
- నేతాజీ స్టాట్యూ, సెంట్రల్ విస్టా లాన్స్ ప్రారంభించనున్న మోడీ
- రేపటి నుంచి పబ్లిక్కు అనుమతి
న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో సెంట్రల్ విస్టా లాన్స్, కర్తవ్యపథ్ (ఇంతకుముందు రాజ్ పథ్)ను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రాత్రి 7 గంటలకు ప్రారంభించనున్నారు. ఇండియా గేట్ వద్ద 28 అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించనున్నారు. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఉన్న కర్తవ్యపథ్ ఏరియాను, సెంట్రల్ విస్టా లాన్స్ ను రీడెవలప్ చేసి, ప్రజలకు అనేక సౌలతులు కల్పించారు. వీటిని శుక్రవారం నుంచి ప్రజల సందర్శనకు అనుమతించనున్నారు. ఇక నేతాజీ జయంతి (పరాక్రమ్ దివస్) సందర్భంగా జనవరి 23న ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ స్టాచ్యూను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఇప్పుడు అదే ప్లేస్ లో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని గ్రానైట్ ఏక శిల నుంచి శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. దీని బరువు 65 టన్నులు. కాగా, సెంట్రల్ విస్టా రీడెవలప్ మెంట్ ప్రాజెక్టు కింద రాజ్ పథ్, సెంట్రల్ విస్టా అవెన్యూ ప్రాంతాల్లో పలు మార్పులు చేర్పులు చేసినట్లు పీఎంవో తెలిపింది. పబ్లిక్ టాయిలెట్లు, తాగునీళ్లు, పార్కింగ్ సౌలతు వంటివి ఏర్పాటు చేశారని, రిపబ్లిక్ డే పరేడ్ వంటి సందర్భాల్లో సందర్శకులకు, సాధారణ ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా కార్యక్రమం నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయని వివరించింది.
రాజ్ పథ్ పేరు.. కర్తవ్యపథ్ గా మార్పు
ఢిల్లీలోని రాజ్ పథ్ పేరును కర్తవ్యపథ్ గా మార్చాలన్న ప్రతిపాదనను న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) బుధవారం ఆమోదించింది. కేంద్ర హౌజింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనపై కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి, ఎన్డీఎంసీ మెంబర్ మీనాక్షి లేఖి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ మీటింగ్ లో చర్చించిన తర్వాత ఆమోదం తెలిపినట్లు ఎన్డీఎంసీ వైస్ చైర్మన్ సతీశ్ ఉపాధ్యాయ్ వెల్లడించారు. ఇండియా గేట్ వద్ద ఉన్న నేతాజీ విగ్రహం దగ్గర నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఉన్న రాజ్ పథ్ ఏరియాను ఇకపై కర్తవ్యపథ్ గా పిలవనున్నట్లు ఆయన తెలిపారు.