
కోల్‌బెల్ట్, వెలుగు: తమ భూములకు పట్టాలు ఇవ్వాలని రైతులు పట్నం బాట పట్టారు. ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం దిందా గ్రామ పోడు రైతులు చేపట్టిన ఛలో హైదరాబాద్ పాదయాత్ర శుక్రవారం మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. వీరికి క్యాతనపల్లి మున్సిపాలిటీలోని అండర్ బ్రిడ్జి వద్ద బీజేపీ లీడర్లు సంఘీభావం పలికారు. మూడు రోజుల క్రితం గ్రామం నుంచి పలువురు రైతులు, యువకులు కుటుంబసభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు హైదరాబాద్‌కు పాదయాత్ర ప్రారంభించారు.
రైతులు, మహిళలు నెత్తిన మూట, సంకన నీటి డబ్బాలతో 400 కిలోమీటర్ల పాదయాత్రకు పయణమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 50ఏండ్లగా పోడు భూముల్లో పంటలు పండించుకుంటూ కుటుంబాలను సాకుతుంటే అటవీశాఖ ఆఫీసర్లు తమ భూములు లాక్కుంటూ జీవనాధారం లేకుండా చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తమకు పట్టాలు ఇప్పించి కష్టాలు తీర్చాలని బతిమలాడుకుంటామని పేర్కొన్నారు.