కరోనాపై ప్రధాని మోడీ టిప్స్: షేక్ హ్యాండ్ వద్దు… నమస్తే చాలు

కరోనాపై ప్రధాని మోడీ టిప్స్: షేక్ హ్యాండ్ వద్దు… నమస్తే చాలు

కరోనా నివారణకు ప్రధాని సింపుల్ టిప్స్
7 నిమిషాల వీడియో రిలీజ్ చేసిన ప్రధాని మోడీ

కరోనా నివారణకు సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుందని ప్రధాని మోడీ ప్రజలకు సూచించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనం ప్యానిక్ కావద్దంటూ పలు సూచనలతో సోమవారం ట్విట్టర్ లో 7 నిమిషాల వీడియోను విడుదల చేశారు.  ‘తరచూ చేతులను శుభ్రంగా కడుక్కొండి. ముఖాన్ని, కళ్లను చేతులతో తాకే అలవాటును మానుకోండి’ అని కోరారు. అత్యవసరమైతే తప్ప పెద్ద ఎత్తున ఒక్కచోట గుమిగూడవద్దని వీడియోలో ప్రధాని మోడీ కోరారు. కరోనా విషయంలో ప్యానిక్ కావాల్సిన అవసరం లేదని…కాస్త కేర్ ఫుల్ గా ఉంటే చాలని చెప్పారు. ” కరోనా వ్యాపించకుండా  ప్రభుత్వం, హెల్త్ డిపార్ట్ మెంట్‌ అధికారులు వీలైనంత కృషి చేస్తున్నారు. ఈ సమయంలో అలర్ట్ గా ఉండటం కీలకం. సెంట్రల్, స్టేట్,  మున్సిపాలిటీ, గ్రామపంచాయితీ ఇలా ప్రతి చోట ఆయా ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపడుతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం”  అని ప్రధాని చెప్పారు. ఇదే సమయంలో ఎవరికి వారు సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు కరోనాను దూరం చేయవచ్చని వీడియోలో చెప్పారు. ” పెద్ద సంఖ్యలో జనం గుమిగూడవద్దు. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చేతులతో ముఖం, కళ్లు, ముక్కును తాకే అలవాటును మార్చుకొండి. వీలైనంత వరకు అలవాట్లను కంట్రోల్ లో ఉంచుకొండి ” అని చెప్పారు. దగ్గేటప్పుడు, తుమ్ముతున్నప్పుడు కర్చీఫ్ కచ్చితంగా అడ్డుపెట్టుకోవాలని కోరారు. కరోనా అనుమానిత లక్షణాలున్న వారంతా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని కోరారు.