మోదీ డిగ్రీ వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

మోదీ డిగ్రీ వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వివరాలను వెల్లడించాలని 2016లో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు ఇవాళ రద్దు చేసింది. జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం తీర్పు వెల్లడించింది. దీంతో మోదీ డిగ్రీ వివాదంపై ఢిల్లీ యూనివర్సిటీ దాఖలు చేసిన వాదనను హైకోర్టు సమర్థించింది. వ్యక్తిగత విద్యార్హతల వివరాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావని, వాటిని బలవంతంగా వెల్లడించే పరిస్థితి లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ప్రధాని మోదీ డిగ్రీ వివాదంపై నడుస్తున్న చట్టపరమైన పోరాటం ముగిసినట్టయింది. 

విచారణ సందర్భంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, డిగ్రీని కోర్టుకు చూపించవచ్చని, కానీ దానిని బహిరంగంగా బహిర్గతం చేయరాదన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులకు వెల్లడించలేమని ఆయన నొక్కిచెప్పారు. పిటిషనర్, ఆప్ కు  చెందిన నీరజ్ శర్మ, సమాచార హక్కు చట్టం కింద డిగ్రీ వివరాలను కోరుతూ, ఒక ప్రభుత్వ సంస్థ అటువంటి సమాచారాన్ని దాచలేమని పేర్కొన్నారు. డిగ్రీ అనేది ప్రభుత్వ విషయమని, ప్రైవేట్ విషయం కాదని, విశ్వవిద్యాలయం తిరస్కరించడం ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తుందని శర్మ వాదించారు. ఫిబ్రవరి 27న ఇరు పక్షాల వాదనలు నమోదు చే సుకున్న ధర్మాసనం ఆగస్టు 25 తుది తీర్పు వెల్లడించనున్నట్టు ప్రకటిచింది. ఈ మేరకు ఇవాళ జడ్జిమెంట్ ఇచ్చింది.