కులం, మతం, ప్రాంతం పేరిట .. ప్రజలను విభజిస్తున్నరు : నరేంద్ర మోదీ

కులం, మతం, ప్రాంతం పేరిట .. ప్రజలను విభజిస్తున్నరు : నరేంద్ర మోదీ
  • డీఎంకేపై ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్
  • ఆ పార్టీకి రాష్ట్ర అభివృద్ధి ఏమాత్రం పట్టదని ఆరోపణ
  • డీఎంకే, కాంగ్రెస్​లవి బుజ్జగింపు రాజకీయాలని కామెంట్​
  • తమిళనాడు ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ విమర్శలు

వెల్లూర్/మెట్టుపాలయమ్: తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ అవినీతికి పర్యాయపదం లాంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. డీఎంకే విభజన రాజకీయాలతో ప్రజల మధ్య విద్వేషం వ్యాప్తి చేస్తోందని, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆ పార్టీకి ఎలాంటి పట్టింపు లేదని ఫైర్ అయ్యారు. బుధవారం తమిళనాడులోని మెట్టుపాలయమ్, వెల్లూర్ లలో జరిగిన బీజేపీ లోక్ సభ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మోదీ మాట్లాడారు. కాంగ్రెస్, డీఎంకే రెండూ కుటుంబ పార్టీలేనని విమర్శించారు. 

డీఎంకేను నడుపుతున్న కుటుంబం రాష్ట్రంలో రూ. వేల కోట్ల దోపిడీకి తెగబడుతోందని ఆరోపించారు. ‘‘డీఎంకే పార్టీ మొత్తం ఒక ఫ్యామిలీ కంపెనీలా మారింది. ఆ పార్టీ తన ఓల్డ్ మైండ్ సెట్​తో రాష్ట్రంలోని యువత అభివృద్ధికి అడ్డుపడుతోంది. ప్రజలను భాష, ప్రాంతం, కులం, మతం పేరుతో విభజిస్తోంది. దశాబ్దాల నుంచి డీఎంకే చేస్తున్న ఈ ప్రమాదకర రాజకీయాలను గుర్తిస్తే.. ప్రజలు ఒక్క ఓటు కూడా ఆ పార్టీకి వేయరు” అని మోదీ అన్నారు. 

డీంఎకే, ఇండియా కూటమి బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయని, ఇది ప్రమాదకరమన్నారు. కోయంబత్తూరులోని ఓ టెంపుల్ బాంబ్ బ్లాస్ట్ ఘటనపై స్పందిస్తూ.. డీఎంకే ఛాందసవాదులను కాపాడుతోందన్నారు. వెనకబడిన వర్గానికి చెందిన నేత, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయిన తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలైని సైతం డీఎంకే నేతలు అధికార గర్వంతో దుర్భాషలాడుతున్నారని అన్నారు. తమిళనాడులో వేలాది ఇండ్లకు నల్లా పైపుల ద్వారా తాగునీటి సరఫరా కోసం కేంద్రం నిధులు ఇస్తే.. అధికార డీఎంకే మాత్రం ఆ స్కీంను తన 
పార్టీ కార్యకర్తలకే అమలు చేసిందన్నారు.  

కచ్చతీవును వాళ్లే అప్పగించిన్రు.. 

కచ్చతీవు దీవిని 1974లో శ్రీలంకకు అప్పగించినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే పార్టీలే అధికారంలో ఉన్నాయని మోదీ అన్నారు. ఆ తర్వాత కచ్చతీవులో చేపల వేటకు వెళ్లిన మన జాలర్లను శ్రీలంక అరెస్ట్ చేస్తే.. ఏమీ ఎరగనట్టుగా ఆ రెండు పార్టీలు సానుభూతి తెలిపాయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం శ్రీలంక అరెస్ట్ చేసిన మన జాలర్లను విడుదల చేయించిందన్నారు. ‘కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందూ శక్తిని నాశనం చేయాలని చూస్తున్నారు’ అని మోదీ ఆరోపించారు. డీఎంకే మనస్తత్వం కూడా అలాగే ఉందన్నారు. 

ఆ రెండు పార్టీలు సనాతన ధర్మానికి వ్యతిరేకమన్నారు. అందుకే అయోధ్యలో రాముడి గుడి ప్రారంభాన్ని, పార్లమెంట్​లో సెంగోల్ ప్రతిష్ఠాపనను కూడా బహిష్కరించాయన్నారు. తమిళనాడును డ్రగ్స్ మత్తులో ముంచుతున్నారని, డీఎంకే నేత ఏకంగా రూ. 2 వేల కోట్ల డ్రగ్స్ తో పట్టుబడిన తర్వాతే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారని మోదీ అన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన జాఫర్ సాదిక్ కు ఏ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయన్నది అందరికీ తెలుసని మోదీ పేర్కొన్నారు.