పోచంపల్లి ఇక్కత్ తెలంగాణకే గర్వకారణం..‘త్రెడ్ పోచంపల్లి’ ప్రదర్శనలో మంత్రి ఉత్తమ్

పోచంపల్లి ఇక్కత్ తెలంగాణకే గర్వకారణం..‘త్రెడ్ పోచంపల్లి’ ప్రదర్శనలో మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళాత్మక నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిన పోచంపల్లి ఇక్కత్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందడం  తెలంగాణకు గర్వకారణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌‌‌‌లో నిర్వహిస్తున్న ‘త్రెడ్ పోచంపల్లి’ ప్రత్యేక ప్రదర్శనకు మంత్రి హాజరై మాట్లాడారు.  పోచంపల్లి ఇక్కత్  వస్త్ర కళ మాత్రమే కాదని, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సృజనాత్మకత, సంప్రదాయ జీవన విధానానికి అద్దం పట్టే అద్భుత కళారూపమని ఆయన అభివర్ణించారు.

చేనేత కార్మికుల కష్టం, పట్టుదల, నైపుణ్యం వల్లే పోచంపల్లి పేరు ప్రపంచ పటంలో నిలిచిందని కొనియాడారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సంక్షేమ కార్యక్రమాలు, మార్కెటింగ్ అవకాశాలు, ఆర్థిక సాయం, శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మరింత గుర్తింపు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.