
మంచిర్యాల, వెలుగు : తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, రైతు సంఘం, వ్యవసాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని పోడు రైతులు మంగళవారం కలెక్టరేట్‌ను ముట్టడించి ధర్నా చేపట్టారు. పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలని, సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ.. చాలా గ్రామాలను పోడు జాబితాలో చేర్చకపోవడంతో రైతులకు పట్టాలు రావడం లేదన్నారు.
జన్నారం మండలం తపాల్పూర్కు చెందిన ఆత్రం రాజును అక్రమ కేసులో ఇరికించి జైలులో పెట్టారని మండిపడ్డారు. కోటపల్లి రేంజ్‌పరిధిలోని అన్ని గ్రామాల్లో అటవీ హక్కు పత్రాలు వచ్చినా సాగు చేసుకోనివ్వడం లేదన్నారు. ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంగారు రవికుమార్ మాట్లాడుతూ.. కోటపల్లి మండలం లింగన్నపేటకు చెందిన బాగాల చంద్రయ్య, బాగాల రవి భూమి దున్నుండగా ఫారెస్ట్ఆఫీసర్లు
వారిని అదుపులోకి తీసుకుని రెండు రోజులు ఆఫీస్‌లో బంధించారని తెలిపారు. 20 రోజులవుతున్నా వారి బైక్ఇవ్వలేదన్నారు. పోడు రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, పోడు గ్రామాలను జాబితాలో చేర్చి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ కలెక్టర్ కుమార్‌దీపక్‌కు మెమోరాండం అందజేశారు.