
- రైతుకు పెట్టుబడి కింద సాయం ఏడాదికి రూ.6000
- పీఎం కిసాన్ స్కీమ్‌కు సవరణ.. 5 ఎకరాల రూల్ లేదు
- అన్నదాతలకు పెన్షన్.. షాప్ కీపర్లు, రిటైల్ ట్రేడర్లకు కూడా
ఈ టర్మ్‌లో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోని నిర్ణయాలు ఇండియన్ల గౌరవాన్ని, సాధికారతను పెంచుతాయి. రైతులకు, వ్యాపార రంగంలోని చిన్నచిన్న వ్యాపారులకు ఎంతో మేలు చేకూరుస్తాయి. మాకు ప్రజలే ముందు.. ప్రజలే ఎల్లప్పుడూ. వారి ప్రయోజనాలే ముఖ్యం. ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తాం. అందులో ఇది తొలి అడుగు. – ప్రధాని మోడీ ట్వీట్
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మళ్లీ అధికారంలోకి వచ్చిన మరుసటిరోజే ప్రధాని, మంత్రులు సమావేశమై.. రైతులు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా పథకాలను ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా శుక్రవారం కేబినెట్ సమావేశమై ఈ నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది. పథకం కింద ఏటా రూ. 6వేలు అందజేయనున్నారు. ఇప్పటివరకు ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ నిబంధనను ఎత్తివేశారు.
భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతులందరికీ దీన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు రైతులకు, షాప్ కీపర్స్‌కు, రిటైల్ట్రేడర్స్కు పెన్షన్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయంతో గురువారం రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన మోడీ, మంత్రులు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు మంత్రులందరికీ శాఖలను కేటాయించారు. సాయంత్రం సుమారు గంటన్నరపాటు ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం సౌత్ బ్లాక్‌లో కేబినెట్ సమావేశమైంది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఆయా శాఖల మంత్రులు మీడియాకు వెల్లడించారు.
రైతులందరికీ పెట్టుబడి సాయం
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు కొన్నిరోజుల ముందు జరిగిన బడ్జెట్ సమావేశంలో ‘పీఎం కిసాన్’ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ఐదెకరాల లోపు (రెండు హెక్టార్ల లోపు) భూమి ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి కోసం నాలుగు నెలలకోసారి రూ. 2000 చొప్పున ఏడాదికి రూ. 6000 అందజేయనున్నట్లు వెల్లడించింది. అప్పట్లో 12కోట్ల మంది రైతులకు ఈ పథకం ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపింది. రూ. 75వేల కోట్ల బడ్జెట్‌ను కూడా కేటాయించింది. ఇప్పటికే తొలి, రెండో విడతగా ఒక్కో రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డాయి. మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని విస్తరిస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపింది. దీన్ని అమలు చేస్తున్నట్లు శుక్రవారం కేబినెట్భేటీలో నిర్ణయం తీసుకున్నారు. భూమి ఉంటే చాలు.. అది గుంటనా ఎకరాల అన్నది సంబంధ లేకుండా రైతులందరికీ పీఎం కిసాన్ పథకాన్ని వర్తింపజేయనున్నారు.
దేశంలో ఉన్న 14 కోట్ల 50 లక్షల మంది రైతులకు ఇది వర్తిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. ఏటా పథకం అమలుకు రూ. 87 వేల కోట్లు ఖర్చవుతాయన్నారు. ఆరునెలల క్రితం పీఎం కిసాన్ పథకాన్ని తీసుకువచ్చినప్పటికీ కొన్ని రాష్ట్రాలు రైతుల డేటాను అందించలేకపోయాయయని, ఆయా రాష్ట్రాల్లోనూ ఇప్పుడు అమలయ్యేలా చూస్తామని ఆయన తెలిపారు. గతంలో పథకం కింద తొలివిడతగా 3కోట్ల 11 లక్షల మందికి ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. 2000 వేశామని, రెండో విడతగా 2కోట్ల 75లక్షల మంది ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ. 2000 జమ చేశారు.
షాప్ కీపర్స్, రిటైల్ ట్రేడర్స్‌కు కూడా పెన్షన్
షాప్ కీపర్స్, రిటైల్ ట్రేడర్స్, సొంత ఉపాధితో బతుకుతున్నవాళ్లకు ప్రయోజనం కలిగేలా మోడీ సర్కార్ మరో కీలక నిర్ణయం ప్రకటించింది. వీళ్లందరికీ పెన్షన్ పథకాన్ని అమలుచేయనున్నట్లు కేబినెట్ ప్రకటించింది. లబ్ధిదారులకు 60ఏళ్ల వయసు దాటిన తర్వాత నెలకు రూ. 3వేల చొప్పున పెన్షన్ అందనుంది. సుమారు 3కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఏడాదికి 1.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార రంగంలోని వాళ్లందరూ దీనికి అర్హులు. 18 నుంచి 40ఏళ్ల లోపు వాళ్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లబ్ధిదారులు కొంత, కేంద్ర ప్రభుత్వం కొంత సొమ్మును జమ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా వాలంటరీ అండ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం పరిధిలోకి రానుంది. ఈ స్కీంను కూడా మొన్న లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలోనే బీజేపీ ప్రకటించింది. ఈ పథకం ట్రేడింగ్ రంగంలోని చిన్నచిన్న వ్యాపారులకు ఎంతో మేలు చేకూరుస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ఇండియా ట్రేడర్స్ సెక్రటరీ జనరల్ ప్రవీన్ ఖండేవాలా ఆశాభావం వ్యక్తం చేశారు.
5 కోట్ల మంది రైతులకు పెన్షన్
60 ఏళ్లు దాటిన చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్ అమలు చేస్తామని మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతన మేనిఫెస్టోలో ప్రకటించిం ది. ఆ హామీకి కూడా కేబినెట్ ఆమోదం వేసిం ది. ‘ప్రధానమంత్రి కిసాన్పెన్షన్’ పథకాన్ని అమలుచేయనున్నట్లు వ్యవసాయ మంత్రి తోమర్ వెల్లడించారు. రూ.10 వేల కోట్లతోఈ స్కీం ను అమలు చేస్తున్నామని, దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుం దనివివరించా రు. 18ఏళ్ల నుంచి 40ఏళ్ల మధ్య వయసుగల రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, వాళ్లకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 3000 పెన్షన్ వస్తుందని తెలిపారు. లబ్ధిదారు మృతి చెం దితే లబ్ధిదారు కుటుంబంలోని ఒకరికి మొత్తంలో 50 శాతం పెన్షన్ అందుతుందని స్పష్టం చేశారు. నెల నెలా కేంద్ర ప్రభుత్వం కొంత, రైతులు కొం త సొమ్ము ను జమ చేయాల్సి ఉంటుం దని, ఇది వాలంటరీ అండ్ కాం ట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం పరిధిలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం రూ. 10,774 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుందని చెప్పారు. పీఎం కిసాన్ పథకం విస్తరణ, పెన్షన్ స్కీం చరిత్రాత్మక నిర్ణయాలని మంత్రి తోమర్ అన్నారు.
ఫుట్ అండ్ మౌత్ రోగాల నిర్మూలనకు
పశువులకు సోకే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, బ్రూసెల్లోసిస్ వ్యాధులన నిర్మూలనకు కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లలో ఈ వ్యాధులను పూర్తిగా నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. ఇది కూడా బీజేపీ మేనిఫెస్టోలోని హామీల్లో ఒకటి.
జులై 5న కేంద్ర బడ్జెట్
న్యూఢిల్లీ: రెండోసారి కొలువుదీరిన మోడీ సర్కారు జులై 5న పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు 17వ లోక్‌సభ తొలి సమావేశాలను జూన్ 17 నుంచి జరుగనున్నాయి. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కొత్త కేబినెట్ తొలి భేటీ అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్‌జవదేకర్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. లోక్‌సభ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేశామని, జూన్ 17వ తేదీ నుంచి జులై 26 వరకు నిర్వహిస్తామని తెలిపారు. తొలి రెండ్రోజులు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుందని, జూన్19వ తేదీన లోక్ సభ స్పీకర్ ను ఎన్నుకుంటారని చెప్పారు. మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుందన్నారు. జులై 4న ఎకనమిక్ సర్వేను విడుదల చేస్తామని, జులై 5న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019–20 ఏడాదికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతారని వివరించారు.
అమర జవాన్ల పిల్లల స్కాలర్ షిప్- 25 శాతం పెంపు
ప్రధాని మోడీ తొలి సంతకం అదే
రాష్ట్రాల్లోని పోలీసుల పిల్లలకూ వర్తింపు
న్యూఢిల్లీ : టెర్రరిస్టుల దాడులు, నక్సల్స్ దాడుల్లోచనిపోయిన జవాన్ల పిల్లలకు ‘ప్రధాన మంత్రి స్కాల-ర్‌షిప్ స్కీమ్(PMSS)’లో భాగంగా నెలనెలా అందజేసే స్కాలర్షిప్ లను 25శాతం పెం చుతూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. రెం డోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి సంతకం దీనిపైనే చేశారు. దీని ద్వారా ఇక నుంచి అబ్బాయిలకు నెలకు రూ.2500, అమ్మాయిలకు రూ.3 వేల స్కాలర్ షిప్ అందనుం ది. ఇప్పటివరకు అబ్బాయిలకు రూ. 2వేలు, అమ్మాయిలకు రూ. 2250 అందేది. ఏటా రక్షణ శాఖ పరిధిలోని 5500 మంది ఆర్మ్డ్ ఫోర్స్ , హోం శాఖ పరిధిలోని 2వేల పారామిలిటరీ, రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని150 మంది ఫోర్స్ కుటుంబాలకు ఈ స్కాలర్‌షిపులు చెల్లిస్తున్నారు. ఇక నుంచి ఈ పథకాన్ని రాష్ట్రాల పోలీస్ విభాగాలకూ విస్తరించాలని కేబినెట్ నిర్ణయించింది. ఏడాదికి 500 మంది రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన వారిని ఎంపిక చేస్తారు.‘‘దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే వారి కోసం తొలి నిర్ణయం తీసుకున్నాం ” అని మోడీ ట్వీట్ చేశారు.