ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలు విసిగిపోయారని.. జూన్ 4 తర్వాత ఆయన లాంగ్ లీవ్ తీసుకోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ఇది భారత ప్రజల హామీ అని తెలిపారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉందంటూ మోదీ చేసిన కామెంట్స్ పై ఆయన స్పందించారు. పదేళ్లుగా ఎలాంటి హామీలు నెరవేర్చని మోదీ..కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు చేస్తున్నారని జైరాం రమేష్ మండిపడ్డారు.
పదేళ్ల అన్యాయం తర్వాత కాంగ్రెస్ 'పాంచ్ న్యాయ్ పచీస్ గ్యారెంటీ' భారత ప్రజల్లో కొత్త ఆశను రేకెత్తిస్తున్నదని జైరాం అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ హామీలు నేటి ఆవశ్యకమని, ఇది దేశంలోని కష్టాల్లో ఉన్న ప్రజల గొంతుక అని జైరాం రమేష్ ట్వీట్ చేశారు. మోదీ తన కుర్చీని కాపాడుకోవడానికి నిరాధారమైన మాటలు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాతీయ స్థాయిలో కులగణన చేపడతామని, రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తామని, కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కి లీగల్ గ్యారంటీ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. మేనిఫెస్టోలో ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీ’ అంశానికి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపింది.