PNB స్కాం కేసు : నీరవ్ మోడీ అరెస్ట్

PNB స్కాం కేసు : నీరవ్ మోడీ అరెస్ట్

లండన్: బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్  మోడీ లండన్ లో అరెస్టయ్యారు. రెండు రోజుల క్రితమే బ్రిటన్ కోర్టు అతని అరెస్ట్ కు వారెంట్ జారీ చేయగా.. కాసేపటి క్రితమే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నీరవ్ మోడీ భారత్ నుంచి పారిపోయిన 17 నెలల తర్వాత అరెస్టయ్యారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు సుమారు 14 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడు నీరవ్ మోడీ. బ్రిటన్ కు పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. నీరవ్ ను భారత్  తీసుకొచ్చేందుకు సీబీఐ, ఈడీ తీవ్ర ప్రయత్నాలు చేశాయి. నీరవ్ ను తమకు అప్పగించాలని మార్చి 9న లండన్ లోని హోంశాఖ కార్యాలయానికి ఈడీ లేఖ రాసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న లండన్  కోర్టు అతడికి అరెస్టు వారెంటు జారీ చేసింది.

నీరవ్  మోడీ మారువేషంలో లండన్ లో వజ్రాల వ్యాపారం చేస్తున్నాడంటూ ఇటీవల అక్కడ ఓ పత్రిక ప్రచురించింది.  ఓ ఖరీదైన కోటును ధరించిన నీరవ్ .. అక్కడ ఓ పాత్రికేయుడికి తారసపడటంతో అతడు లండన్ లో ఉన్నట్టు తెలిసింది. దీంతో అతణ్ని భారత్ రప్పించడానికి ఇక్కడి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.