
- నిజామాబాద్–కామారెడ్డి–మెదక్ జిల్లాల మధ్య రాకపోకలు బంద్
మెదక్, వెలుగు: పోచారం ప్రాజెక్ట్ వరద ఉధృతికి మెదక్– - కామారెడ్డి జిల్లాల సరిహద్దులోని నేషనల్ హైవే 765డీ కొట్టుకుపోయింది. కామారెడ్డి జిల్లాలో గత రెండు, మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పోచారం ప్రాజెక్ట్ పూర్తిగా నిండి పొంగి పొర్లుతున్నది. ప్రాజెక్ట్ పైనుంచి 70 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. దీంతో ఆనకట్ట దిగువన 3 రోజులుగా వరద ఉధృతి కొనసాగుతున్నది. వరద తాకిడికి పోచమ్మరాల్ శివారులో బ్రిడ్జి వద్ద రోడ్డు సుమారు 50 మీటర్ల మేర పూర్తిగా కొట్టుకుపోయింది. మరో దగ్గర పెద్ద గండి పడిం ది. దీంతో కామారెడ్డి–- మెదక్ జిల్లాలకు రహదారి బంధం తెగిపోయింది.
నిజామాబాద్, బోధన్, బాన్సువాడ ఆర్టీసీ డిపోల నుంచి మెదక్ మీదుగా హైదరాబాద్‌కు నడిచే ఆర్టీసీ బస్సులు, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే గూడ్స్ వెహికల్స్, ఫ్యాక్టరీలకు ముడి సరుకు, ఉత్పత్తులు రవాణా చేసే పెద్ద పెద్ద కంటెయినర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బుధవారం రాత్రి నుంచి ఈ రూట్లో రాకపోలు పూర్తిగా స్తంభించిపోగా, పోచారం ప్రాజెక్ట్ వరద ఉధృతి కొనసాగుతుండటంతో తెగిపోయిన చోట రోడ్డును నిర్మించడానికి రెండు, మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల మధ్య రాకపోకలు కొనసాగే పరిస్థితి కనిపించడంలేదు.