బీసీల రిజర్వేషన్లకు ప్రధాని సహకరించాలి..హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

బీసీల రిజర్వేషన్లకు ప్రధాని సహకరించాలి..హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
  •  సీఎం రేవంత్ వల్లే కులగణన, బీసీ బిల్లు సాధ్యమైంది 


హైదరాబాద్ సిటీ, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణకు ప్రధాని మోదీ సహకరించాలని -హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రజా ఐక్య కూటమి నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ మీటింగ్​కు ఆయన హాజరై మాట్లాడారు.

 సీఎం రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో కులగణన, బీసీ రిజర్వేషన్ల బిల్లు సాధ్యమైందన్నారు. ప్రజా ఐక్య కూటమి జెండా, ఎజెండాలను ఆవిష్కరించారు. ప్రజా ఐక్య కూటమి చైర్మన్  దాసు సురేశ్ కూటమి కోర్ లీడర్ షిప్ కమిటీ సభ్యులను ప్రకటించారు. 

జనరల్ స్థానాల్లో పోటీ చేద్దాం.. అగ్రకులాలను ఓడిద్దాం

బషీర్​బాగ్ : జనరల్ స్థానాల్లో పోటీ చేసి అగ్రకులాలను ఓడిద్దామని తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ పిలుపునిచ్చింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్​తో కలిసి చైర్మన్ బాలరాజ్ గౌడ్ మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీ చేసే బీసీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. బీసీ బిడ్డ అయిన నల్గొండ డీసీసీ కైలాష్​పై మంత్రి కోమటిరెడ్డి అవమానకరంగా మాట్లాడడడం సరికాదన్నారు.  

ఎమ్మార్పీఎస్ మద్దతు 

రిజర్వేషన్లపై బీసీల పోరాటానికి ఎమ్మార్పీఎస్ మద్దతు తెలిపింది. బుధవారం సైఫాబాద్ జేఏసీ ఆఫీసులో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతో కలిసి బీసీ జాక్​ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్​గౌడ్ మాట్లాడారు. 

ఈ నెల 30 ధర్నాచౌక్ లో వేలాది మందితో బీసీల రాజకీయ యుద్ధభేరి సభను నిర్వహినున్నామని, డిసెంబరు 8,9 తేదీలలో పార్లమెంట్ ను ముట్టడిస్తామని జాజుల హెచ్చరించారు. మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ  42 శాతం రిజరేషన్ల అమలు జరిగేంతవరకు బీసీలు చేసే పోరాటంలో ఎమ్మార్పీఎస్ భాగస్వామ్యం అవుతుందన్నారు.

జీవో 46 పై నోరు విప్పాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

46 జీవో పై ప్రభుత్వంలోని బిసి ప్రజా ప్రతినిధులు నోరు విప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో గన్ పార్కు స్థూపం వద్ద స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని ధర్నా చేశారు.