వారెవ్వా వాట్సాప్ చానల్.. ఎట్ల స్టార్ట్ చేయాలి?

వారెవ్వా వాట్సాప్ చానల్.. ఎట్ల స్టార్ట్ చేయాలి?
  • ఫేస్ బుక్ మాదిరి లక్షలాది మందికి చేరేలా కొత్త ఫీచర్
  • మెసేజ్​లు, ఫొటోలు, వీడియోలు పోస్టు చేసేందుకు చాన్స్
  • చానళ్లు క్రియేట్ చేస్కుంటున్న పొలిటికల్ లీడర్లు, సినీ సెలబ్రిటీలు
  • ప్రధాని మోదీకి 22 లక్షలు, రాహుల్ కు 1.19 లక్షల మంది ఫాలోవర్లు 

హైదరాబాద్, వెలుగు :  మెసేజింగ్ యాప్ వాట్సాప్.. అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. ఇంతకాలం మెసేంజర్​లాగే పని చేసిన వాట్సాప్..​ ఇప్పుడు ‘వాట్సాప్ చానల్’​ పేరుతో కొత్త ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. కొద్దిరోజులుగా సెలెక్టెడ్​ బిజినెస్​ యూజర్లకే పరిమితమైన ఈ ఆప్షన్.. వాట్సాప్ వాడుతున్నోళ్లందరికీ రెండ్రోజుల కింది నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇంకేముంది రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు మొదలు చిన్న చిన్న కంటెంట్ క్రియేటర్ల వరకు అందరూ చానళ్లు స్టార్ట్ చేసేస్తున్నారు.

ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిన రెండ్రోజుల్లోనే కొన్ని వేల చానళ్లు క్రియేట్ అయ్యాయి. ప్రధాని మోదీ, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ లాంటి రాజకీయ ప్రముఖులు.. జూనియర్​ ఎన్టీఆర్, డైరెక్టర్​ రాజమౌళి లాంటి సినీ సెలబ్రిటీలు చానళ్లు ఓపెన్​ చేశారు. వాళ్లు చానల్స్​ క్రియేట్​ చేయడమే ఆలస్యం.. ఫాలోవర్లు వేలల్లో, లక్షల్లో యాడ్ అయ్యారు. ప్రధాని మోదీ చానల్​ను దాదాపు 22 లక్షల మంది, రాహుల్ చానల్​ను ​1.19 లక్షల మంది ఫాలో అవుతున్నారు. 

ఇక జూనియర్​ ఎన్టీఆర్​ను 65 వేలు, రాజమౌళికి 36 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

వన్​వే బ్రాడ్​ కాస్టింగ్​ టూల్.. 

వాట్సాప్ లో ఇన్ని రోజులుగా వాట్సాప్ కమ్యూనిటీ, వాట్సాప్ గ్రూప్​ల ద్వారా మన కాంటాక్ట్స్​తోనే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే  వెసులుబాటు ఉండేంది. ఇప్పుడు ‘వాట్సాప్ చానెల్’ ద్వారా లక్షలాది మందికి సమాచారాన్ని చేరవేసేలా అవకాశం కల్పిస్తోంది. వాట్సాప్ చానెల్ ఒకరకంగా వన్​వే బ్రాడ్​కాస్టింగ్​టూల్​లాగా పని చేస్తుంది. దీంతో అచ్చం ఫేస్​బుక్​లో మాదిరిగానే ఫొటోలు, వీడియోలు, మెసేజ్​లు షేర్ చేయొచ్చు. కాకపోతే మనం అలా షేర్ చేసిన వాటికి కామెంట్ చేసేందుకు మాత్రం ఫాలోవర్స్​ఎవరికీ చాన్స్ లేదు.

అయితే ఎమోజీలతో రియాక్షన్లు ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించారు. ట్విస్ట్ ఏంటంటే.. రియాక్షన్లు ఎవరెవరు ఇచ్చారో చూసేందుకు చానల్ అడ్మిన్​కు కూడా చాన్స్ ఇవ్వలేదు. కానీ ఎంతమంది రియాక్షన్ ఇచ్చారో అందరికీ తెలిసేలా ఫీచర్ పని చేస్తోంది. అలా ఇది వన్​వే సమాచారం షేర్ చేసేందుకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతోంది.

అందుకేనేమో ఫీచర్ అందుబాటులోకి వచ్చిన మొదటిరోజు నుంచే వీవీఐపీలు, సెలబ్రిటీలు వాట్సాప్​చానల్​లో ప్రత్యక్షమవుతున్నారు.  ప్రస్తుతం వాట్సాప్ చానల్ ఫీచర్​ను మన దేశంతో కలిపి150 దేశాల్లో ప్రారంభించినట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బర్గ్ ప్రకటించారు.

ఎందుకింత క్రేజ్?​

ఫేస్​బుక్, ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్​వంటి సోషల్​మీడియా పేజీలను చదువుకున్నోళ్లు, యూత్ ఎక్కువగా చూస్తుంటారు. గ్రామాలు, సిటీ బస్తీల్లోని చదువుకోనివాళ్లు, పెద్దవాళ్లు వాటిని వాడే చాన్స్​లేదు. అట్లాంటి సందర్భాల్లో సోషల్​ మీడియా అకౌంట్ల ద్వారా ప్రచారం చేసుకున్నా రాజకీయ నాయకులకు ఉపయోగం ఉండదు. రీచ్​కూడా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాట్సాప్​తీసుకొచ్చిన ఈ కొత్త ‘చానెల్​’ సిస్టమ్ రాజకీయ నాయకులకు ఓ వరంలా మారనుంది. వాట్సాప్​ గ్రూపుల మాదిరిగానే ఉండే ఈ చానెళ్లలో లీడర్లు, పార్టీలు, ప్రభుత్వాలు ఆయా కార్యక్రమాలను పోస్ట్​ చేయడం ఈజీ అవుతుంది.

అంతేగాకుండా దాదాపు ప్రతి ఒక్కరి చేతుల్లోనూ స్మార్ట్​ఫోన్​ఇప్పుడు కామన్​అయిపోయింది. చదువురానివాళ్లు కూడా వాట్సాప్​ వాడుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ఉంటున్నారు. అలాంటి వారికి రీచ్​అవ్వాలంటే ఈ వాట్సాప్​చానెల్​ ఓ బ్రిడ్జిలాగా ఉపయోగపడుతుందని నేతలు భావిస్తున్నారు. వాట్సాప్​చానెల్​ను ఫాలో చేస్తే చాలు.. ఆ చానెల్​లో సదరు లీడర్​కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు, ప్రచారాలూ వచ్చేస్తుంటాయి. చిన్నాపెద్ద, చదువుకున్నోళ్లు, చదువురానివాళ్లు అన్న తేడాలేకుండా అన్ని విషయాలూ జనానికి తెలుస్తాయి.

అందుకే లీడర్లు వాట్సాప్​చానెళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతానికి ఇదింకా స్టార్టింగ్​స్టేజ్​లోనే ఉంది. మరికొన్నాళ్లయితే దీనికి మరింత క్రేజ్​పెరిగే చాన్స్​ఉందని పార్టీల నేతలు చెప్తున్నారు.

చానల్​ ఎట్ల స్టార్ట్ చేయాలి?

వాట్సాప్​ ఓపెన్ చేసి చాట్స్ పక్కనే ఉండే అప్​డేట్స్​లోకి వెళ్లాలి. స్టేటస్​ల కింద చివరలో ఉండే చానల్స్ ఆప్షన్ పక్కన కనిపించే + సింబల్​పై క్లిక్ చేయాలి. ఇందులో క్రియేట్ చానల్, ఫైండ్ చానల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. క్రియేట్ చానల్​​పై టచ్ చేసి మన డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే సరి. చానల్ క్రియేట్ అయిపోతుంది. ఇక ఫైండ్ చానల్ ద్వారా ఇతరుల చానల్స్​ను గుర్తించి ఫాలో కావొచ్చు. 

నేతల ఎంట్రీ.. 

ఎన్నికల వేళ జనాలకు మరింత దగ్గరయ్యేందుకు నేతలు వాట్సాప్ చానెల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేకంగా వాట్సాప్ చానెల్స్ ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందులో పోస్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే వాట్సాప్ చానెల్​లోకి తెలంగాణ సీఎంవో ఎంట్రీ ఇచ్చింది. ఆ చానెల్ ను ప్రస్తుతం 66 వేల మంది ఫాలో అవుతున్నారు. అధికార పార్టీ నేతలు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి తదితరులు చానెళ్లు క్రియేట్​చేశారు. వీళ్లకు 200 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

కేటీఆర్​తో పాటు పార్టీలోని మరికొంత మంది కీలక నేతలు మాత్రం ఇంకా చానెళ్లు ఏర్పాటు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ​కూడా చానెల్ ఏర్పాటు చేయగా.. బీజేపీ, కాంగ్రెస్​మాత్రం పెట్టలేదు. ఇక కాంగ్రెస్ ఒక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే చానెల్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆయనకు 113 మంది ఫాలోవర్లు ఉన్నారు.