మోదీ డిగ్రీ వివరాలు బహిర్గతం చేయొద్దు : ఢిల్లీ హైకోర్టు

మోదీ డిగ్రీ వివరాలు బహిర్గతం చేయొద్దు : ఢిల్లీ హైకోర్టు
  • అది ఆయన పర్సనల్ ఇన్ఫర్మేషన్.. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమాత్రం కాదు: ఢిల్లీ హైకోర్టు
  • ప్రధానిపై అనాలోచిత కుట్రగా భావిస్తున్నాం
  • థర్డ్ పార్టీతో వివరాలు పంచుకోవడం కరెక్ట్ కాదు
  • ఢిల్లీ వర్సిటీ వాదనలతో ఏకీభవించిన జస్టిస్ సచిన్ దత్తా
  • 2016లో సీఐసీ ఇచ్చిన ఆదేశాలను కొట్టేస్తూ తీర్పు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన అంశం.. ఆయన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని.. పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయన డిగ్రీ వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. మోదీ డిగ్రీ వివాదం అంశానికి సంబంధించి తనిఖీకి అనుమతిస్తూ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) 2016లో ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 27న రిజర్వ్‌‌ చేసిన తీర్పును జస్టిస్‌‌ సచిన్‌‌ దత్తా సోమవారం వెలువరించారు. 

యూనివర్సిటీ స్టూడెంట్ల రికార్డులు.. ఆర్టీఐ చట్టం కింద బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రధాని విద్యార్హతలు బహిర్గతం చేయాలంటూ ఆర్టీఐ యాక్టివిస్ట్ నీరజ్ శర్మ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్​పై ఢిల్లీ హైకోర్టు విచారించింది. కాగా, ప్రధాని మోదీ విద్యార్హతలపై గత కొన్నేండ్లుగా వివాదం కొనసాగుతున్నది. 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి నరేంద్ర మోదీ.. బీఏ డిగ్రీ పూర్తి చేశారని చెప్తున్న నేపథ్యంలో, ఆ డిగ్రీ వివరాలను బహిర్గతం చేయాలన్న డిమాండ్ పెరిగింది.

అపరిచితులతో వివరాలు పంచుకోలేం: సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా

ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన అంశంపై హైకోర్టులో విచారణ కొనసాగింది. ఢిల్లీ యూనివర్సిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘‘వ్యక్తిగత గోప్యత హక్కు అనేది.. తెలుసుకునే రైట్ కంటే ఎక్కువ. మోదీ డిగ్రీ వివరాలను కోర్టుకు అందించేందుకు యూనివర్సిటీ సిద్ధంగా ఉంది. అయితే.. అవి అపరిచితులతో పంచుకోవడం ప్రైవసీ ఉల్లంఘన అవుతుంది. సీఐసీ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవద్దు.

 స్టూడెంట్ల రికార్డులకు తాము సంరక్షణదారులం. ఇతరుల ఆసక్తిని సంతోషపర్చేందుకు ఆ రికార్డులను ఆర్టీఐ కింద బయటపెట్టాల్సిన అవసరం లేదు. సమాచారం అనేది వ్యక్తిగతం’’అని తుషార్ మెహతా వాదించారు. ప్రధాని మోదీ 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ కోర్సులో డిగ్రీ చేశారని స్పష్టం చేశారు.

ఆర్టీఐ కింద బహిర్గతం చేయొచ్చు: పిటిషనర్ తరఫు అడ్వకేట్

పిటిషనర్ నీరజ్ శర్మ తరఫున సీనియర్ అడ్వకేట్ సంజయ్ హెగ్డే వాదనలు వినిపించారు. ‘‘సమాచార హక్కు చట్టం కింద ప్రధానమంత్రి విద్యార్హతలు బహిర్గతం చేయొచ్చు. పరీక్ష ఫలితాలను యూనివర్సిటీలన్నీ నోటీస్ బోర్డులు, వెబ్‌‌సైట్లు, న్యూస్ పేపర్లలో ప్రచురిస్తాయి. అలాంటప్పుడు అది వ్యక్తిగతం ఎలా అవుతుంది?’’అంటూ సంజయ్ హెగ్డే వాదించారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) ఆదేశాలు అమలు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సచిన్‌‌ దత్తా.. కీలక కామెంట్లు చేశారు. ప్రధాని మోదీ విద్యార్హతల అంశం.. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని.. పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదని స్పష్టం చేశారు. ప్రధాని వ్యక్తిగత అంశాలు అపరిచితులతో పంచుకోవడం సరికాదని తెలిపారు. 

మోదీ డిగ్రీ వరకు చదువుకున్నారా? లేదా? అని తెలుసుకునే క్యూరియాసిటీ మాత్రమే కనిపిస్తున్నదని చెప్పారు. పిటిషనర్ వైఖరి.. ప్రధానిపై అనాలోచిత కుట్ర, ఆరోపణలు చేసేలా ఉన్నాయని హెచ్చరించింది. ఢిల్లీ యూనివర్సిటీ వాదనలను ఏకీభవిస్తూ.. సీఐసీ ఆదేశాలను కొట్టేస్తున్నట్లు చెప్పారు.

కేసు నేపథ్యం

ప్రధాని మోదీ ఎంత వరకు చదువుకున్నారో వివరాలివ్వాలంటూ 2016లో ఆర్టీఐ యాక్టివిస్ట్ నీరజ్ కుమార్ ఆర్టీఐ అప్లికేషన్‌‌ పెట్టుకున్నాడు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 1978లో బీఏలో పాసైన స్టూడెంట్ల రికార్డులను ఇవ్వాలని కోరాడు. రోల్ నంబర్లు, పేర్లు, తండ్రి పేర్లు, మార్కులు వంటి వివరాలు కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. ప్రధాని మోదీతో సంబంధం ఉన్న అంశం కావడంతో.. వివరాలు ఇచ్చేందుకు ఢిల్లీ యూనివర్సిటీ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీపీఐవో) నిరాకరించారు. 

ఇది వ్యక్తిగత అంశమని.. మూడో వ్యక్తితో పంచుకోలేమని చెప్పారు. దీంతో నీరజ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ)కు అప్పీల్ చేశాడు. 1978 బీఏ స్టూడెంట్ల రికార్డులను పరిశీలించడానికి, సంబంధిత పేజీల సర్టిఫైడ్ ఎక్స్‌‌ట్రాక్ట్‌‌లను ఇవ్వాలని 2016, డిసెంబర్ 21న ఢిల్లీ యూనివర్సిటీని సీఐసీ ఆదేశించింది. సీఐసీ ఆదేశాలను ఢిల్లీ యూనివర్సిటీ.. 2017లో హైకోర్టులో సవాల్ చేసింది. 2017, జనవరి 24న  జరిగిన కోర్టు మొదటి విచారణలోనే సీఐసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ‘పబ్లిక్ ఇంట్రెస్ట్’.. ‘ఇంట్రెస్ట్ టు పబ్లిక్’ మధ్య తేడా ఉందని యూనివర్సిటీ వాదించింది. సుదీర్ఘ వాదనల తర్వాత 2025, ఫిబ్రవరి 27న తీర్పు రిజర్వ్‌‌ చేసి.. తాజాగా వెలువరించారు.