స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించండి.. అరుణాచల్ వ్యాపారులతో సమావేశంలో ప్రధాని మోదీ

స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించండి.. అరుణాచల్ వ్యాపారులతో సమావేశంలో ప్రధాని మోదీ
  • వర్చువల్‌‌‌‌గా రూ. 5,125 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం 
  • రాష్ట్రాన్ని 'ఆసియా టైగర్'గా మార్చుతామని హామీ

ఈటానగర్‌‌‌‌: ప్రధాని నరేంద్ర మోదీ తన ఒకరోజు పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్‌‌‌‌కు చేరుకున్నారు. హోల్లోంగిలోని డోన్యి పోలో ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌లో ల్యాండ్ అయిన ప్రధాని..హెలికాప్టర్‌‌‌‌లో నేరుగా ఈటానగర్‌‌‌‌లోని రాజ్‌‌‌‌భవన్‌‌‌‌కు వెళ్లారు. అక్కడ ఆయనకు అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు, గవర్నర్ కేటీ పర్నాయక్‌‌‌‌లు స్వాగతం పలికారు. 

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) సంస్కరణలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో రాజ్‌‌‌‌భవన్‌‌‌‌లోనే వ్యాపారులు, షాప్‌‌‌‌కీపర్లతో మోదీ సమావేశమయ్యారు. "ఈ రోజు నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ కొత్త  సంస్కరణలు 375 వస్తువులపై ట్యాక్స్ రేట్లను తగ్గిస్తున్నాయి. ఇకపై నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ వంటివి చౌకగా లభిస్తాయి.

దసరా, దీపావళి వేళ ఇది 'బచత్ ఉత్సవ్' (సేవింగ్స్ ఫెస్టివల్)గా మారుతుంది. జీఎస్టీ కొత్త సంస్కరణలతో మీరూ, మీ కస్టమర్లూ డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఆదా అయిన డబ్బుతో స్వదేశీ వస్తువులను ప్రోత్సహించండి. అందరూ స్వదేశీ వస్తువులను అమ్మడం, కొనడం వల్లే మన దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది" అని మోదీ తెలిపారు. 

అనంతరం మోదీ స్వయంగా 'గర్వ్ సే కహో యే స్వదేశీ హై(ఇది స్వదేశీ అని గర్వంగా చెప్పండి)' అని రాసి ఉన్న ప్లకార్డులను వారికి అందజేశారు. వాటిని దుకాణాల్లో ఉంచండని మోదీ కోరగా..తప్పకుండా ఉంచుతామని, స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తామని వ్యాపారులు బదులిచ్చారు.

రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టులు ప్రారంభం
అనంతరం ప్రధాని ఈటానగర్‌‌‌‌లోని ఇందిరా గాంధీ పార్క్‌‌‌‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అటెండ్ అయ్యారు. అక్కడి నుంచే రూ. 5,125.37 కోట్ల విలువైన ప్రాజెక్టులను వర్చువల్‌‌‌‌గా ప్రారంభించారు. అందులో షీ యోమి జిల్లాలో రెండు పెద్ద హైడ్రోపవర్ ప్రాజెక్టులు, తవాంగ్‌‌‌‌లో కన్వెన్షన్ సెంటర్లు ఉన్నాయి.

ప్రాజెక్టులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. "టాటో-I, హేఓ అనే ఈ హైడ్రోపవర్ ప్రాజెక్టులు అరుణాచల్​ను శక్తి సమృద్ధి రాష్ట్రంగా మారుస్తాయి. టాటో-I(186ఎండబ్ల్యూ), హేఓ (240 ఎండబ్ల్యూ)లు ఏడాదికి 1,800 మిలియన్ యూనిట్ల విద్యుత్‌‌‌‌ను ఉత్పత్తి చేస్తాయి” అని తెలిపారు. రోడ్లు, విమానాశ్రయాల అభివృద్ధి, విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా అరుణాచల్​ను 'ఆసియా టైగర్'గా మార్చుతమని మోదీ పేర్కొన్నారు.