ట్రాక్ రికార్డుకు ఓటేశారు .. సుపరిపాలనకు ప్రజలు పట్టంకట్టారు: మోదీ

ట్రాక్ రికార్డుకు ఓటేశారు ..  సుపరిపాలనకు ప్రజలు పట్టంకట్టారు: మోదీ

డెహ్రాడూన్/న్యూఢిల్లీ: ఇటీవలి ఎన్నికల్లో సుస్థిరత, బలమైన ప్రభుత్వాల కోసం ప్రజలు ఓటేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆకాంక్షలతో కూడిన భారతదేశం అస్థిరతను కోరుకోదని, స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నదని చెప్పారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌‌గఢ్‌‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం డెహ్రాడూన్‌‌లో రెండు రోజుల ఉత్తరాఖండ్‌‌ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్‌‌ను మోదీ ప్రారంభించారు. తర్వాత బిజినెస్ లీడర్స్‌‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘మేము ప్రతిచోటా ఆకాంక్షలు, ఆశలు, ఆత్మవిశ్వాసం, ఆవిష్కరణలు, అవకాశాలను చూస్తాం. మీరు(ఇన్వెస్టర్స్) విధాన ఆధారిత పాలన చూస్తారు. రాజకీయ సుస్థిరతను కోరుకునే దేశ ప్రజల దృఢ సంకల్పాన్ని మీరు చూస్తారు. ఇటీవలి ఎన్నికల్లో, గతేడాది ఉత్తరాఖండ్‌‌లోనూ ఈ ట్రెండ్స్‌‌ కనిపించాయి. సుపరిపాలనకే జనం ఓటేశారు. పాలనాపరమైన ట్రాక్ రికార్డ్ చూసి ప్రభుత్వాలను ఎన్నుకున్నారు’’ అని చెప్పారు.

నా మూడో టర్మ్‌‌లో దేశం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ!

రాబోయే రోజుల్లో అదికూడా తన మూడో టర్మ్‌‌లో.. ప్రపంచంలోనే మూడో లార్జెస్ట్ ఎకానమీగా దేశం ఎదుగుతుందని ప్రధాని అన్నారు. భారత కంపెనీలు, ఇన్వెస్టర్లకు ఇది ఉత్తమమైన సమయమని చెప్పారు.‘స్థిరమైన ప్రభుత్వం, సపోర్టివ్ పాలసీ స్ట్రీమ్, అభివృద్ధి వైపు పయనించాలనే సంకల్పం.. ఈ కలయిక మొదటిసారి జరిగింది. ఇది సరైన సమయం’ అని అన్నారు. కాగా, ధనిక వ్యాపారవేత్తలు డెస్టినేషన్ వెడ్డింగ్స్‌‌ కోసం విదేశాలకు వెళ్లడంపై ప్రధాని స్పందించారు. ‘‘పెండ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని అంటారు. కానీ ఇప్పుడు యువ జంటలు దేవ భూమిని వదిలి విదేశాలకు వెళ్తున్నాయి. ‘వెడ్ ఇన్ ఇండియా’ మూవ్‌‌మెంట్ రావాలన్నదే యువతకు, ధనికులకు నా సూచన” అని అన్నారు.

దోచుకున్న ప్రతి పైసా తిరిగి చెల్లించాల్సిందే..!

ప్రతిపక్షాలు పేదల నుంచి దోచుకున్న ప్రతి పైసాను తిరిగి చెల్లించాల్సిందేనని, ఇది తన గ్యారంటీ అని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు (జార్ఖండ్‌‌)కు సంబంధించిన బిజినెస్‌‌ గ్రూపు ఆఫీసుల్లో జరిపిన సోదాల్లో రూ.200 కోట్లను ఇన్​కమ్ ట్యాక్స్ డిపార్ట్‌‌మెంట్ రికవర్ చేసుకున్నట్లు వచ్చిన వార్తలపై ట్విట్టర్‌‌‌‌ (ఎక్స్) లో స్పందించారు. ‘‘దేశ ప్రజలు ముందు ఈ కరెన్సీ నోట్లను చూసి.. తర్వాత నిజాయితీపై ఆ (కాంగ్రెస్) నాయకులు చెప్పే మాటలు వినాలి. ప్రజల నుంచి దోచుకున్న ప్రతి పైసా తిరిగి ఇవ్వాలి. ఇది మోదీ హామీ’’ అని ట్వీట్ చేశారు. కొన్ని ఎమోజీలను జత చేశారు. వార్తా పత్రిక క్లిప్పింగ్‌‌ను ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేశారు.