ప్రధాని మోడీ ఇమేజే ఇండియా బలహీనత

ప్రధాని మోడీ ఇమేజే ఇండియా బలహీనత

న్యూఢిల్లీ: మన దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని విపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు పునరుద్ఘాటించారు. ప్రధాని మోడీపై రాహుల్ విరుచుకుపడ్డారు. మళ్లీ తాను అధికారంలోకి రావడానికి నకిలీ స్ట్రాంగ్ మ్యాన్ అనే ఇమేజ్‌ను మోడీ రూపొందించారని, ఛప్పన్ ఇంచ్ ఐడియాను కాపాడటానికి ఇప్పుడు దేశ అతిపెద్ద బలహీనతగా మారిందన్నారు. ట్విట్టర్‌‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసిన రాహుల్ దానికి జతగా క్యాప్షన్‌ను జత చేశారు.

‘అధికారంలోకి రావడానికి ప్రధాని నకిలీ బలవంతుడనే ఇమేజ్‌ను తయారు చేసుకున్నారు. అది ఆయన అత్యంత బలం. ఇదిప్పుడు ఇండియాకు అతపెద్ద బలహీనతగా మారింది. చైనా వ్యూహం, గేమ్ ప్లాన్ ఏంటి? అది సులువైనది. బార్డర్ వివాదం కాదు. చైనీయులు మన భూభాగంలో కూర్చుని ఉన్నారనేది నాకు ఆందోళన కలిగిస్తున్న విషయం. వాళ్లు ఓ స్ట్రాటజీ ప్రకారం ఆలోచించకుండా చైనీయులు ఏమీ చేయరు. వాళ్లు ఓ ప్లాన్ ప్రకారమే ఇలా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు గ్వదార్, బెల్ట్‌ రోడ్‌లను చూడొచ్చు. అది గ్రహాన్ని నియంత్రించడమే. అందుకే చైనా గురించి మాట్లాడినప్పుడు వారు ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్‌తో కలసి కాశ్మీర్‌‌లో ఏదో చేయాలనే వారు కుట్ర పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని సరిహద్దు సమస్యగా మాత్రమే చూడొద్దు. ఇండియా ప్రధానిపై ఒత్తిడి పెంచడానికి వారు బార్డర్ వివాదాన్ని రూపొందించారు. ఆయన ఇమేజ్‌ను వారు టార్గెట్ చేసుకున్నారు. ఓ పొలిటీషియన్‌గా ఆయన నెగ్గుకురావాలంటే ఆయనకు ఇమేజ్ ముఖ్యం. అందుకే ఛప్పన్ ఇంచ్‌ ఐడియాపై వారు అటాక్ చేస్తున్నారు. మేం చెప్పింది మీరు వినకపోతే శక్తిమంతులనే మీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తామని మోడీని చైనా భయపెడుతోంది’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.