
న్యూఢిల్లీ: దేశ ప్రజల ఆమోదం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. 13 దేశాల అధినేతలకు సొంత ప్రజల ఆమోదం (అప్రూవల్) ఎంత ఉందన్న అంశంపై ‘మార్నింగ్ కన్సల్ట్’ సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్’ సర్వేలో మోడీ 70 శాతం రేటింగ్స్ తో మొదటి స్థానం దక్కించుకున్నారు. జో బైడెన్, బోరిస్ జాన్సన్, ఏంజెలా మెర్కెల్ వంటి పాపులర్ లీడర్లను సైతం మోడీ అధిగమించారు. ఇక మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ 64 శాతం అప్రూవల్ రేటింగ్స్ తో మోడీ తర్వాత రెండో స్థానంలో నిలిచారు. ఇటలీ ప్రధాని మారియో ద్రాఘి 63 శాతం రేటింగ్స్ తో థర్డ్ ప్లేస్ పొందారు. అమెరికాకు చెందిన డేటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ 13 దేశాల అధినేతలకు ప్రజల ఆమోదంపై వారానికి ఓసారి సర్వే రిజల్ట్ ను తన వెబ్ సైట్ లో పొందుపరుస్తోంది. ఆయా దేశాల్లోని పెద్ద వయసు వారితోనే సర్వే నిర్వహిస్తోంది. దేశాన్ని బట్టి, సర్వేలో పాల్గొన్న వారి సంఖ్యను నిర్ణయిస్తుంది. తాజాగా ఆగస్ట్ 31 నాటికి గత వారం రోజుల్లో జరిగిన సర్వేలో ప్రధాని మోడీ మొదటి స్థానంలో నిలిచారు.
గ్లోబల్ లీడర్ల రేటింగ్స్ ఇవే..
- నరేంద్ర మోడీ : 70%
- ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ (మెక్సికో ప్రెసిడెంట్): 64%
- మారియో ద్రాఘి (ఇటలీ ప్రధాని): 63%
- ఏంజెలా మెర్కెల్
- (జర్మనీ చాన్స్ లర్): 52%
- జో బైడెన్ (అమెరికా ప్రెసిడెంట్): 48%
- స్కాట్ మారిసన్
- (ఆస్ట్రేలియా ప్రధాని): 48%
- జస్టిన్ ట్రూడో (కెనడా ప్రధాని): 45%
- బోరిస్ జాన్సన్ (బ్రిటన్ ప్రధాని): 41%
- జైర్ బోల్సోనారో
- (బ్రెజిల్ ప్రెసిడెంట్): 39%
- మూన్ జే ఇన్
- (సౌత్ కొరియా ప్రెసిడెంట్): 38%
- పెడ్రో శాంచెజ్ (స్పెయిన్ ప్రధాని): 35%
- ఇమాన్యుయెల్ మెక్రాన్
- (ఫ్రాన్స్ ప్రెసిడెంట్): 34%
- యోషిహిడే సుగా (జపాన్ ప్రధాని): 25%