
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోడీ స్పీచ్
న్యూయార్క్ : ఉగ్రవాదంపై పోరాడేందుకు ప్రపంచం మొత్తం ఒక్కటి కావాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఉగ్రవాదంపై తాము సీరియస్ గానే కాకుండా కోపంగా కూడా ఉన్నామన్నారు. ఉగ్రవాదం ఏ ఒక్క దేశానికో మాత్రమే సవాల్ కాదని… ప్రపంచం మొత్తానికి ఛాలెంజ్ అన్నారు. ఉగ్రవాదంతో మానవత్వానికి ప్రమాదం పొంచి ఉందన్నారు మోడీ. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మోడీ ప్రసంగించారు. ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ మిషన్స్ లో అన్ని దేశాల కంటే బలిదానాలు భారతే చేసిందన్నారు. ప్రపంచానికి భారత్ యుద్ధాన్ని కాకుండా బుధ్దుడిని ఇచ్చిందన్న మోడీ… మా దేశం శాంతి సందేశం ఇచ్చిందన్నారు.
హెల్త్ సెక్టార్ లో తన ప్రభుత్వం సాధించిన విజయాలను మోడీ ప్రస్తావించారు. 2025కల్లా TBని నిర్మూలించేందుకు పనిచేస్తున్నామని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా దేశంలో ఉద్యమం చేస్తున్నామన్నారు. ఐదేళ్లలో దేశంలో 11 కోట్ల టాయిలెట్స్ నిర్మించామని మోడీ చెప్పారు.
గ్లోబల్ వార్మింగ్ లో భారత్ భాగం తక్కువగానే ఉన్నా… దానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత్ ముందుందని చెప్పారు మోడీ. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ స్థాపనకు తామే చొరవ తీసుకున్నామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం తనకు, తన ప్రభుత్వానికి ఓటేసిందన్నారు మోడీ.
తన ప్రసంగంలో పాకిస్తాన్ గురించి మోడీ మాట్లాడతారని అంతా అనుకున్నా… ఆయన దాని జోలికి పోలేదు. అలాగే ఆర్టికల్ 370, కశ్మీర్, పాకిస్తానీ ఉగ్రవాదం గురించి ప్రత్యక్షంగా ఏమీ ప్రస్తావించలేదు. ఇక న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ముందు భారతీయులు సంబరాలు చేసుకున్నారు.