షింజో అంత్యక్రియలకు హాజరుకానున్న వంద దేశాల నేతలు

షింజో అంత్యక్రియలకు హాజరుకానున్న వంద దేశాల నేతలు

హాజరుకానున్న వంద దేశాల నేతలు  

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం టోక్యో పర్యటనకు బయలుదేరారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు మంగళవారం ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న అంత్యక్రియల కార్యక్రమానికి మోడీ హాజరు కానున్నారు. మోడీ, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సహా ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల నేతలు కార్యక్రమంలో పాల్గొని షింజోకు నివాళులు అర్పించనున్నారు.  

దాదాపు మూడు నెలల తర్వాత.. 

జపాన్ పార్లమెంట్ ఎగువసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జులై 8న నరా టౌన్​లో జరిగిన ప్రచార సభలో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో షింజో అబే(67) మరణించారు. ఆయనకు 3 రోజుల తర్వాత కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన పార్థివదేహాన్ని టోక్యోలోని జొజోజి టెంపుల్ వద్ద బౌద్ధ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. అయితే, షింజో అబే విధానాలు, యూనిఫికేషన్ చర్చ్ అనే వివాదాస్పద మతపరమైన సంస్థతో సన్నిహిత సంబంధాల కారణంగా ఆయన పట్ల జపాన్ ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తింది. ఇదే కారణంతో ఆయనను కాల్చిచంపినట్లు నిందితుడు కూడా చెప్పాడు. దీంతో ప్రధాని ఫ్యుమియో కిషిడా ప్రభుత్వం దాదాపు 3 నెలల తర్వాత అధికారికంగా అంత్యక్రియలు నిర్వహిస్తోంది. 

భారీ బందోబస్త్ 

షింజో అబే అంత్యక్రియలను ప్రభుత్వం నిర్వహించొద్దంటూ సోమవారం 10 వేల మంది టోక్యోలో నిరసనలు తెలిపారు. ఇటీవల ప్రధాని ఆఫీసు వద్దే ఓ నిరసనకారుడు ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ నేపథ్యంలో షింజో అంత్యక్రియలకు భారీగా బందోబస్త్ ఏర్పాటు చేశారు. మరోవైపు అబే అంత్యక్రియలకు ప్రభుత్వం166 కోట్ల యెన్ లు (రూ. 96 కోట్లు) ఖర్చు చేస్తుండటం, ఇందులో అత్యధికంగా సెక్యూరిటీకే వినియోగిస్తుండటంపైనా విమర్శలు వస్తున్నాయి.