాధికారి సస్పెండ్

రెండేళ్ల తర్వాత.. ప్రధాని భద్రతా లోపం.. పోలీసు ఉన్నతాధికారి సస్పెండ్

జనవరి 5, 2022న రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా ఉల్లంఘనకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు బటిండా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) గుర్వీందర్ సింగ్ సంఘా సహా ఏడుగురు పోలీసులను సస్పెండ్ పంజాబ్ ప్రభుత్వం చేసింది. పంజాబ్ హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సింగ్‌తో పాటు ఇద్దరు డీఎస్పీ ర్యాంక్ అధికారులు- పర్సన్ సింగ్, జగదీష్ కుమార్, ఇన్‌స్పెక్టర్లు తేజిందర్ సింగ్, బల్వీందర్ సింగ్, జతీందర్ సింగ్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ రమేష్ కుమార్‌లను సస్పెండ్ చేశారు.

భటిండా జిల్లాలో ఎస్పీగా పోస్ట్ చేయబడిన సింగ్, సంఘటన జరిగిన సమయంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్)గా ఉన్నారు. ఆయన ఫిరోజ్‌పూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. తాజా ఉత్తర్వు ప్రకారం, పంజాబ్ సివిల్ సర్వీసెస్ రూల్ (శిక్ష, అప్పీల్) 1970లోని సెక్షన్ 8 కింద మొత్తం ఏడుగురు పోలీసులను చార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. సస్పెన్షన్ ఆర్డర్ ప్రకారం, ఈ సంఘటనపై అక్టోబర్ 18, 2023 నాటి నివేదికను పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సమర్పించారు. ఇందులో సింగ్ తన విధిని సరిగ్గా నిర్వహించలేదని రాష్ట్ర పోలీసు చీఫ్ తెలిపారు. కాంపిటెంట్ అథారిటీ స్థాయిలో విషయాన్ని పరిశీలించిన తర్వాత, సంబంధిత అధికారిని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు పంజాబీలో ఉత్తర్వులు జారీ చేసింది.

జనవరి 5స 2022న ప్రధాని మోదీ ఫిరోజ్‌పూర్‌లోని హుస్సేనివాలాకు వెళ్తున్న సమయంలో భద్రతా ఉల్లంఘన జరిగింది. భటిండాలో దిగిన ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారక స్థూపానికి బయల్దేరారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకానికి 30 కిలోమీటర్ల దూరంలో, అతని కాన్వాయ్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకుని.. కొంతమంది నిరసనకారులు మోదీని అడ్డుకున్నారు. దీంతో మోదీ కాన్వాయ్ 15-20 నిమిషాలకు పైగా ఫ్లైఓవర్‌పై నిలిచిపోయింది. ఆ తరువాత మోదీ ర్యాలీతో సహా ఏ కార్యక్రమానికి హాజరుకాకుండా పంజాబ్ నుంచి తిరిగి వెళ్లారు.