- రామ్‌లల్లా ఆలయ గర్భగుడిపై కాషాయ జెండా ఎగరేసిన మోదీ
- గుడి నిర్మాణం పూర్తయిందనేందుకు గుర్తుగా ఆవిష్కరణ
- హాజరైన యూపీ సీఎం యోగి, గవర్నర్ ఆనందీబెన్,
- ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భాగవత్, వేలాది మంది భక్తులు
- 500 మంది కళాకారుల ప్రదర్శనతో హోరెత్తిన అయోధ్య వీధులు
- 500 ఏండ్ల నాటి సంకల్పం నెరవేరింది: ప్రధాని నరేంద్ర మోదీ
- ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తున్నా
- ధర్మధ్వజం.. దేశ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నమని వ్యాఖ్య
అయోధ్య:యూపీలోని అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మంగళవారం ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రామ్‌లల్లా గర్భగుడిపై ప్రధాని నరేంద్ర మోదీ కాషాయ రంగులోని ధర్మధ్వజాన్ని ఆవిష్కరించారు. ఆలయ నిర్మాణం పూర్తయిందనేందుకు గుర్తుగా ఈ జెండాను ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భాగవత్ పాల్గొన్నారు. వివాహ పంచమిని పురస్కరించుకొని జరిగిన ఈ కార్యక్రమంలో యూపీలోని నలుమూలలనుంచి వచ్చిన 500 మందికిపైగా కళాకారులు తమ ప్రదర్శనలతో హోరెత్తించారు.
కళాకారుల పాటలు, నృత్యం, సాంప్రదాయ ప్రదర్శనలతో ఆయోధ్య ఓ సాంస్కృతిక వేదికగా మారింది. ఈ వైభవాన్ని దేశ నలుమూలలనుంచి వచ్చిన వేలాది మంది భక్తులు తిలకించి, పులకించిపోయారు. ‘జై శ్రీరామ్’ అంటూ నినదించారు. అంతకుముందు గర్భగుడిలో బాలరాముడికి మోదీ హారతి ఇచ్చి, ప్రత్యేక పూజలు చేశారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో అయోధ్యలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏటీఎస్ కమాండోలు, ఎన్ఎస్‌జీ స్నిపర్స్, ప్రత్యేక నిఘా బృందాలుసహా 6,970 మంది భద్రతా సిబ్బందిని పట్టణమంతా మోహరించారు. యాంటీ-డ్రోన్ సిస్టమ్స్, బాంబు స్క్వాడ్‌లు, అగ్నిమాపక దళాలు, వీవీఐపీ రక్షణ బృందాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు
నేడు వారి ఆత్మకు శాంతి: మోహన్ భాగవత్
రామాలయం నిర్మాణం కోసం ప్రాణ త్యాగం చేసినవారి ఆత్మలు నేడు శాంతిస్తాయని మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. ధ్వజారోహణ రామరాజ్య ధ్వజం.. ధర్మం, శాంతి, సమృద్ధికి చిహ్నమని, ఇది దేశ చరిత్రలో మహత్వపూర్ణ ఘట్టమని అన్నారు. ఇది 500 ఏండ్ల ఉద్యమం, 30 ఏండ్ల కష్టమని తెలిపారు. అశోక్ సింఘాల్, మహంత్ రామ్ చంద్రదాస్ లాంటి నాయకుల త్యాగాలకు ఈ రోజు గౌరవం లభించిందని చెప్పారు.
శతాబ్దాలనాటి గాయాలు మానిపోయాయ్: మోదీ
అయోధ్య రామాలయం అధికారికంగా పూర్తికావడంతో శతాబ్దాలనాటి గాయాలు, బాధలు మానిపోయాయని ప్రధాని మోదీ అన్నారు. బాలరాముడి ఆలయ శిఖరంపై ధర్మధ్వజాన్ని ఆవిష్కరించిన అనంతరం మోదీ మాట్లాడారు. ‘‘నేడు మొత్తం దేశం, ప్రపంచం రామనామంలో మునిగిపోయాయి. 500 ఏండ్లనాటి సంకల్పం నెరవేరింది” అని వ్యాఖ్యానించారు. ఇది ఒక ప్రత్యేకమైన, దివ్యమైన క్షణమని తెలిపారు.
రామాలయంపై ఎగురుతున్న పవిత్ర జెండా.. ‘‘అబద్ధంపై చివరికి నిజం విజయం సాధిస్తుంది” అనేందుకు సాక్ష్యంగా నిలుస్తుం దని చెప్పారు. రామ భక్తులకు, ఆలయ నిర్మాణానికి సహాయపడిన వారందరికీ అభినందనలు తెలిపారు. ‘‘రామాలయ నిర్మాణ యజ్ఞానికి పూర్ణాహుతి జరిగింది. ధర్మధ్వజం ఓ జెండా మాత్రమే కాదు.. దేశ సాంస్కృతిక పునర్వికాసానికి చిహ్నం.
శ్రీరాముడి సిద్ధాంతాలను ఇది ప్రపంచానికి చాటుతుంది. స్ఫూర్తి, ప్రేరణను ఇస్తుంది” అని వివరించారు. ఈ ధర్మధ్వజాన్ని దూరం నుంచి చూసినా రాముడిని చూసినంత పుణ్యమని తెలిపారు. నేటి గురించి మాత్రమే ఆలోచించేవారు రాబోయే తరాలకు అన్యాయం చేస్తున్నారని, వారితో దేశానికి ప్రమాదమని ప్రధాని మోదీ అన్నారు.
