కవయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత

కవయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత

వరంగల్‍, వెలుగు: ప్రముఖ కవయిత్రి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత (67)  సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె తన రచనలతో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. స్త్రీకి సామాజిక సమానత్వం కోసం రచనలు సాగించారు. 2017లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. హనుమకొండలో 1958 ఏప్రిల్‍ 14న జన్మించిన రజిత.. 1973లో ‘‘చైతన్యం పడగెత్తింది”అనే తొలి రచనతో సాహిత్య ప్రయాణాన్ని ప్రారంభించారు.  ‘‘గులాబీలు జ్వలిస్తున్నాయి.. నేనొక నల్లమబ్బునవుతా.. చెమట చెట్టు.. ఓ లచ్చవ్వ.. ఉసురు.. గోరంత దీపాలు.. దస్తఖత్‍.. అనగనగా కాలం” వంటి ఆమె రచనలు విశేష ఆదరణ పొందాయి.  

ఆదివారం హనుమకొండ నయీంనగర్‍లోని వాగ్దేవి కాలేజీ సెమినార్‍ హాల్‍లో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణలో రజిత పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్‍, సింగరాజు రమాదేవి, శ్రీలా సుభద్రదేవి, పుప్పాల శ్రీరామ్‍, ఆకునూరి విద్యాదేవి, బిల్ల మహేందర్‍, పల్లె శ్రీను తదితరులు సోమవారం రజిత మరణ వార్తను విని నమ్మలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనిశెట్టి రజిత అవివాహితురాలు. ఆమె గోపాల్పూర్ లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటుండగా..  ఇంట్లోనే గుండెపోటుకు గురయ్యారు. హాస్పిటల్​కు తరలించేలోపే మరణించారు. ప్రొఫెసర్, రచయిత్రి కాత్యాయనీ విద్మహే నివాసానికి రజిత మృతదేహాన్ని తరలించారు.