కేసీఆర్ను నిరాశపర్చిన మోడీ ప్రసంగం

కేసీఆర్ను నిరాశపర్చిన మోడీ ప్రసంగం

రాజకీయ విమర్శలు లేవు.. టీఆర్ఎస్ సర్కారును తూర్పారబట్టలేదు. ప్రసంగంలో కనీసం సీఎం కేసీఆర్ పేరు కూడా ఎత్తలేదు. ఆదివారం పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ ప్రసంగం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్ గా మోడీ ప్రసంగం సాగుతుందని కేసీఆర్​ సహా అందరూ భావించినా అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. మోడీ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కేసీఆర్ ఊసెత్తకుండా ప్రసంగం ముగించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపైనే మోడీ తన ప్రసంగంలో ఫోకస్ చేశారు. పేదలు, రైతులు అణగారిన వర్గాల అభ్యున్నతిని చేస్తున్న కృషిని, కరోనా కాలంలో చేపట్టిన సహాయక చర్యల్ని వివరించారు. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, రాష్ట్రంలో మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు తదితర అంశాలను మాత్రమే మోడీ హైలైట్ చేశారు. ‘‘దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి.. తెలంగాణ ప్రజలు కూడా ఆ తరహా డబుల్ ఇంజన్ సర్కారును కోరుకుంటున్నారు’’ అనే అంశం ఒక్కటే మోడీ స్పీచ్ లో కాస్త పొలిటికల్ ఫ్లేవర్ కలిగినదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 

పార్టీ అగ్రనేతలతో కేసీఆర్పై విమర్శలు


రెండు రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ నోవాటెల్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యారు. కేసీఆర్ వ్యాఖ్యలు.. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమైన రోజే టీఆర్ఎస్ పోటాపోటీగా ర్యాలీ నిర్వహణ గురించి తెలిసినా.. మోడీ తన ప్రసంగంలో వాటిని ప్రస్తావించలేదు. ఇది ప్రధాని మోడీ వ్యూహాత్మక నిర్ణయమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇకపై జాతీయ రాజకీయాలే తన టార్గెట్ అని పదేపదే చెబుతున్న కేసీఆర్ గురించి మాట్లాడితే.. ఆయన స్థాయిని పెంచినట్లు అవుతుందని మోడీ భావించి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ నేరుగా కేసీఆర్, టీఆర్ఎస్ను టార్గెట్ చేయకుండా పార్టీ అగ్రనేతలతో గులాబీ బాస్ కు చురకలంటించారన్నది పొలిటికల్ అనలిస్టులు చెబుతున్న మాట. మోడీ స్వయంగా ఒక్క మాట అనకపోయినా.. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ను సీఎం చేయాలనుకుంటున్నాడని, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని, కేంద్ర పథకాల పేర్లు మార్చి జనాన్ని ఏమార్చుతున్నాడన్న పార్టీ అగ్రనేతల వ్యాఖ్యలతో కేసీఆర్ కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు, అవినీతిని ఎండగట్టేలా చేశాడని అంటున్నారు. ఈ క్రమంలో మోడీ స్పీచ్ జాతీయ రాజకీయాలపై కన్నేసిన కేసీఆర్ కు నిరాశ మిగిల్చిందన్నది పరిశీలకుల అభిప్రాయం. 

కేసీఆర్ను లెక్కచేయననే సందేశం..


మోడీ తన ప్రసంగంలో ఒక్కసారి కూడా కేసీఆర్ పేరు ఎత్తలేదు. ఇలా చేయడం ద్వారా కేసీఆర్ది తన స్థాయి కాదని, ఆయనను అసలు పట్టించుకోనన్న సందేశం ఇచ్చారన్నది మరికొందరు రాజకీయ పండితుల అభిప్రాయం. కేసీఆర్ ను విమర్శించి దేశవ్యాప్తంగా ఆయన పేరు చర్చకు వచ్చేలా చేయడం ఇష్టం లేకనే మోడీ వ్యూహాత్మకంగా తన ప్రసంగ పాఠాన్ని మార్చుకొని ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి ఒకవేళ విజయ సంకల్ప సభలో ఢీ అంటే ఢీ అన్నట్లుగా మోడీ కేసీఆర్ ను విమర్శించి ఉంటే జాతీయ స్థాయిలో ఈ అంశంపై చర్చ జరిగేది. నేషనల్ పాలిటిక్స్ లో గులాబీ బాస్ స్టేచర్ మరింత పెరిగేది. అందుకే టీఆర్ఎస్, కేసీఆర్ పేరు ఎత్తుకుండా మోడీ వారికి ఆ ఛాన్స్ లేకుండా చేశాడని, తిట్టకుండా సైలెంటుగా ఉండి తెలివిగా దెబ్బతీశాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మోడీ సభకు వారం ముందు నుంచే..


ప్రధాని మోడీ ఎంత తిడితే అంత మైలేజీ పెరుగుతుందనుకున్నది టీఆర్ఎస్ ప్లాన్. నిజానికి విజయ సంకల్ప సభకు వారం ముందు నుంచే టీఆర్ఎస్ బీజేపీని రెచ్చగొట్టేలా వ్యవహరించింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతుపై అప్పటివరకు మౌనం వహించిన టీఆర్ఎస్ అకస్మాత్తుగా గొంతు విప్పింది. సభకు సరిగ్గా వారం రోజుల ముందు (జూన్ 26న)  యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్నట్లు గులాబీ దళం ప్రకటించింది. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు.. రాత్రికి రాత్రే  మంత్రి కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. జూన్ 27న జరిగిన యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో కేటీఆర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇక ‘విజయ సంకల్ప సభ’ కోసం ప్రధాని మోడీ హైదరాబాద్ కు వచ్చే రోజే  (జులై 2న) .. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రంగంలోకి దింపారు. ప్రధాని నరేంద్రమోడీ మోడీకి స్వాగతం పలికేందుకు రాష్ట్ర మంత్రిని పంపిన సీఎం కేసీఆర్.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వయంగా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అంతేకాదు.. హైదరాబాద్ లో టీఆర్ఎస్ శ్రేణులతో భారీ ర్యాలీలు తీయించారు. రాష్ట్రపతి ఎన్నికలకు రాజకీయ రంగు పులిమేలా వ్యవహరించారు. 

పొలిటికల్ కామెంట్ల జోలికి పోని మోడీ


జులై 2న ఏర్పాటుచేసిన యశ్వంత్ సిన్హా పరిచయ కార్యక్రమంలో.. ప్రధాని మోడీ టార్గెట్ గా కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లను టార్గెట్ గా చేస్తున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్లే టార్గెట్ గా మారారు.. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మహారాష్ట్ర తరహాలో కూల్చేస్తారట.. అదే జరిగితే మాకు ఫ్రీ టైమ్ దొరుకుతుంది. కేంద్ర సర్కారును కూడా ఢిల్లీ నుంచి దించేస్తాం’’ అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు రెండు రోజులు తనపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తారని సాక్షాత్తూ కేసీఆరే అన్నారు.  మరోవైపు బీజేపీ సభకు ప్రచారం కల్పించకుండా హైదరాబాద్ అంతటా టీఆర్ఎస్ హోర్టింగులతో నింపేశారు. ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలు, టీఆర్ఎస్ వ్యవహారశైలిని టార్గెట్ చేస్తూ మోడీ ప్రసంగం ఉండొచ్చన్న వాదనలు వినిపించాయి. అయితే ఊహించని విధంగా మోడీ పొలిటికల్ కామెంట్ల జోలికి వెళ్లకపోవడం కేసీఆర్ కూడా ఊహించి ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మూడోసారి బాహాటంగా..


ప్రధానమంత్రి గత ఆరు నెలల వ్యవధిలో మూడుసార్లు తెలంగాణకు వచ్చారు. వచ్చిన ప్రతిసారి ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ వెళ్లకుండా, రాష్ట్ర మంత్రిని పంపడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. మోడీ మొదటిసారి వచ్చినప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉండగా.... రెండోసారి కర్ణాటకకు వెళ్లి మాజీ పీఎం దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. ఆ రెండుసార్లు రాష్ట్రంలో అందుబాటులో లేననే సందేశాన్ని పంపిన కేసీఆర్.. మూడోసారి బాహాటంగా మోడీపై వ్యతిరేకతను వెళ్లగక్కారు. జులై 2న మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోడీని స్వాగతించడానికి గులాబీ బాస్ వెళ్లలేదు. కానీ మోడీ దిగడానికి కాసేపు ముందు ల్యాండ్ అయిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ స్వయంగా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. పార్టీ శ్రేణులతో హైదరాబాద్ లో భారీ ర్యాలీలు తీయించారు. 

కేసీఆర్ సఖ్యంగా లేరనే అంశం జనాల్లోకి.. 


హైదరాబాద్ పర్యటన అనంతరం ప్రధాని మోడీ సోమవారం ఏపీకి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయంలో దిగిన ప్రధానికి సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఘన స్వాగతం పలికారు. ఆయనతో కలిసి భీమవరంలో జరిగిన ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకవైపు కేసీఆర్ వైఖరి మరోవైపు జగన్  కేంద్రంతో కేసీఆర్ సఖ్యతతో మెలగడం లేదనే సంకేతాలు తెలంగాణ ప్రజల్లోకి వెళ్తాయని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.