సెకండ్‌ వేవ్‌ తర్వాత మోడీ తొలి ఫారెన్‌ టూర్

సెకండ్‌ వేవ్‌ తర్వాత మోడీ తొలి ఫారెన్‌ టూర్

న్యూఢిల్లీ: ఈ నెల 24న క్వాడ్ దేశాల సదస్సు జరగనుంది. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో జరిగే ఈ సదస్సుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా పాల్గొంటారు. దీనికోసం అమెరికా వెళ్లనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విలయం తర్వాత మోడీ విదేశీ పర్యటనకు వెళ్లనుండడం ఇదే ఫస్ట్ టైమ్. క్వాడ్ దేశాల అధినేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు అధ్యక్షుడు జో బైడెన్ ఎదురు చూస్తున్నారని వైట్ హౌస్ తెలిపింది. ఈ ఏడాది మార్చి 12న క్వాడ్ మీటింగ్ వర్చువల్ గా జరిగింది. ఆ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు, చేసుకున్న ఒప్పందాల్లో పురోగతిని 24న జరగనున్న సమావేశంలో నేతలు సమీక్షించనున్నారు. అలాగే ప్రాంతీయ అంశాలు, నాలుగు దేశాలకు సంబంధిచిన ప్రయోజనాలపై చర్చించనున్నారు. 

ఇండో-పసిఫిక్ ప్రాంతం, బహుపాక్షిక అంశాలు, 21వ శతాబ్ధపు సవాళ్లను ఎదుర్కొనే అంశాలపై క్వాడ్ లీడర్స్ సమ్మిట్ లో ప్రధానంగా చర్చలుంటాయని వైట్ హౌస్ ప్రకటించింది. అలాగే భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సంబంధాలను మరింత బలోపేతం చేయడం, కరోనాను ఎదుర్కొనేందుకు ప్రాక్టికల్ కోఆపరేషన్ ను మరింత అడ్వాన్స్ గా మార్చడం, వాతావరణ సంక్షోభం, ఎమర్జింగ్ టెక్నాలజీస్-సైబర్ స్పేస్ కు సంబంధించిన అంశాలు, ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుతంగా మార్చడం లాంటివాటిపై బైడెన్, మోడీ, మోరిసన్, సుగాలు చర్చించనున్నారు. 

అమెరికా వెళ్లనున్న మోడీ... బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపే అవకాశం ఉంది. అలాగే ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తోనూ సమావేశం కావొచ్చు. ఇక ఈ నెల 25న ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో ప్రసంగిస్తారు. కరోనా నుంచి రికవర్ కావడం... తొందరగా పాత స్థితికి వెళ్లడం అనే అంశాన్ని ఈసారి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మీటింగ్ థీమ్ గా తీసుకున్నారు.