కాంగ్రెస్ లీడర్లకు గుణపాఠం చెప్పాలంటే బీజేపీకి ఓటెయ్యాలి : మోడీ

కాంగ్రెస్ లీడర్లకు గుణపాఠం చెప్పాలంటే బీజేపీకి ఓటెయ్యాలి : మోడీ

అహ్మదాబాద్/బొడేలి: తనను ఎంత ఎక్కువగా తిడతారనే దానిపై కాంగ్రెస్ నేతల మధ్య పోటీ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘ఒక ఫ్యామిలీ పట్ల విధేయత చూపేందుకు నన్ను తిడుతున్నారు. వాళ్లకు ఆ కుటుంబమే అన్నీ. ఆ ఫ్యామిలీని సంతోషపెట్టేందుకు ఏమైనా చేస్తారు. మోడీపై విషపూరితమైన మాటలు, తిట్లు ఎవరు ఉపయోగిస్తారనే దానిపై కాంగ్రెస్ నేతల మధ్య పోటీ నెలకొంది. ‘మోడీ కుక్క చావు చస్తాడు’.. ‘హిట్లర్ మాదిరి చస్తాడు’ అని అన్నారు. ఇంకొకాయన ‘అవకాశం దొరికితే మోడీని చంపేస్తా’ అని అన్నాడు. మోడీ స్థానమేంటో కాంగ్రెస్ చూపిస్తుందని మరో లీడర్ అంటడు” అని అన్నారు. గుజరాత్‌‌‌‌లోని పంచమహల్ జిల్లా కలోల్​లో జరిగిన ఎన్నికల సభలో మోడీ మాట్లాడారు.

గుణపాఠం చెప్పండి

తనను తిట్టడమంటే గుజరాత్‌‌‌‌ను, గుజరాత్ ప్రజలను అవమానించడమేనని మోడీ అన్నారు. ‘‘కాంగ్రెస్ లీడర్లకు గుణపాఠం చెప్పేందుకు ఒకే దారి ఉంది. ఈ నెల 5న పోలింగ్ (రెండో విడత) సందర్భంగా కమలం గుర్తుకు ఓటేయండి. బురద జల్లడంలో కాంగ్రెస్ నేతలు నిమగ్నమైన ప్రతిసారి కమలం వికసిస్తుందనే విషయం వాళ్లకు తెలియాలి’’ అని పిలుపునిచ్చారు. మోడీని తిట్టడం, దేశ ప్రధానిని అవమానపర్చడం.. వాళ్ల హక్కు అని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని విమర్శించారు. ‘‘నేను ఖర్గేను గౌరవిస్తాను. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలను ఆయన ఫాలో కావాల్సి ఉంటుంది. అందుకే ‘మోడీకి రావణుడిలా 100 తలలు ఉన్నాయి’ అని ఖర్గే చెప్పాల్సి వచ్చింది. గుజరాత్‌‌‌‌.. రామ భక్తుల భూమి అని కాంగ్రెస్‌‌‌‌ ఇంకా అర్థం చేసుకోలేదు. రాముడి అస్థిత్వాన్ని ఎన్నడూ నమ్మని వాళ్లు.. ఇప్పుడు నన్ను తిట్టేందుకు రామాయణం నుంచి రావణుడిని తీసుకొచ్చారు” అని అన్నారు.  

కాంగ్రెస్ హయాంలోనే పేదరికం పెరిగింది..

గతంలో కాంగ్రెస్ ‘గరీబీ హటావో’ కార్యక్రమం చేపట్టిందని, కానీ ఆ పార్టీ హయాంలోనే పేదరికం పెరిగిందని మోడీ ఆరోపించారు. ఛోటా ఉదేపూర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని బొడేలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘దశాబ్దాలుగా.. గరీబీ హటావో అంటూ కాంగ్రెస్ ఒకే విషయం చెబుతున్నది. ఆ పని చేసేందుకు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. కానీ మీరు పేదరికాన్ని నిర్మూలించాలని ప్రజలనే అడుగుతున్నారు. నినాదాలు చేయడం, హామీలు ఇవ్వడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం.. ఇవే మీరు చేసింది. అందుకే మీ హయాంలోనే పేదరికం పెరిగిపోయింది” అని విమర్శించారు.