అధికారికంగా ప్రకటించకుండానే.. పోడు భూముల సర్వే

అధికారికంగా ప్రకటించకుండానే.. పోడు భూముల సర్వే

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో పోడు భూముల సర్వే మొదలైంది. జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట మండలాల్లో నాలుగైదు రోజులుగా ఈ సర్వే సాగుతోంది. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ప్రకటన లేకుండానే సర్వే చేస్తుండడం చర్చానీయాంశంగా మారింది. మరోవైపు సర్వే చేస్తున్న తీరుపై పార్టీలతో పాటు ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాటిలైట్​ ఫొటోల ఆధారంగా కాకుండా దరఖాస్తుల ఆధారంగా ఫీల్డ్​లో పరిశీలించాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని కమ్యూనిస్టు పార్టీల నాయకులు హెచ్చరిస్తున్నారు. 

గుట్టు చప్పుడు కాకుండా సర్వే

జిల్లాలో పోడు భూముల పట్టాల కోసం 83,663 దరఖాస్తులు వచ్చాయి. పోడు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లాల వారీగా కమిటీలను వేసింది. కమిటీల్లో ప్రజాప్రతినిధులెట్లా ఉంటారంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. తమ తీర్పు వచ్చేంత వరకు కమిటీలు మీటింగులు పెట్టొద్దని హైకోర్టు పేర్కొనడంతో సర్వేపై సందిగ్ధం నెలకొంది. ఇదిలాఉంటే దసరా తర్వాత పోడు భూములపై సర్వే మొదలు పెట్టే అవకాశం ఉందని ఇటీవల కలెక్టర్​ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిబంధనల ప్రకారం సర్వే ఉంటుందని చెప్పారు. కాగా దసరాకు ముందు నుంచే పోడు భూముల సర్వే మొదలు పెట్టారు. అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట మండలాల్లో వ్యవసాయ, రెవెన్యూ, ఫారెస్ట్​, పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నారు. మరోవైపు శాటిలైట్​ ఫొటోల ఆధారంగా సర్వే చేపట్టడంతో పోడు సాగుదారులకు తీవ్ర నష్టం జరుగుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండానే అధికారులు సర్వే చేపట్టడంలో అంతర్యమేమిటని పార్టీలు, ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. 

ప్రైమరీ సర్వేనే..

పోడు భూములపై అధికారికంగా సర్వే చేపట్టడడం లేదు. ప్రైమరీ సర్వే చేస్తున్నాం. ఐటీడీఏ పీఓ, కలెక్టర్​తో చర్చించిన తర్వాత సర్వే మొదలు పెడ్తాం. అర్హులైన వారందరికీ న్యాయం చేస్తాం. అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.
- లక్ష్మణ్​ రంజిత్​ నాయక్